Sakshi News home page

ముచ్చటగా మూడోసారి గెలుస్తా..

Published Tue, Nov 28 2023 2:00 AM

- - Sakshi

సాక్షి, వరంగల్‌ : ‘బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ సారథ్యంలో వర్ధన్నపేట నియోజకవర్గలో అనేక అభివృద్ధి పనులు చేశాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలే నా ప్రచారాస్త్రాలు. నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు ఎదురే లేదు. ప్రజల ఆశీర్వాదంతో హ్యాట్రిక్‌ విజయం సాధిస్తా. నాకు ప్రత్యర్థి ఎవరూ లేరు. గతం కంటే ఈసారి మెజారిటీ ఎక్కువగానే వస్తుంది’ అని అంటున్నారు బీఆర్‌ఎస్‌ వర్ధన్నపేట నియోజకవర్గ అభ్యర్థి అరూరి రమేశ్‌. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

పేదలకు అండగా నిలిచాం..

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రూ.72,185 కోట్ల రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశాం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ద్వారా పేదలకు అండగా నిలిచాం. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గృహలక్ష్మి, దళిత బంధు, బీసీ బంధు పథకాలు అర్హులకు అందిస్తా. ఈ పథకాలన్నీ నిరంతర ప్రక్రియ.

రూ.4,354 కోట్లతో అభివృద్ధి..

వర్ధన్నపేటను రూ.4,354 కోట్లతో అభివృద్ధి చేశా. 90 శాతం హామీలను నెరవేర్చా. ఇంకా మిగిలిన అభివృద్ధి పనులను తిరిగి అధికారంలోకి వచ్చాక పూర్తిచేస్తా. గ్రేటర్‌ వరంగల్‌లో విలీనమైన 31 గ్రామాల అభివృద్ధికి రూ.400 కోట్ల నిధులు తీసుకొచ్చా. వర్ధన్నపేటను మునిసిపాలిటీగా చేసి రూ.164 కోట్లతో అభివృద్ధి చేశా. ఆకేరు వాగుపై బ్రిడ్జి కం చెక్‌ డ్యాం నిర్మించాం. రవాణా సౌకర్యాలు కల్పించా. హసన్‌పర్తి పెద్ద చెరువుపై రూ.ఐదు కోట్లతో మినీ ట్యాంకుబండ్‌ అభివృద్ధి చేశా.

సీహెచ్‌సీ అప్‌గ్రేడ్‌..

వర్ధన్నపేటలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌ సీ)ను రూ.26 కోట్లతో 100 పడకలకు అప్‌గ్రేడ్‌ చేస్తాం. ఇందుకోసం టెండర్‌ కూడా అయింది. ఎన్నికల కోడ్‌తో పనులు ఆగిపోయాయి. త్వరలోనే పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. కోనారెడ్డి చెరువును రూ.14 కోట్లతో మరమ్మతులు చేశాం. జూనియర్‌ కళాశాల నిర్మాణానికి రూ.14.5 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. మళ్లీ గెలవగానే పనులు ముందుకు తీసుకెళ్తా.

యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తా...

ఐటీకి కేరాఫ్‌గా మడికొండను అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే అనేక కంపెనీలు వచ్చాయి. భవిష్యత్‌లో వచ్చే కంపెనీలతో యువతకు మరిన్ని ఉద్యోగాలు రానున్నాయి. నియోజకవర్గంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటుచేసి మహిళలు, యువకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తాం. అలాగే, అరూరి గట్టుమల్లు మెమోరియల్‌ ఫౌండేషన్‌ ద్వారా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇప్పించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా కృషి చేస్తా. ప్రైవేట్‌ రంగంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి జాబ్‌మేళాలు నిర్వహిస్తా.

90 శాతం హామీలు నెరవేర్చా

దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి నిరంతర ప్రక్రియ

మడికొండ ఐటీపార్కుతో యువతకు ఉపాధి అవకాశాలు

నాకు ప్రత్యర్థి ఎవరూ లేరు..

గతం కన్నా మెజార్టీ ఎక్కువ వస్తుంది

‘సాక్షి’తో బీఆర్‌ఎస్‌ వర్ధన్నపేట

ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్‌

మామునూరు ఎయిర్‌పోర్టుకు మా నుంచి క్లియర్‌..

ఎయిర్‌పోర్టు అథారిటీ అడిగిన మేరకు 400 ఎకరాలకుపైగా భూమి సమీకరించి అప్పగించాం. రాష్ట్ర ప్రభుత్వపరంగా అన్ని పనులు పూర్తి చేశాం. కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఇక్కడా పనులు మొదలవుతాయి. అలాగే, మడికొండలోని డంపింగ్‌యార్డు తొలగిస్తా. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో జర్మనీ కంపెనీ ఆధ్వర్యంలో అక్కడ చెరువు సుందరీకరణ పనులు ఫైనల్‌ అయ్యాయి.

మాది ప్రజామేనిఫెస్టో..

బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను సీఎం కేసీఆర్‌ అమలు చేస్తారనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ఆసరా పింఛన్‌దారులకు రూ.5 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌, రేషన్‌ కార్డుదారులకు సన్న బియ్యం అందించనున్నాం. రైతు బంధు రూ.16 వేలకు పెంచుతాం. పేదలకు రూ.ఐదు లక్షల కేసీఆర్‌ బీమా, రూ.15 లక్షలకు వరకు ఆరోగ్యరక్ష వంటి పథకాలు అధికారంలోకి రాగానే అమలు చేస్తాం.

Advertisement

What’s your opinion

Advertisement