రానివ్వొద్దు | Sakshi
Sakshi News home page

రానివ్వొద్దు

Published Tue, Mar 5 2024 7:20 AM

 కీసరగుట్ట బ్రహ్మోత్సవాల తుది ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌ - Sakshi

భక్తులకు ఇబ్బందులు

కీసర: మహాశివరాత్రి సందర్భంగా మార్చి 6 నుండి 11వ తేదీవరకు జరుగనున్న కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు అధికారులు, సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. సోమవారం అదనపు కలెక్టర్లు అభిషేక్‌ అగస్త్య, విజయేందర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులతో కలిసి జిల్లాకలెక్టర్‌ గౌతమ్‌ కీసరగుట్ట జాతరకు సంబందించి క్షేత్రస్థాయిలో తుది ఏర్పాట్లు పరిశీలించారు. పార్కింగ్‌, క్యూలైన్లు, జాతర జరిగే ప్రాంతంలో కలెక్టర్‌ స్వయంగా పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా పరిషత్‌ గెస్ట్‌ హౌజ్‌ నుండి ప్రధాన క్యూలైన్ల వరకు 8 ఫీట్లమేర వెడ్పలుతో చలువ పందిళ్లు వేయాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. అనంతరం జాతరపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం గతేడాది కంటే కీసరగుట్టకు భక్తులు ఎక్కువ సంఖ్యలోవచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న నేపథ్యంలో వారు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని, ఇందుకోసం సుమారు 300 బస్సులను జాతర సందర్బంగా వివిధ ప్రాంతాల నుండి నడపడం జరుగుతుందన్నారు. 8, 9 వతేదీల్లో యాత్రికుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంటుందని, ఈ రెండు రోజులు అన్నిశాఖల అధికారులు గుట్టలోనే ఉంటూ సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. సామాన్యభక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శనం అయ్యేవిధంగా ఈసారి మూడు క్యూలైన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆలయ చైర్మన్‌ నాగలింగం, ఈఓ నరేందర్‌ కలెక్టర్‌కు వివరించారు. జాతరలో 1800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని డీసీపీ పద్మజారాణి తెలిపారు. అంతకుముందు కలెక్టర్‌ గౌతమ్‌, అదనపు కలెక్టర్లు అభిషేక్‌ అగస్త్య, విజయేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, జెడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, ఆర్డీవో వెంకట ఉపేందర్‌రెడ్డిలు స్వామివారిసేవలో పాల్గొన్నారు.

కీసరగుట్టలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌

కీసర బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి

మేడ్చల్‌ కలెక్టర్‌ గౌతమ్‌ ఆదేశాలు

Advertisement
Advertisement