ప్రపంచ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న భారత సంతతి నేతలు | Sakshi
Sakshi News home page

Indian Origin Leaders: ప్రపంచాన్ని ఏలుతున్న భారత సంతతి నేతలు

Published Sun, Sep 3 2023 8:34 AM

Indian Origin Leaders Dominating World Politics - Sakshi

భారత సంతతికి చెందిన పలువురు నేతలు ప్రపంచంలోని వివిధ దేశాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో దేశం చేరింది. సింగపూర్ నూతన అధ్యక్షునిగా భారత సంతతికి చెందిన థర్మన్‌ షణ్ముగరత్నం బాధ్యతలు చేపట్టారు. ఫలితంగా ప్రపంచంలోని పలు దేశాల రాజకీయాల్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న భారతీయ మూలాలు కలిగిన నేతల జాబితాలో షణ్ముగరత్నం చేశారు. 

షణ్ముగరత్నం 70 శాతం ఓట్లతో ఘనవిజయం సాధించారు. ఆయన సింగపూర్ తొమ్మిదవ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. షణ్ముగరత్నం పదవీకాలం ఆరు సంవత్సరాలు. పెరుగుతున్న భారత సంతతినేతల ప్రభావం
సింగపూర్‌ ప్రధాని లీ సీన్‌ లూంగ్‌ నూతన అధ్యక్షుడు థర్మన్‌ షణ్ముగరత్నం అభినందించారు. ప్రపంచ స్థాయిలో ఉన్నత పదవికి ఎన్నికైన భారతీయ వారసత్వానికి చెందిన అనేక మంది నాయకులలో థర్మన్‌ షణ్ముగరత్నం కూడా చేరారని ఆయన అన్నారు. షణ్ముగరత్నం విజయం ప్రపంచ వ్యాప్తంగా భారతీయుల ప్రభావానికి ప్రతీక అని లూంగ్ అన్నారు.

ప్రపంచ రాజకీయాల్లో భారత సంతతి నేతలు..
1. అమెరికాలో భారతీయ-అమెరికన్ కమ్యూనిటీకి పెరుగుతున్న ప్రభావం కమలా హారిస్ విజయంతో స్పష్టంగా కనిపిస్తుంది. అమెరికాకు తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్‌గా భారతీయ సంతతికి చెందిన హారిస్ నియమితులయ్యారు. దీనికి ముందు ఆమె 2017 నుండి 2021 వరకు కాలిఫోర్నియా సెనేటర్‌గా ఉన్నారు. డెమొక్రాట్ అయిన హారిస్ 2011 నుండి 2017 వరకు కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా కూడా పనిచేశారు. ఆమె కాలిఫోర్నియాలో ఇండియన్‌, జమైకన్ తల్లిదండ్రులకు జన్మించారు.

2. అమెరికా మధ్యంతర ఎన్నికలలో అధికార డెమొక్రాట్ పార్టీ నుండి ఐదుగురు భారతీయ మూలాలు కలిగిన నేతలు తమ హవా చాటారు. వారిలోరాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జయపాల్, అమీ బెరా, శ్రీ తానేదార్ ఉన్నారు. వీరు యూఎస్‌ ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.
ఇది కూడా చదవండి: 10 అనవసర విషయాలు.. వీటి జోలికి వెళ్లకపోవడమే శ్రేయస్కరం!

3. కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన చెందిన ప్రముఖ రాజకీయ నేత హర్మీత్ ధిల్లాన్ ఇటీవలే రిపబ్లికన్ నేషనల్ కమిటీ (ఆర్‌ఎన్‌సీ) చైర్మన్ ఎన్నికలలో పోటీ చేశారు.

4. భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి వంటి నేతలు వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి తమ అభ్యర్థిత్వాన్ని సమర్పించారు.

5. రిషి సునాక్‌ గత ఏడాది బ్రిటన్‌కు మొదటి భారతీయ సంతతికి చెందిన ప్రధాన మంత్రి అయ్యారు. గోవాకు చెందిన సుయెల్లా బ్రేవర్‌మన్ అతని హోం సెక్రటరీగా పనిచేస్తున్నారు. బ్రేవర్‌మాన్ తర్వాత సునాక్‌ క్యాబినెట్‌లో గోవా మూలాలు కలిగిన రెండవ మంత్రి క్లైర్ కౌటిన్హో. కౌటిన్హో ఇటీవలే నూతన ఎనర్జీ సెక్యూరిటీ, నెట్ జీరో సెక్రటరీగా ప్రమోషన్ అందుకున్నారు.

6. సునాక్ కంటే ముందు ప్రీతి పటేల్.. బోరిస్ జాన్సన్ క్యాబినెట్‌లో హోం సెక్రటరీగా ఉన్నారు. జాన్సన్ క్యాబినెట్‌లో అలోక్ శర్మ అంతర్జాతీయ అభివృద్ధి కార్యదర్శిగా వ్యవహరించారు.

7. ఐర్లాండ్ ప్రధాన మంత్రి లియో ఎరిక్ వరద్కర్ కూడా భారతీయ సంతతికి చెందిన వారే కావడం గమనార్హం. వరద్కర్.. అశోక్, మిరియం వరద్కర్ దంపతుల మూడవ సంతానం. ఎరిక్ వరద్కర్ తండ్రి ముంబైలో జన్మించారు. 1960లలో యునైటెడ్ కింగ్‌డమ్‌కు తరలి వెళ్లారు.

8. ఆంటోనియో కోస్టా 2015 నుండి పోర్చుగల్ ప్రధాన మంత్రిగా ఉన్నారు. అతను సగం భారతీయుడు.. సగం పోర్చుగీస్.

9. కెనడాలో ఫెడరల్ మంత్రి అయిన మొదటి హిందువు అనితా ఆనంద్. ఆనంద్ ఈ ఏడాది జూలైలో ట్రెజరీ బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె తల్లిదండ్రులు భారతీయులు. తండ్రి తమిళనాడు, తల్లి పంజాబ్‌కు చెందినవారు.

10. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో  మంత్రివర్గంలో మరో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన సభ్యులు కూడా ఉన్నారు. వారు హర్జిత్ సజ్జన్, కమల్ ఖేరా.

11. ప్రియాంక రాధాకృష్ణన్ న్యూజిలాండ్‌లో మంత్రి అయిన మొదటి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. మలయాళీ తల్లిదండ్రులకు చెన్నైలో జన్మించిన ఆమె ప్రస్తుతం కమ్యూనిటీ, వాలంటరీ సెక్టార్‌కు మంత్రిగా ఉన్నారు.

12. ట్రినిడాడ్, టొబాగో అధ్యక్షునిగా ఎన్నికైన క్రిస్టీన్ కార్లా కంగాలూ.. ఇండో-ట్రినిడాడియన్ కుటుంబంలో జన్మించారు.

13. భారత సంతతికి చెందిన న్యాయవాది, రచయిత ప్రీతమ్ సింగ్ 2020 నుండి సింగపూర్‌లో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు.

14. దేవానంద్ శర్మ 2019లో ఆస్ట్రేలియన్ పార్లమెంట్ సభ్యుడైన మొదటి భారతీయ సంతతికి చెందిన వ్యక్తిగా నిలిచారు.

15. గయానా అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ లియోనోరాలో ముస్లిం ఇండో-గయానీస్ కుటుంబంలో జన్మించారు.

16. ప్రవింద్ జుగ్నాథ్ జనవరి 2017 నుండి మారిషస్ ప్రధాన మంత్రిగా ఉన్నారు. అతను 1961లో హిందూ యదువంశీ కుటుంబంలో జన్మించారు. అతని ముత్తాత 1870లలో భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి మారిషస్‌కు వలస వెళ్లారు.

17. 2019 నుండి మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ సింగ్ రూపన్ భారతీయ ఆర్య సమాజ్ హిందూ కుటుంబంలో జన్మించారు.

18. చంద్రికాప్రసాద్ సంతోఖి 2020 నుండి సురినామ్ అధ్యక్షుడిగా ఉన్నారు. సంతోఖి 1959లో లెలీడోర్ప్‌లో ఇండో-సురినామ్ హిందూ కుటుంబంలో జన్మించారు.

19. వేవెల్ రాంకలవాన్ అక్టోబర్ 2020 నుండి సీషెల్స్ అధ్యక్షుడిగా ఉన్నారు. అతని తాత బీహార్‌కు చెందినవారు.

భారతీయ వారసత్వానికి చెందిన 200 మందికి పైగా నాయకులు ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల్లో ప్రజా సేవలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని ఇండియాస్పోరా గవర్నమెంట్ లీడర్స్ లిస్ట్ తెలియజేస్తోంది. వీరిలో 60 మందికిపైగా నేతలు కేబినెట్ పదవుల్లో ఉన్నారు.
ఇది కూడా చదవండి: నగరాలకు చెట్లు అందించే 12 ప్రయోజనాలివే!

Advertisement
Advertisement