ఎక్కువ మందిని కనండి: కిమ్‌

5 Dec, 2023 05:50 IST|Sakshi

సియోల్‌: దేశాన్ని బలోపేతం చేయాలంటే  జననాలను పెంచటం మహిళల విధి అని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జొంగ్‌ ఉన్‌ చెప్పారు. ఆదివారం జరిగిన నేషనల్‌ మదర్స్‌ సమావేశంలో కిమ్‌ ప్రసంగిస్తూ ఎక్కువ మంది పిల్లలను కనాలని మహిళలకు పిలుపునిచ్చారు. జననాల రేటు క్షీణతను అడ్డుకోవడం, చిన్నారుల సంరక్షణ, విద్య అనేవి తల్లుల వల్లే సాధ్యమవుతాయని చెప్పారు.

దేశ జనాభా గణాంకాలను ఉత్తరకొరియా ప్రభుత్వం బహిర్గతం చేయడం లేదు. అయితే, అక్కడ గత పదేళ్లుగా జననాల రేటు తగ్గుతూ వస్తోందని పొరుగు దేశం దక్షిణ కొరియా అంటోంది. పిల్లల పెంపకం, చదువు చెప్పించడం వంటివి చాలా ఖరీదైన వ్యవహారంగా మారడంతో ఉత్తర కొరియాలోని చాలా కుటుంబాలు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనేందుకు సిద్ధంగా లేరని పరిశీలకులు అంటున్నారు. దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కార్మికుల సమీకరణపై ఆధారపడే ఆ దేశానికి ఈ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

>
మరిన్ని వార్తలు