మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు | Sakshi
Sakshi News home page

మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు

Published Mon, Jan 8 2024 10:35 AM

Maldives Envoy Summoned Amid Remarks Against PM Modi - Sakshi

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ క్రమంలో మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్‌కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్‌కు ఆయన వచ్చివెళ్లినట్లు సమాచారం. వివాదంపై రెండు దేశాలు సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులపై మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్‌ చేశారు. అవి ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు.

మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. పర్యాటకంలో మాల్దీవులతో లక్షద్వీప్‌ ఏ మాత్రమూ సరితూగదంటూ ఎద్దేవా చేశారు. ‘‘భారత్‌లో హోటల్‌ గదులు అసహ్యంగా ఉంటాయి. మా దేశంతో లక్షద్వీప్‌కు పోలికేమిటి?’’ అంటూ మాల్దీవుల ఎంపీ జహీద్‌ రమీజ్‌ కూడా నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై మాల్దీవుల్లోని భారత హైకమిషన్‌ కార్యాలయం అధికారులు నిరసన తెలిపారు. దుమారం నేపథ్యంలోవారి వ్యాఖ్యలను ‘ఎక్స్‌’ నుంచి తొలగించారు.

బైకాట్ మాల్దీవులు..

ఈ వివాదంపై నెటిజన్లు ఫైరయ్యారు. మాల్దీవుల పర్యాటకాన్ని రద్దు చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు. బైకాట్ మాల్దీవులు అంటూ నినదించారు. మాల్దీవుల మంత్రుల నోటి దురుసును సెలబ్రెటీలు క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్, బాలీవుడ్‌ నటులు అక్షయ్‌ కుమార్, సల్మాన్‌ ఖాన్, జాన్‌ అబ్రహం, శ్రద్ధా కపూర్‌ తదితరులు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారు. వారి విద్వేష వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయని అక్షయ్‌ అన్నారు. 

దిద్దుబాటు చర్యలు

ఈ వ్యాఖ్యలపై మాల్దీవుల ప్రభుత్వం కూడా స్పందించి దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. మంత్రులను పదవి నుంచి సస్పెండ్ చేసింది. మంత్రుల వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని స్పష్టం చేసింది. ఆ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఈ వివాదం ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆశాభావం వ్యక్తం చేసింది. 

ఇదీ చదవండి: మోదీపై అనుచిత పోస్టు.. మాల్దీవుల టూర్‌ను రద్దు చేస్తున్న నెటిజన్లు

Advertisement
Advertisement