North Korea Blamed United States For The Crisis In Ukraine, Details Inside In Telugu - Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌పై దాడికి కారణం అమెరికానే: ఉత్తర కొరియా

Published Mon, Feb 28 2022 7:31 AM

North Korea Blamed United States For The Crisis In Ukraine - Sakshi

సియోల్‌: ఉక్రెయిన్‌ సంక్షోభానికి అసలు సిసలు కారణం అమెరికాయేనని ఉత్తర కొరియా ఆరోపించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత తొలిసారిగా స్పందించిన ఉత్తర కొరియా అమెరికాను నిందిస్తూ విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌లో ఒక పోస్టు ఉంచింది. రష్యా తమ దేశ భద్రత కోసం చేసిన డిమాండ్లను నిర్లక్ష్యం చేస్తూ అమెరికా తన మిలటరీ ఆధిపత్యాన్ని పెంచుకోవడానికే ప్రయత్నించిందని ఆరోపించింది.

ఉత్తర కొరియా సొసైటీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ పాలిటిక్స్‌ స్టడీకి చెందిన అధ్యయనకారుడు రి జి సింగ్‌ పేరిట ఉన్న ఆ పోస్టుని ఆదివారం అప్‌లోడ్‌ చేసింది. ‘‘ఉక్రెయిన్‌ సంక్షోభానికి మూల కారణం అమెరికాయే. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ తన ఆధిపత్యాన్ని ఇతర పక్షాలపై రుద్దే ప్రయత్నం చేసింది’’ అని తీవ్రంగా ఆరోపించింది.

శాంతి సుస్థిరతల పేరుతో అమెరికా ఇతర దేశాల అంతర్జాతీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని, అదే ఇతర దేశాలు తమ ఆత్మరక్షణ కోసం మరో దేశం గురించి ఏదైనా మాట్లాడినా అగ్రరాజ్యం సహించలేకపోతోందని రి ధ్వజమెత్తారు. అమెరికాకి అధికార దాహం ఎక్కువని, ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని కోల్పోతే ఆ దేశం అసలు సహించలేదన్నారు. అయితే ఒక అధ్యయనకారుడు రాసిన వ్యక్తిగత అభిప్రాయాన్ని విదేశాంగ శాఖ తన వెబ్‌సైట్‌ ఎందుకు ఉంచిందన్న చర్చ జరుగుతోంది.   

Advertisement
Advertisement