కవ్విస్తున్న ఉత్తర కొరియా | Sakshi
Sakshi News home page

కవ్విస్తున్న ఉత్తర కొరియా

Published Fri, Jan 28 2022 5:29 AM

North Korea Launches 2 Ballistic Missiles Says South Korea  - Sakshi

సియోల్‌: ఆయుధ పరీక్షలను ఉత్తర కొరియా ఆపట్లేదు. వరుస పెట్టి ప్రయోగాలు చేస్తూ పక్క దేశాలను భయపెడుతోంది. ఉద్రిక్తతలను పెంచేలా గురువారం మరోసారి రెండు బాలిస్టిక్‌ మిసైళ్లను సముద్రంలోకి ప్రయోగించింది. దీంతో ఈ నెలలో ఆ దేశం చేపట్టిన ప్రయోగాల సంఖ్య ఆరుకు చేరుకుందని దక్షిణ కొరియా మిలటరీ వెల్లడించింది. ఉత్తర కొరియాలోని హామ్‌హంగ్‌ టౌన్‌ నుంచి ఈ ప్రయోగాలు జరిగాయని, 5 నిమిషాల వ్యవధిలో రెండు మిసైళ్లను వదిలారని తెలిపింది.

ఈ ప్రయోగాల వల్ల జపాన్‌ తీరంలో నౌకలు, విమానాలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిడ తెలిపారు. అమెరికాతో ఆగిపోయిన అణ్వస్త్ర దౌత్య చర్చలు మళ్లీ జరిగేలా, తమపై విధించిన ఆంక్షలను ఎత్తేసేలా ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతో ఉత్తర కొరియా ఇలా ప్రయోగాలు చేస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బైడెన్‌ సర్కారు ఉత్తర కొరియాతో అణ్వస్త్రాల నిరోధానికి సంబంధించి చర్చలు ప్రారంభించినా.. ఆయుధాలను కిమ్‌ పూర్తిగా విడిచిపెట్టే వరకూ ఆంక్షలు తొలగించకూడదని భావిస్తోంది. 2016 నుంచి అంతర్జాతీయ ఆంక్షలు కొనసాగుతుండటంతో ఉత్తర కొరియా ప్రధాన ఎగుమతి కార్యకలాపాలు చాలా వరకు ఆగిపోయాయి.

చైనా వైపు మళ్లీ తెరుచుకున్న సరిహద్దులు?
కరోనా వల్ల దాదాపు రెండేళ్ల పాటు కఠినమైన లాక్‌డౌన్‌ పెట్టిన ఉత్తర కొరియా.. సరిహద్దులను క్రమం గా తెరుస్తోంది. చైనా నుంచి సరుకు రవాణాను తిరిగి ప్రారంభించడంతో ఈ విషయం స్పష్టమవుతోంది. గత వారం యాలూ నదిని దాటి ఉత్తర కొరియాకు గూడ్స్‌ రైలు వచ్చిందని, సరుకును ఖాళీ చేసిందని వాణిజ్య శాటిలైట్‌ చిత్రాలు చెబుతున్నాయి. అమెరికా ఆంక్షలతో తలకిందులైన ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా వల్ల మరింత దిగజారిందని తాజా పరిణామాల వల్ల తెలుస్తోంది.

అయితే దక్షిణ కొరియాలోని ఓ వర్గం మీడియా మాత్రం.. కిమ్‌ తండ్రి 80వ పుట్టిన రోజు వేడుకలు వచ్చే నెలలో జరగనున్నాయని, ఆ తర్వాత ఏప్రిల్‌ నెలలో తన తాత 110 పుట్టిన రోజు ఉందని, ఈ వేడుకలకు గాను ప్రజలకు అవసరమైన ఆహారం, ఇతర నిత్యావసరాలను బహుమతిగా అందివ్వడానికి తాత్కాలికంగా సరిహద్దును తెరిచినట్టు చెబుతోంది. దక్షిణ కొరియా లెక్కల ప్రకారం చైనాతో ఉత్తర కొరియా వాణిజ్యం 2020 దాదాపు 80 శాతం తగ్గింది. 2021లో సరిహద్దులు మూసేయడంతో మళ్లీ 2/3 వంతు తగ్గిపోయింది. ఉత్తర కొరియాలో ఇంకా వ్యాక్సినేషన్‌ మొదలు కాలేదు. సరిహద్దులు తెరిచిన పరిస్థితుల్లో వ్యాక్సినేషన్‌పై ఆ దేశం ఎలా స్పందిస్తుందోనని అనుకుంటున్నారు. సరిహద్దు పట్టణాల్లో డిసిన్‌ఫెక్టెంట్‌ జోన్లను ఉత్తర కొరియా ఏర్పాటు చేసుకుందని దక్షిణ కొరియా చెబుతోంది.    

Advertisement
Advertisement