Russia Prez Putin Nuclear Drill Create Tension Around World, Video Goes Viral - Sakshi
Sakshi News home page

రష్యా అణు యుద్ధ సన్నద్ధత! డ్రిల్స్‌ను స్వయంగా పరిశీలించిన పుతిన్‌

Published Wed, Oct 26 2022 6:14 PM

Russia Prez Putin Nuclear Drill Create Tension Around World - Sakshi

మాస్కో: ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయిలో పైచేయి సాధించడమే లక్ష్యంగా రష్యా అధినేత పుతిన్‌ వ్యూహాలకు పదును పెడుతున్నారు. బుధవారం తమ సైనికుల యుద్ధ సన్నద్ధతను ఆయన పుతిన్‌ స్వయంగా పరిశీలించారు. రష్యా వ్యూహాత్మక అణు దళాలు బాలిస్టిక్, క్రూయిజ్‌ మిస్సైళ్లతో డ్రిల్స్‌ నిర్వహించాయి. ఉక్రెయిన్‌పై అణ్వాయుధాల ప్రయోగానికి రష్యా సేనలు సన్నద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ డ్రిల్స్‌ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఒకవేళ తమ దేశంపై అణు దాడి జరిగితే గట్టిగా తిప్పికొట్టాలన్నదే తమ ఉద్దేశమని రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు చెప్పారు. తాజాగా ఎక్సర్‌సైజ్‌లో భాగంగా ఉత్తర ప్లెసెట్‌స్క్‌ లాంచ్‌ సైట్‌ నుంచి ఇంటర్‌కాంటినెంటల్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. కామ్చాట్కా ద్వీపంలో అణు జలాంతర్గామి ద్వారా సినేవా ఐసీబీఎం క్షిపణిని పరీక్షించారు. అలాగే టూ–95 స్ట్రాటజిక్‌ బాంబర్ల సాయంతో క్రూయిజ్‌ క్షిపణులను ఫైర్‌టెస్టు చేశారు.

అన్ని క్షిపణులు నిర్దేశిత లక్ష్యాలను చేరుకున్నాయని రష్యా ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు నాటో కూటమి ఉత్తర యూరప్‌ ప్రాంతంలో వార్షిక మిలటరీ విన్యాసాలు నిర్వహిస్తోంది. ఈ నెల 30 దాకా ఈ విన్యాసాలు కొనసాగుతాయి. అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు, అమెరికాకు చెందిన లాంగ్‌–రేంజ్‌ బి–52 బాంబర్లు సైతం ఇందులో పాల్గొంటున్నాయి. పరిస్థితి చెయ్యి దాటితే అణ్వస్త్రాల ప్రయోగానికి వెనుకాడబోమని పుతిన్‌ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే.
 
40 గ్రామాలపై రష్యా దాడులు  
కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో ఉక్రెయిన్‌లోని 40 గ్రామాలపై దాడులు చేసింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారని ఉక్రెయిన్‌ అధికారులు వెల్లడించారు. దాడుల భయంతో జనం రాత్రిపూట బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని తెలిపారు. రష్యా సైన్యం ఐదు రాకెట్లు ప్రయోగించిందని, 30 వైమానిక దాడులు, 100కుపైగా మల్టిపుల్‌–లాంచ్‌ రాకెట్‌ సిస్టమ్‌ దాడులు చేసిందని ఉక్రెయిన్‌ సైనిక దళాల జనరల్‌ స్టాఫ్‌ పేర్కొన్నారు. 

Advertisement
Advertisement