బ్రిటన్‌ అమెరికా దాడులు | US And Britain Strike Yemen In Reprisal For Houthi Attacks On Shipping, See Details Inside - Sakshi
Sakshi News home page

US And UK Launch Strikes: బ్రిటన్‌ అమెరికా దాడులు

Published Sat, Jan 13 2024 11:39 AM

US and Britain strike Yemen in reprisal for Houthi attacks on shipping - Sakshi

వాషింగ్టన్‌: హౌతీ ఉగ్రవాద ముఠాపై అమెరికా, బ్రిటన్‌ విరుచుకుపడ్డాయి. మిలిటెంట్ల ఆవాసాలు, ఆయుధాగారాలపై ఆ దేశాల సంయుక్త దళాలు గురు, శుక్రవారాల్లో భారీగా బాంబు దాడులు జరిపాయి. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, ఫైటర్‌ జెట్ల ద్వారా ఏకకాలంలో తోమహాక్‌ క్షిపణులు తదితరాలు ప్రయోగించి పలు లక్ష్యాలను ఛేదించినట్టు అమెరికా అధికార వర్గాలు తెలిపాయి. వీటిలో యెమన్‌ రాజధాని సనా, ఎర్రసముద్రంలో హౌతీల కంచుకోట హుదాయ్దా వంటివి కూడా ఉన్నట్టు వివరించాయి.

అక్కడి తీర ప్రాంత రాడార్‌ సైట్లతో పాటు డ్రోన్, మిసైళ్ల నిల్వ, ప్రయోగ కేంద్రాలను తాజా దాడుల్లో ధ్వంసం చేసినట్టు ప్రకటించాయి. ఎర్రసముద్రంలో ఉగ్ర మూకల దాడులను సహించబోమనేందుకు ఈ దాడులు తాజా రుజువని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు. ఎర్రసముద్రంలో అంతర్జాతీయ రవాణా నౌకలపై హౌతీల మతిలేని దాడికి చరమగీతం పాడి తీరతామన్నారు. అందుకోసం మరిన్ని తీవ్ర చర్యలకు కూడా వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. ‘‘చరిత్రలోనే తొలిసారిగా యాంటీ షిప్‌ బాలిస్టిక్‌ మిసైళ్లను హౌతీలు ప్రయోగిస్తున్నారు. ఇది అంతర్జాతీయ వర్తకానికి, నౌకలకు, నావికులకే గాక అమెరికా రక్షణ సిబ్బందికి కూడా ప్రమాదకరంగా మారింది’’ అంటూ మండిపడ్డారు.

పరిస్థితులు ఉద్రిక్తం 
సనాలో శుక్రవారం తెల్లవారుజామున కనీసం నాలుగు భారీ పేలుళ్లు సంభవించాయని స్థానిక జర్నలిస్టులు వెల్లడించారు. నగర పశి్చమాన రేపు ప్రాంతంలో కూడా ఐదుకు పైగా భారీ పేలుళ్లు జరిగినట్టు చెబుతున్నారు. అక్కడికి దక్షిణాన ఉన్న తైజ్, ధమర్‌ వవంటి నగరాలపై కూడా దాడులు జరిగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అమెరికా హెచ్చరికల నేపథ్యంలో కొద్ది రోజుల పాటు దాడులకు దూరంగా ఉన హౌతీలు గత మంగళవారం ఉన్నట్టుండి భారీగా విరుచుకుపడటం తెలిసిందే. ఎర్రసముద్రంలోని నౌకలపైకి పెద్ద సంఖ్యలో క్షిపణులు ప్రయోగించాయి. అమెరికా, బ్రిటన్‌ యుద్ధ నౌకలు, ఫైటర్‌ జెట్లు తక్షణం స్పందించాయి. 

18 డ్రోన్లను, రెండు మిసైళ్లు, ఒక యాంటీ షిప్‌ మిసైల్‌ను నేలకూల్చాయి. గురువారం కూడా గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌లో ఒక నౌకపైకి హౌతీలు షిప్‌ విధ్వంసక బాలిస్టిక్‌ మిసైల్‌ను ప్రయోగించారు. అది గురి తప్పడంతో భారీ నష్టం తప్పింది. దాంతో పరిస్థితిపై మంగళవారమే బైడెన్‌ అత్యవసర సమీక్ష జరిపారు. హౌతీలపై దాడులను తీవ్రతరం చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. మరోవైపు బ్రిటన్‌ రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ కూడా హౌతీలపై పెద్దపెట్టున దాడులు జరిపిందని ప్రధాని రిషీ సునాక్‌ ప్రకటించారు.

 తమ సంయుక్త దాడులకు నెదర్లాండ్స్, కెనడా, బెహ్రయిన్‌ దన్నుగా నిలిచాయన్నారు. దాడులకు స్వస్తి పలకాలని ఆ్రస్టేలియా, డెన్మార్క్, జర్మనీ, నెదర్లాండ్స్, బహ్రయిన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా తదితర దేశాలు కూడా ఇప్పటికే హౌతీలను హెచ్చరించాయి. ఎర్రసముద్రంలో నౌకల భద్రత నిమిత్తం 22 దేశాలతో కలిసి ‘ఆపరేషన్‌ ప్రాస్పరిటీ గార్డియన్‌’ పేరిట కొత్త సముద్ర రక్షణ మిషన్‌కు అమెరికా తాజాగా తెరతీసింది. ఇందులో భాగంగా నౌకల రక్షణార్థం అమెరికా తదితర దేశాల యుద్ధ నౌకలు ఎర్రసముద్ర జలాల్లో నిరంతరం గస్తీ కాస్తున్నాయి.  

Advertisement

తప్పక చదవండి

Advertisement