దౌత్య సిబ్బందిని తగ్గించాలంటూ భారత్‌ అల్టిమేటం.. స్పందించిన కెనడా

4 Oct, 2023 09:25 IST|Sakshi

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య కేసుతో భారత్‌, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు  కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్‌లో కెనడా దౌత్యవేత్తల సిబ్బంది సంఖ్యను తగ్గించాలంటూ కేంద్రం చేసిన అల్టిమేటమ్‌పై కెనడా ప్రభుత్వం స్పందించింది. రెండు దేశాల మధ్య ధైత్య సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తాము భారత ప్రభుత్వంతో వ్యక్తిగతంగా చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు కెనడా విదేశీ వ్యవహరాలమంత్రి  మెలానీ జోలీ పేర్కొన్నారు.

ఇందుకు కెనడా భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. కెనడియన్ దౌత్యవేత్తల భద్రతను తాము చాలా సీరియస్‌గా(తీవ్రమైనవి) తీసుకుంటున్నామని, భారత్‌తో ప్రైవేట్‌గా చర్చలు జరపాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎందుకంటే వ్యక్తిగత దౌత్యపరమైన సంభాషణలు ఉత్తమమైనవిగా తాము భావిస్తున్నట్లు చెప్పారు. 
చదవండి: అమెరికా రాజకీయాల్లో పెను సంచలనం

10లోగా దౌత్యవేత్తల  సంఖ్యను తగ్గించండి: కెనడాకు భారత్‌ అల్టిమేటమ్‌ 
కాగా భారత్‌లో ఉన్న  దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాలని కెనడా హైకమిషనరేట్‌కు భారత్‌ అల్టిమేటమ్‌ జారీ చేసిన విషయం తెలిసిందే భారత్‌లో ఉన్న సుమారు 41 మంది దౌత్యవేత్తల్ని వెనక్కి తీసుకువెళ్లాలని వార్నింగ్‌ ఇచ్చింది. ఈ నెల 10 వరకు గడువు విధించినట్టు విశ్వసనీయమైన వర్గాల సమాచారం. దౌత్య సిబ్బంది సంఖ్య విషయంలో సమానత్వం ఉండాలని భారత్‌ ఎప్పట్నుంచో వాదిస్తోంది. ఒట్టావాలోని భారత దౌత్యసిబ్బంది సంఖ్యతో పోలిస్తే దిల్లీలో కెనడా దౌత్య సిబ్బంది సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, దాన్ని సమస్థాయికి తీసుకురావాలని చెబుతోంది.

ప్రస్తుతం భారత్‌లో కెనడాకు చెందిన 62 మంది దౌత్యవేత్తలు ఉన్నారు. అందులో 41 మందిని తగ్గించాలంటూ కెనడా రాయబార కార్యాలయానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినట్టుగా జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఒకవేళ గడువులోగా దౌత్యవేత్తల్ని వెనక్కి పిలవకపోతే వారికి రక్షణ కల్పించలేమని కూడా ప్రభుత్వం తెగేసి చెప్పినట్టుగా సమాచారం.  

వివాదాన్ని పెంచాలనుకోవడం లేదు: కెనడా
భారత్‌తో  వివాదాన్ని ముందుకు తీసుకెళ్లడం ఇష్టం లేదని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో పేర్కొన్నారు. భారత్‌తో బాధ్యతాయుతంగా, నిర్మాణాత్మకంగా తమ బంధాన్ని కొనసాగిస్తామని అన్నారు. భారతదేశంలోని కెనడియన్ కుటుంబాలకు సహాయం చేసేందుకు తాము అక్కడే ఉండాలని అనుకుంటున్నామని తెలిపారు. అక్టోబర్ 10వ తేదీలోగా 40 మంది దౌత్య సిబ్బందిని వెనక్కు పిలిపించుకోవాలని కెనడాకు భారత్ అల్టిమేటం జారీ చేసిన అనంతరం ట్రూడో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం

మరిన్ని వార్తలు