ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయండి | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 25 2023 1:40 PM

వీసీలో పాల్గొన్న కలెక్టర్‌ యాస్మిన్‌బాషా - Sakshi

జగిత్యాల: ప్రభుత్వ లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. శుక్రవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పట్టాలు లేకుండా ఆక్రమణకు గురైన ఆబాది, గ్రామకంఠం, శిఖం, వక్ఫ్‌, దేవాదాయ భూములు వివరాలను ప్రొఫార్మా–1 ప్రకారం సేకరించామని, వాటి క్రమబద్దీకరణకు ఉన్న అవకాశాలపై నివేదిక అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ జీవోలు 58, 59 ప్రకారం ప్రభుత్వ భూములు, గ్రామకంఠం, ఆబాది తదితర కారణాల వల్ల హోల్డ్‌లో పెట్టిన దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని చెప్పారు.

కంటి వెలుగు శిబిరాలను విజయవంతం చేయాలని, జిల్లాలకు చేరే కళ్లాద్దాలను పంపిణీ చేసి, వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం అర్హులను ఎంపిక చేయాలని సూచించారు. పోడు భూముల పంపిణీకి సంబంధించి జిల్లాస్థాయి కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్‌ యాస్మిన్‌బాషా మాట్లాడుతూ.. జిల్లాలో పనులను వేగవంతం చేశామని, కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోడు భూములపై నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు లత, మకరంద్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement