మక్కకు మంచి రోజులు | Sakshi
Sakshi News home page

మక్కకు మంచి రోజులు

Published Fri, Mar 31 2023 1:56 AM

మార్కెట్‌లో మక్కలు - Sakshi

జగిత్యాలఅగ్రికల్చర్‌: యాసంగి సీజన్‌లో సాగు చేసిన మొక్కజొన్న ధరలు రోజు రోజుకు పెరుగుతూ రైతులకు ఊరటనిస్తున్నాయి. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1,962 ఉండగా.. వ్యాపారస్తుల పోటీతో క్వింటాల్‌కు రూ.2,200–రూ.2,400 వరకు ధర పలుకుతుంది. ఓపెన్‌ మార్కెట్‌లో మంచి ధర వస్తుండటంతో మార్క్‌ఫెడ్‌ కేంద్రాల అవసరం లేకుండా పోయింది. వ్యాపారస్తులు గ్రామాలకు వస్తుండటంతో హమాలీ, రవాణా ఖర్చులు లేకుండా రైతులు గ్రామాల్లోనే విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా మక్క పంట ఇప్పుడే మార్కెట్‌కు వస్తున్నందున రేట్లు మరింత పెరిగే అవకాశం ఉండటం, మరో నెల వరకు కూడా అమ్ముకునే వెసులుబాటు ఉండటంతో చాలా మంది రైతులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు.

30 వేల ఎకరాల్లో..

జిల్లాలో యాసంగి సీజన్‌లో 30 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. వానాకాలంలో రైతులు ఇబ్బడిముబ్బడిగా వరి సాగు చేసినా తెగుళ్లతో అనుకున్న స్థాయిలో దిగుబడులు రాలేదు. దీనికి తోడు పంటమార్పిడి చేయాలనే ఉద్దేశంతో చాలా మంది రైతులు వరి స్థానంలో మక్క వేశారు. దీంతో జిల్లాలో గతేడాదితో పోల్చితే 15 వేల ఎకరాల వరకు ఎక్కువగా సాగు చేసినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఈసారి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉండటంతో ఎకరాకు సగటున 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడులు తీశారు. ప్రైవేట్‌ కంపెనీలకు చెందిన అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్‌ విత్తనాలు వాడటంతో పాటు ఎరువుల, సాగు నీటి యాజమాన్యం పాటించడంతో మంచి దిగుబడులను రైతులు సొంతం చేసుకున్నారు. అయితే, మొక్కజొన్న జల్లు దశ నుంచి కంకి దశ వరకు ఓ వైపు కోతులు, మరో వైపు రామచిలుకలు, అడవి పందుల బెడదతో పంటను కాపాడుకునేందుకు రైతులు రాత్రింబవళ్లు కాపాలా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఈ బెడద ఎక్కువగా ఉండటంతో చాలా మంది రైతులు పచ్చి కంకి దశలోనే పంటను అమ్ముకున్నారు.

కోళ్ల పరిశ్రమకు ఆర్డర్లతో..

మొక్కజొన్నను ఎక్కువగా కోళ్ల పరిశ్రమలో దాణాగా, బిస్కెట్ల తయారీలో ముడిపదార్థంగా ఉపయోగిస్తున్నారు. అలాగే స్థానికంగా మక్కటుకులు, గటుక, స్టార్చ్‌ వంటి ఉప ఉత్పత్తులకు వాడుతుండటంతో డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుత సీజన్‌లో మక్క గింజలు తాజాగా ఉండటంతో పాటు వానాకాలం పంట వచ్చే వరకు మార్కెట్లో మక్కలు దొరికే అవకాశం లేదు. దీంతో కోళ్ల పరిశ్రమకు చెందిన యజమానులు ముందస్తుగా కొనుగోలు చేస్తూ నిల్వ చేస్తున్నారు. దీంతో పౌల్ట్రీ పరిశ్రమల నుంచి వ్యాపారులకు మంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే, కొంతమంది వ్యాపారులతో పాటు పెద్ద రైతులు మరింత రేటు పెరిగే అవకాశం ఉందని నిల్వలు కూడా చేస్తున్నారు. స్థానిక వ్యాపారులు మార్కెట్లలో లేదా గ్రామాల్లో కాంటాలు పెట్టి ఆర్డర్లపై ఇతర ప్రాంతాలకు కమీషన్‌ ప్రతిపాదికన పంపిస్తున్నారు. కొంతమంది రైతులు అయా గ్రామాల్లోని కోళ్ల ఫారాల య జమానులతో ఒప్పందాలు చేసుకుని, మార్కెట్‌ ధర కంటే రూ.100–200 తక్కువ ధరకు ఎలాంటి ఖర్చు లేకుండా అమ్ముకుంటున్నారు. అయితే మక్క సాగుకు పెరుగుతున్న పెట్టుబడుల నేపథ్యంలో ఈ సారి కొంత రేటు వచ్చినా రైతులకు వచ్చే ఆదాయం అరకొరగానే ఉంది.

మరింత పెరిగే అవకాశం

వ్యాపారస్తుల పోటీ చూస్తుంటే మొక్కజొన్న ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కనబడుతుంది. గతంతో పోల్చితే లేయర్‌, బ్రాయిలర్‌ కోళ్ల ఫారాలు ఇటీవల బాగా పెరిగాయి. కోళ్ల దాణాగా ఎక్కువగా మక్క అవసరం అవడంతో కొనుగోళ్లు చేసి నిల్వ చేస్తున్నారు.

– ప్రకాశ్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి, జగిత్యాల

కష్టపడ్డందుకు ఫర్వాలేదు

నేను రెండెకరాల్లో మక్క సాగు చేసిన. కష్టపడ్డందుకు పంట బాగానే వచ్చింది. ధర కూడా మంచిగానే ఉంది. ఈ సారి వ్యాపారులే మా వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు.

– కోల నారాయణ, చల్‌గల్‌, జగిత్యాల రూరల్‌

మద్దతుకు మించి పలుకుతన్న ధరలు

క్వింటాల్‌కు రూ.2,300 వరకు చేరిన వైనం

1/2

2/2

Advertisement
Advertisement