Sakshi News home page

జోరుగా బేరసారాలు

Published Tue, Nov 21 2023 12:42 AM

- - Sakshi

● ప్యాకేజీలతో అసంతృప్తులకు గాలం ● పార్టీలు మారుతున్న నాయకులు, కార్యకర్తలు

చందుర్తి(వేములవాడ): పోలింగ్‌ గడువు సమీపిస్తుండడంతో రాజకీయ ఎత్తులు.. పైఎత్తులు ఊపందుకున్నాయి. ప్రత్యర్థి శిబిరంలో ఉన్న క్షేత్రస్థాయిలోని ప్రజాధరణ ఉన్న నాయకులను లాగేందుకు జోరుగా బేరసారాలు మొదలయ్యాయి. పోలింగ్‌ రోజుకు తొమ్మిది రోజులే మిగిలి ఉండడంతో ఎలాగైనా గెలుపొందాలనే లక్ష్యంతో పార్టీలు ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే వేములవాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఒక పార్టీ నుంచి మరో పార్టీకి ఫిరాయింపులు జోరందుకున్నాయి. ఇతర పార్టీల్లోని బలమైన నాయకులతోపాటు అసంతృప్తులను తమ వైపు లాగేందుకు భారీగా ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిసింది. బేరసారాలతో నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది.

స్థానిక ప్రజాప్రతినిధులతో మంతనాలు

గ్రామాల్లోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు తాము కొనసాగిన పార్టీ విజయం కోసం ఎన్నికల సమయంలో శ్రమించిడం సహజం. కానీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులను ఎరగా చూపుతుండడంతో వారి దృష్టి రానున్న ఎన్నికల్లో తాము పోటీ చేసే సమయంతో డబ్బులు పనికి వస్తాయని ఆశలు పెంచుకుంటున్నారు. దీంతో కార్యకర్తలు, నాయకుల కంటే ఎక్కువగా ప్రజాప్రతినిధులే పార్టీ కండువాలు మార్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారంలో ఉంది. నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్‌, బీజేపీలకు చెందిన నాయకులు పార్టీల కండువాలను సులువుగా మార్చేసుకుంటున్నారు. ఇందు కోసం ఆయా పార్టీలకు వచ్చే ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ప్యాకేజీలను కట్టబెట్టుతున్నట్లు సమాచారం.

పార్టీలో ఉన్న నాయకులు గుర్రు

పార్టీలో చేరుతున్న నాయకులు, ప్రజాప్రతినిధులతో తమ స్థానం గల్లంతయ్యే ప్రమాదం ఉందని అప్పటికే ఆ పార్టీలో ఉన్న ద్వితీయశ్రేణి నాయకులు ఆందోళనలో ఉన్నట్లు తెలిసింది. పార్టీలో చేర్చుకుంటున్న వారితో ప్రయోజనం కన్న సొంత పార్టీలోని నాయకులతో కొత్త తలనొప్పులు వస్తున్నాయి. ఇప్పటి వరకు పార్టీనే నమ్ముకుని పనిచేసిన తమను కాదని, కొత్త వారి పెత్తనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరికొందరు విభేదిస్తూ తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో వారిని సముదాయించడం నాయకత్వానికి సమస్యగా మారుతోంది.

ఏ కండువాతో కనిపిస్తారో...

జనబలం ఉన్న నాయకులు, ప్రతిప్రతినిధులు కండువాలు మార్చుకుంటున్నారు. రాజకీయ భవిష్యత్‌ తెల్చుకోలేక ఊగిసలాడుతూ తరచు కండువాలు మార్చుకునే వారే ఎక్కువ కనిపిస్తున్నారు. వీరితో ఎవరూ ఎప్పుడు ఏ కండువాతో కనిపిస్తారోనన్న అనుమానాలు ప్రజల్లో ఎక్కువవుతున్నాయి. ఉదయం ఒక్క పార్టీలో చేరుతూ... సాయంత్రం కల్లా మరో పార్టీ కండువాతో దర్శనమిచ్చే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. పార్టీలు మార్చే వారితో లాభనష్టాలు షరా మామూలేనని పరిశీలకులు భావిస్తున్నారు.

అసంతృప్తులపై కన్ను

ఎన్నికల ప్రచారానికి వారం రోజులే మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల కన్ను ఎదుటి పార్టీలోని అసంతృప్తులపై పడింది. ఎదుట శిబిరంలోని బలాలు, బలహీనతలను లెక్కలు వేస్తున్నారు. మోజార్టీ ఓటర్లను ప్రభావితం చేసే ద్వితీయశ్రేణి నాయకులు, అభ్యర్థులకు సన్నిహితంగా ఉండే వారిని తమ పార్టీలోకి మార్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. నిన్నటి, మొన్నటి వరకు నియోజకవర్గ స్థాయి నాయకులతోపాటు మండలస్థాయి నాయకులపైనే దృష్టి సారించిన వారు.. ఈరోజు నుంచి గ్రామస్తాయిలో బలమైన నాయకులను లాగేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. హోదాను బట్టి పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పేందుకు వెనకాడడం లేదని తెలుస్తోంది. చివరికి టికెట్‌ ఆశించి భంగపడ్డ నాయకులతోపాటు వారి అనుచరులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ.. అధికారంలోకి వస్తే కీలక పదవి ఇస్తామంటూ భరోసానిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా పెద్ద మొత్తంలో డబ్బులు సైతం అప్పజెప్పుతున్నట్లు ప్రచారంలో ఉంది.

Advertisement

What’s your opinion

Advertisement