జలవిహారం.. జగదానందకరం | Sakshi
Sakshi News home page

జలవిహారం.. జగదానందకరం

Published Fri, Nov 24 2023 11:38 PM

- - Sakshi

నేత్ర పర్వంగా సత్యదేవుని తెప్పోత్సవం

పంపా సరోవరంలో హంస వాహనంపై విహరించిన స్వామి, అమ్మవారు

వేలాదిగా తిలకించిన భక్తజనం

అన్నవరం: నింగిలో మబ్బుల మాటున దోబూచులాడుతున్న చంద్రుని కిరణాల్లో.. పాలకడలిని తలపించిన పంపా సరోవరంలో.. దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారితో కలసి.. భక్తవరదుడు, రత్నగిరివాసుడు అయిన సత్యదేవుని హంస వాహన విహారం అత్యంత వైభవంగా.. పరమానందకరంగా జరిగింది. క్షీరాబ్ది ద్వాదశి (కార్తిక శుద్ధ ద్వాదశి) పర్వదినాన్ని పురస్కరించుకుని.. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల ఘోష.. కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా కాల్పుల నడుమ ఈ వేడుక శుక్రవారం రాత్రి సుమారు రెండు గంటల పాటు అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు ఈ సుమనోహర దృశ్యం చూసి పరవశించారు.

ఉత్సవం జరిగిందిలా..

సాయంత్రం 5.30 గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను, క్షేత్రపాలకులు సీతారాములను రత్నగిరి నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా పంపా జలాశయం తీరానికి తీసుకువచ్చారు. అక్కడ పూజా మండపంలో ప్రత్యేక సింహాసనంపై సత్యదేవుడు, అమ్మవారిని, పక్కనే మరో ఆసనంపై సీతారాములను ఉంచి పండితులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, తులసీ ధాత్రి పూజ నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవార్లకు వేదాశీస్సులు అందజేశారు. అనంతరం 6.30 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను మేళతాళాల నడుమ ఊరేగింపుగా పంపా నది ఒడ్డున సర్వాంగ సుందరంగా అలంకరించిన హంస వాహనం మీదకు వేంచేయించారు. తిరిగి పూజలు చేసి, హారతులిచ్చారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ హంస వాహనంలో స్వామి, అమ్మవార్లను పండితులు మూడుసార్లు నదిలో విహరింపజేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను, సీతారాములను దేవస్థానానికి తిరిగి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. జలాశయం తీరం వెంబడి, ఘాట్‌ రోడ్డు పొడవునా పెద్ద సంఖ్యలో నిల్చున్న భక్తులు తెప్పోత్సవాన్ని తిలకించి పులకించారు. వారికి ఉత్సవానంతరం ఘాట్‌ రోడ్డు టోల్‌ గేటు వద్ద తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. తెప్పోత్సవ ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ రామచంద్ర మోహన్‌ పర్యవేక్షించారు. ఉత్సవం సందర్భంగా పంపా తీరాన్ని, ఘాట్‌ రోడ్డును రంగురంగుల విద్యుత్‌ దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి హంస వాహనాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్‌, దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ కె.రామచంద్ర మోహన్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. వేద పండితులు గొల్లపల్లి ఘనాపాఠి, యనమండ్ర శర్మ, గంగాధరభట్ల గంగబాబు, ముష్టి పురుషోత్తం, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్శింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్‌, అర్చకులు సుధీర్‌, దత్తాత్రేయశర్మ, రామ్‌కుమార్‌ తదితరులు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా రెండు స్పీడ్‌ బోట్లలో గజ ఈతగాళ్లతో పాటు పంటుకు మరమ్మతులు చేసే సాంకేతిక సిబ్బంది కూడా హంస వాహనాన్ని అనుసరించారు. ముందు జాగ్రత్త చర్యగా తుని నుంచి అగ్నిమాపక శకటాన్ని, సిబ్బందిని పంపా తీరంలో ఉంచారు. ఎస్పీ సతీష్‌ కుమార్‌ ఆధ్వర్యాన వంద మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

1/3

2/3

సత్యదేవుడు, అమ్మవార్లకు పూజలు చేస్తున్న పండితులు
3/3

సత్యదేవుడు, అమ్మవార్లకు పూజలు చేస్తున్న పండితులు

Advertisement
Advertisement