బంగారు కొండ.. భవితకు అండ | Sakshi
Sakshi News home page

బంగారు కొండ.. భవితకు అండ

Published Tue, Dec 5 2023 11:44 PM

చిన్నారికి బంగారుకొండ పోషకాహార కిట్‌ను అందజేస్తున్న కలెక్టర్‌ మాధవీలత (ఫైల్‌) - Sakshi

విజయవంతం

జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన బంగారుకొండ కార్యక్రమం ద్వారా ఐదు నెలల వ్యవధిలో తీవ్ర పౌష్టికాహార లోపం, ఎదుగుదల లోపం ఉన్న 1,283 మంది చిన్నారుల్లో 478 మంది సాధారణస్థితికి రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారంతో పాటు అదనపు ఆహారం అందిస్తున్నాం. జిల్లాలో మరో 38 మందిని గుర్తించాం. బాలమిత్రలుగా మరింతమంది దాతలు ముందుకు రావాలి. జిల్లా అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అందరి సహకారంతో బంగారుకొండ కార్యక్రమం విజయవంతమైంది.

– డాక్టర్‌ కె.మాధవీలత, కలెక్టర్‌

నిరంతరం పర్యవేక్షణ

బంగారుకొండ కార్యక్రమంలో బాలమిత్రలు దత్తత తీసుకున్న చిన్నారులపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ప్రతి బుధవారం బాలమిత్రలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎలు వెళ్లి పిల్లల బరువును తూచి, ఎత్తును కొలిచి యాప్‌లో, వైబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నారు. పౌష్టికాహార లోపం ఉన్న పిల్లల్లో చాలామందికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలకు సంబంధించి స్పెషలిస్టు వైద్యులచే పరీక్షలు చేయించి, ఆ చిన్నారి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నాం.

– కె.విజయ కుమారి,

జిల్లా సీ్త్ర,శిశు సంక్షేమ సాధికారిత అధికారి

రాజమహేంద్రవరం రూరల్‌: చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించి, వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులు చేసేందుకు కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత రూపొందించిన బంగారు కొండ కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చింది. వయసుకు తగిన బరువు, ఎత్తు లేని ఆరు నెలల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులను గుర్తించి, వారికి ఆరునెలల పాటు 8 రకాల పోషకాహారం అందించాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ ఏడాది జూన్‌ 14న హోంమంత్రి తానేటి వనిత, ఇతర ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

1,283 మంది గుర్తింపు

తీవ్ర బలహీనంగా, తక్కువ బరువు, వయసుకు తగిన ఎత్తు, సరైన ఎదుగుదల లేని 1,283 మందిని కలెక్టర్‌ నేతృత్వంలో ఐసీడీఎస్‌ సిబ్బంది గుర్తించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, గోరుముద్ద పథకాల ద్వారా అందిస్తున్న పోషకాహారంతో పాటు అదనంగా ఎనిమిది రకాల పోషకాహారాన్ని అందించనున్నారు. కలెక్టర్‌ మాధవీలత ఈ ఆలోచనకు జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌ భరత్‌, జిల్లా ఉన్నతాధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకువచ్చారు. ఆరు నెలల పాటు నెలకు రూ.500 విలువైన ఎనిమిది రకాల పోషకాహార కిట్లను పంపిణీ చేసేందుకు రూ.3 వేలు అందించేందుకు ముందుకు వచ్చారు. పోషకాహారకిట్లకు సహకరించిన దాతలకు బాలమిత్రలుగా నామకరణం చేశారు.

వైద్యుల పర్యవేక్షణ

బాలమిత్రలు ఒక్కొక్క చిన్నారిని దత్తత తీసుకుని ప్రతి బుధవారం వారింటికి వెళ్లి ఆ చిన్నారి బరువు, ఎత్తు తూయడంతో పాటు బంగారుకొండ యాప్‌లోనూ, వెబ్‌సైట్‌లోనూ వివరాలు నమోదు చేసేవారు. దీనిద్వారా ఆ చిన్నారుల ఎత్తు, బరువుల్లో మార్పు వస్తున్నాయా, లేదా అన్న విషయాన్ని గుర్తించడంతో పాటు వైద్యసేవలు అవసరమైతే సంబంధిత వైద్యాధికారులు పరీక్షలు చేసి మందులను ఇవ్వడం జరుగుతుంది. పిల్లలను లోప పోషణ స్థితి నుంచి సాధారణ స్థితికి వచ్చే వరకూ నిరంతర పర్యవేక్షణ చేస్తారు.

సాధారణ స్థితికి 478 మంది

బంగారుకొండ కార్యక్రమాన్ని ప్రారంభించి ఐదు నెలలు పూర్తయ్యింది. 1,283 మంది చిన్నారుల్లో 478 మంది సాధారణ స్థితికి వచ్చారు. మిగిలిన చిన్నారుల్లో కొంతమందిలో ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల బాలమిత్రలతో పాటు నిరంతరం ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ కార్యకర్త, సూపర్‌ వైజర్‌ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో వీరితో పాటు మరో 38 మంది పోషకాహార లోపం, వయసుకు తగిన బరువు, ఎత్తు లేని పిల్లలను గుర్తించారు.

కలెక్టర్‌ ఆలోచనకు సత్ఫలితాలు

సాధారణ స్థితికి 478 మంది పిల్లలు

కొత్తగా 38 మంది గుర్తింపు

సంతోషంగా ఉంది

మా అబ్బాయి కొక్కిరపాటి వరుణ్‌ కుమార్‌ వయసు మూడేళ్లు. 87 సీఎం ఎత్తు, 10.4 కిలోల బరువు ఉండేవాడు. హోంమంత్రి తానేటి వనిత నా కుమారుడిని దత్తత తీసుకుని బంగారుకొండ పౌష్టికాహార కిట్‌ను ప్రతినెలా అందిస్తున్నారు. పోషకాహారం తీసుకున్న తరువాత 92 సీఎం ఎత్తు, 11.7 కిలోల బరువుకు వచ్చాడు. చాలా సంతోషంగా ఉంది.

– కొక్కిరపాటి సునీత, దొమ్మేరు

కొండంత భరోసా

మా అబ్బాయి చాకలి భవ్యేష్‌ అభ్యంత్‌ వయసు ఏడాదిన్నర. బంగారుకొండ కార్యక్రమం మొదలుపెట్టిన జూలైలో బరువు 7.8 కిలోలు, ఎత్తు 74 సీఎం ఉండేవాడు. ఇప్పుడు బరువు 8.4 కిలోలు, ఎత్తు 77 సీఎం పెరిగాడు. పోషకాహారం తీసుకోవడం వల్ల మా అబ్బాయి పెరుగుదల బాగుంది. బంగారుకొండ కిట్లు ఇవ్వడంతో పాటు బాలమిత్ర, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎం నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. – చాకలి లీలాకుమారి, రాజానగరం

ఆరోగ్యం మెరుగైంది

మా అబ్బాయి గొందేశి పవన్‌ తేజకు ఐదేళ్ల వయసు. మొదట బరువు 15.3 కిలోలు, ఎత్తు 99 సీఎం ఉండేవాడు. పోషకాహారం తీసుకున్న తరువాత బరువు 17.3 కిలోలు, ఎత్తు 102 సీఎంకి పెరిగాడు. బంగారుకొండ పోషకాహారం తీసుకున్న తరువాత ఆరోగ్యంగా, హుషారుగా ఉంటున్నాడు. ప్రతి బుధవారం బాలమిత్ర, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ కార్యకర్త పర్యవేక్షిస్తున్నారు.

– గొందేశి మహాలక్ష్మి, గణేష్‌ దంపతులు, రాజమహేంద్రవరం

1/5

2/5

3/5

4/5

5/5

Advertisement
Advertisement