హైవేపై ఎమ్మెల్యే మాడాళ్‌ అరెస్టు | Sakshi
Sakshi News home page

హైవేపై ఎమ్మెల్యే మాడాళ్‌ అరెస్టు

Published Tue, Mar 28 2023 12:32 AM

- - Sakshi

తుమకూరు: ఒక కాంట్రాక్టరు నుంచి కుమారుడు రూ. 40 లక్షలకు పైగా లంచం తీసుకున్న కేసులో చన్నగిరి బీజేపీ ఎమ్మెల్యే మాడాళ్‌ విరూపాక్షప్పను లోకాయుక్త అధికారులు సోమవారం రాత్రి 8 గంటలప్పుడు నాటకీయంగా అరెస్టు చేశారు. ఆయన దావణగెరె జిల్లా చన్నగిరి నుంచి బెంగళూరుకు వస్తున్న సమయంలో తుమకూరు జిల్లా క్యాత్సంద్ర టోల్‌గేట్‌ వద్ద కారును అడ్డుకుని అరెస్టు చేసి విచారణ కోసం బెంగళూరుకు తరలించారు.

ముందస్తు బెయిలు రద్దు కాగానే

కొన్ని వారాల కిందట మాడాళ్‌ విరుపాక్షప్ప కర్ణాటక సోప్స్‌ సంస్థ చైర్మన్‌గా ఉండగా ఆయన కుమారుడు, రాష్ట్ర గణాంక విభాగం ఉన్నతాధికారి అయిన ప్రశాంత్‌ మాడాళ్‌ బెంగళూరులో తమ ఆఫీసులో ఒక కాంట్రాక్టరు నుంచి భారీమొత్తంలో లంచం తీసుకుంటూ ఉండగా లోకాయుక్త అధికారులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. కర్ణాటక సోప్స్‌ నుంచి ఒక టెండరును ఇప్పించేందుకు ఈ ముడుపులు తీసుకున్నారు. ఈ కేసులో లోకాయుక్త అధికారులు ఎమ్మెల్యేను ముఖ్య నిందితునిగా పేర్కొన్నారు.

దీంతో ఎమ్మెల్యే హైకోర్టుకెళ్లి ముందస్తు బెయిలు పొందారు. అయితే ఎమ్మెల్యే తమ విచారణకు సహకరించడం లేదని కేసు వేయగా, ముందస్తు బెయిలును ధర్మాసనం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. మరికొద్ది నెలల్లో కన్నడనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఈ పరిణామాలు చోటుచేసుకోవడం అధికార బీజేపీకి ఇబ్బందిగా ఉంది.

లంచం కేసులో లోకాయుక్త చర్యలు

చన్నగిరి నుంచి బెంగళూరుకు

వస్తుండగా తుమకూరు జిల్లాలో అరెస్టు

 కారులో ఎమ్మెల్యే విరూపాక్షప్ప
1/1

కారులో ఎమ్మెల్యే విరూపాక్షప్ప

Advertisement
Advertisement