డ్రైవర్‌ లేకుండా మెట్రో రైలు | Sakshi
Sakshi News home page

డ్రైవర్‌ లేకుండా మెట్రో రైలు

Published Sun, Jul 23 2023 12:14 AM

- - Sakshi

వాహనం నడపాలంటే డ్రైవర్లు తప్పనిసరి. కానీ ఆధునిక సాంకేతికత డ్రైవర్ల అవసరం లేకుండా ప్రయాణికులను గమ్యస్థానం చేరుస్తోంది. పాశ్యాత్య దేశాలలో డ్రైవర్‌లెస్‌ కార్లు ఇప్పటికే ప్రాచుర్యం పొందాయి. అలాగే ఐటీ సిటీలో డ్రైవర్లతో నిమిత్తం లేకుండా మెట్రో రైళ్లు పరుగులు తీయబోతున్నాయి. కంట్రోల్‌ రూం నుంచి రైలు గమనాన్ని పర్యవేక్షిస్తారు. డ్రైవర్లకు అనారోగ్యం, సమ్మె వంటి సమస్యలతో ఇబ్బంది ఉండదు.

బనశంకరి: బెంగళూరులో డ్రైవర్‌లు లేకుండానే మెట్రో రైళ్లు దూసుకుపోనున్నాయి. ఈ ఏడాది చివరిలో ప్రారంభిస్తున్నట్లు బీఎంఆర్‌సీఎల్‌ అధికారులు తెలిపారు. దీనికి కావలసిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 2020 డిసెంబరులో దేశ రాజధాని ఢిల్లీలో డ్రైవర్‌ రహిత మెట్రో రైలును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. తరువాత దేశ ఆర్థిక రాజధాని ముంబై లో డ్రైవర్‌లెస్‌ మెట్రో రైళ్లు వచ్చాయి. ఆగస్టులో తమిళనాడు రాజధాని చైన్నెలో అమలులోకి రానుంది. ఇప్పుడు ఐటీ సిటీలో శ్రీకారం చుట్టబోతున్నారు.

ఆర్‌వీ రోడ్డు– బొమ్మసంద్ర మార్గంలో
19 కిలోమీటర్లు ఎలివేటెడ్‌ కారిడార్‌ గా ఉన్న గులాబీ లైన్‌లో (ఆర్‌వీ రోడ్డు– బొమ్మసంద్ర) ఈ ఏడాది చివరిలో ప్రారంభం కానుంది, నిజానికి గత ఏడాది పూర్తి కావలసి ఉంది. కానీ కోవిడ్‌ కారణంగా పనులు ఆలస్యం కావడంతో ఈ ఏడాది చివరిలో ప్రారంభించే కారిడార్‌లో డ్రైవర్‌ రహిత మెట్రో నడపడానికి బీఎంఆర్‌సీఎల్‌ సన్నాహాలు చేస్తోంది. సీబీటీసీ సిగ్నలింగ్‌ ఆధారంగా డ్రైవర్లు లేకుండా ఈ రైళ్లు పరుగులు తీస్తాయని మెట్రో వర్గాలు తెలిపాయి.

ఇంటర్‌చేంజ్‌గా సిల్క్‌బోర్డు స్టేషన్‌
నమ్మ మెట్రో గులాబీ మార్గం నిర్మాణదశలో ఉండగా దీని పొడవు 18.82 కిలోమీటర్లు. ఈ మార్గాన్ని ఆర్‌వీ రోడ్డు నుంచి బొమ్మసంద్ర కు అనుసంధానిస్తారు. ఇది పూర్తిగా ఎలివేటెడ్‌ కారిడార్‌ కాగా 16 స్టేషన్లు కలిగి ఉంది. ఆర్‌వీ రోడ్డు స్టేషన్‌ టెర్మినల్‌ స్టేషన్‌ కాగా గ్రీన్‌ లైన్‌తో ఇంటర్‌చేంజ్‌ కల్పిస్తారు. సిల్క్‌బోర్డు స్టేషన్‌ గులాబీలైన్‌, నీలి లైన్‌ మధ్య మరో ఇంటర్‌ చేంజ్‌ స్టేషన్‌ కానుంది. గులాబీ లైన్‌ను మొదట్లో బొమ్మసంద్ర వరకు ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇప్పుడు బొమ్మసంద్ర నుంచి తమిళనాడులోని హోసూరు పట్టణం వరకు విస్తరించడానికి కర్ణాటక ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఎలా పనిచేస్తాయంటే 
డ్రైవర్‌ రహిత రైళ్లను నడపడానికి మెట్రో రైల్వేలో సాంకేతికంగా మార్పులు చేశారు. ఆధునిక సీబీటీసీ సిగ్నలింగ్‌ వ్యవస్థలను అమర్చారు. ఇది రైళ్లు స్వయంచాలితంగా సంచరించడానికి సహాయపడుతుంది.

గులాబీ (పర్పుల్‌) లైన్‌కు సీబీటీసీ సాంకేతికతను అమర్చారు. ఎలక్ట్రానిక్‌ సిటీ, గొట్టిగెరె, నాగవార, సిల్క్‌బోర్డు, కెంపేగౌడ విమానాశ్రయం లాంటి కొత్త మార్గాల్లో సీబీటీసీ వ్యవస్థను అమర్చుతారు.

డ్రైవర్‌ రహిత మెట్రోరైలులో డ్రైవర్‌ ఉండరు, ఒక అటెండర్‌ మాత్రం ఉంటారు, అత్యవసరం అనుకుంటే అటెండర్‌ డ్రైవింగ్‌ను తీసుకుంటారు. డ్రైవర్‌ రహిత మెట్రో రైళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూడేళ్లు సంచరిస్తే ఆ అటెండర్‌ అవసరం కూడా ఉండదని మెట్రో అధికారులు తెలిపారు.

ప్రతి రైలును కంట్రోల్‌ రూమ్‌ కేంద్రాల ద్వారా పర్యవేక్షిస్తారు.

Advertisement
Advertisement