పేదలకు భూవసతి కల్పించండి | Sakshi
Sakshi News home page

పేదలకు భూవసతి కల్పించండి

Published Tue, Nov 21 2023 12:38 AM

మాట్లాడుతున్న ఆంజనేయ 
 - Sakshi

రాయచూరు రూరల్‌: జిల్లాలో పేదలకు భూమి, వసతి కల్పించాలని భూ వసతి పోరాట సమితి జిల్లాధ్యక్షుడు ఆంజనేయ పేర్కొన్నారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆధీనంలోని పోరంబోకు, చౌడు, ఇనాం, సర్కారీ మిగులు భూములను పేదలకు పంపిణీ చేయాలన్నారు. ఇళ్లు లేని వారికి ఇళ్లస్థలాల పట్టాలు ఇవ్వాలన్నారు. ఈ విషయంపై ఈ నెల 26 నుంచి 28 వరకు ఫ్రీడం పార్కులో నిరవధిక ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు.

కన్నడ భాషను ప్రోత్సహించాలి

రాయచూరు రూరల్‌: పట్టణ ప్రాంతాల్లో కన్నడ భాషను ప్రోత్సహించాలని నవోదయ వైద్య కళాశాల రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం సాయంత్రం నవోదయ వైద్య కళాశాలలో నవోత్సవాలను జ్యోతి వెలిగించి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. నేటికీ తెలుగు, కన్నడ భాషలను కలిపి మాట్లాడుతున్నారన్నారు. భవిష్యత్తులో కన్నడ భాషకు అధిక ప్రాధాన్యత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కవి చిదానంద సాలి, నారాయణ రావ్‌, గిరీష్‌, అరుణ్‌ కుమార్‌, ఉమాకాంత్‌, శ్యామల, రాజాశంకర్‌, భారతిలున్నారు.

సొంతూరికి వెళ్తూ మృత్యువాత

రాయదుర్గం: డి.హీరేహాళ్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపాన రాయచూరు జిల్లా జాలహళ్లి గ్రామానికి చెందిన నాగరాజు (28) అనే యువకుడు సోమవారం లారీ కింద పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాగరాజు బెంగళూరులో బేల్దారీ పనిచేస్తూ జీవనం సాగించేవాడు. సొంతూరికి వెళ్లాలని లారీలో బయల్దేరాడు. పోలీస్‌స్టేషన్‌ సమీపాన స్పీడ్‌ బ్రేకర్‌ రాగానే దిగిపోయాడు. అప్పటికే బాగా మద్యం సేవించి ఉన్నాడు. తిరిగి బళ్లారి వైపు వెళ్లాలని రోడ్డు పక్కన నిలబడి వాహనాలను లిఫ్టు అడుగుతున్నాడు. ఈ క్రమంలో ఓ లారీ అతని మీద గుండా దూసుకెళ్లడంతో మరణించాడు. పోస్టుమార్టం నిమిత్తం బళ్లారి విమ్స్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

కాలువలో మృతదేహం

రాయదుర్గం పరిధిలో బొమ్మనహాళ్‌ మండలంలోని దేవగిరి క్రాస్‌ సమీపంలో ఉన్న హెచ్చెల్సీ 1వ డిస్ట్రిబ్యూటరీ బ్రాంచ్‌ కాలువలో గుర్తు తెలియని 45 సంవత్సరాల వ్యక్తి శవాన్ని సోమవారం స్ధానికులు గుర్తించారు. పోలీసులు వచ్చి శవాన్ని పరిశీలించారు. పింక్‌ రంగు ఫుల్‌ చొక్కా, కాఫీ రంగు డ్రాయర్‌ మాత్రమే ఉంది. హెచ్చెల్సీ ప్రధాన కాలువ నుంచి కొట్టుకుని వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి అంత్యక్రియలు జరిపించారు. ఆచూకీ తెలిసినవారు బొమ్మనహాళ్‌ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

బస్సు ఢీకొని బైకిస్టు మృతి

కేజీఎఫ్‌: బైక్‌ను ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మరణించిన ఘటన సోమవారం నగర సమీపంలోని బెమెల్‌ ఫ్యాక్టరీ మెయిన్‌ గేట్‌ ముందు చోటు చేసుకుంది. ఫ్యాక్టరీ ఉద్యోగి ఓం ప్రకాష్‌(58) అనే వ్యక్తి ఎప్పటిలానే ఉదయం తన బైక్‌పై విధులకు వెళుతుండగా కోలారు– కృష్ణగిరి మార్గంలో సంచరించే ప్రైవేటు బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనపై బెమెల్‌ నగర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

డ్రగ్స్‌ కట్టడికి సహకరించండి

కోలారు: మాదక ద్రవ్యాల(డ్రగ్స్‌) నియంత్రణకు ప్రజలు పోలీసులతో సహకరించాలని సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌ఆర్‌ జగదీష్‌ తెలిపారు. సోమవారం నగరంలో మాదకద్రవ్యాల నియంత్రణపై నిర్వహించిన జాగృతి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్యకర, మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నగరంలో ఎక్కడైనా మత్తు పదార్థాలు విక్రయిస్తున్నా, ఎవరైనా సేవిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ హమీద్‌ ఖాన్‌, నయాజ్‌పాషా పాల్గొన్నారు.

జ్యోతి వెలిగిస్తున్న శ్రీనివాస్‌
1/3

జ్యోతి వెలిగిస్తున్న శ్రీనివాస్‌

ప్రమాదానికి కారణమైన బస్సు
2/3

ప్రమాదానికి కారణమైన బస్సు

మృతుడు 
ఓంప్రకాష్‌(ఫైల్‌)
3/3

మృతుడు ఓంప్రకాష్‌(ఫైల్‌)

Advertisement
Advertisement