నాన్న కల.. నా లక్ష్యం | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 5 2023 12:02 AM

- - Sakshi

వాతావరణ ం
ఆదివారం జిల్లాలో ఉదయం నుంచే ఎండ ప్రభావం మొదలవుతుంది. మధ్యాహ్నానికి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
● ఐపీఎస్‌ శిక్షణ పూర్తిచేసుకున్న భద్రాద్రి వాసి మౌనిక ● తెలంగాణ కేడర్‌కు కేటాయిస్తూ హోంశాఖ ఆదేశాలు ● ఫార్మసీతో మొదలై పోలీసింగ్‌ వైపు దృష్టి ● ప్రతీ అడుగులో అండగా నిలిచిన తండ్రి రామ్‌కుమార్‌ ● అమ్మాయిలను ప్రోత్సహిస్తే అద్భుతాలు సాధిస్తారంటున్న తల్లి

ఆదివారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2023

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సివిల్‌ సర్వీసెస్‌–2021 బ్యాచ్‌ ఐపీఎస్‌ల శిక్షణ ఇటీవల పూర్తి కాగా, కేంద్ర హోంశాఖ ఏడుగురిని తెలంగాణకు కేటాయించింది. ఇందులో భద్రాచలం పట్టణానికి చెందిన వ్యాపారవేత్త పోరిక వాణీకుమారి – రామ్‌కుమార్‌ దంపతుల కుమార్తె మౌనిక కూడా ఉన్నారు. సొంత రాష్ట్రంలోనే పోలీస్‌ అధికారిగా సేవలు అందించే అవకాశం రావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్న ఆమె... సివిల్స్‌ సాధించే క్రమంలో స్ఫూర్తిగా నిలిచిన అంశాలు, ఎదురైన సవాళ్లు తదితర అంశాలను శనివారం ‘సాక్షి’కి వివరించారు.

చదువంతా హైదరాబాద్‌లోనే

మా నాన్న రామ్‌కుమార్‌ హైదరాబాద్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో ఇంజనీర్‌గా పనిచేసేవారు. దీంతో మా ఫ్యామిలీ అక్కడే ఉండేది. స్కూలింగ్‌ నుంచి కాలేజ్‌ వరకు చదువు అంతా హైదరాబాద్‌లోనే పూర్తిచేశా. అమ్మ భద్రాచలంలో వ్యాపారాలు చూసుకుంటూ ఇక్కడే ఉండటంతో తరచుగా వచ్చి వెళ్లేదాన్ని ఇంటర్‌ తర్వాత ఎంబీబీఎస్‌ చేసి డాక్టర్‌ అవాలని ముందుగా అనుకున్నా, చివరి నిమిషంలో ఫార్మసీ వైపు వెళ్లాను. ఫార్మసీ పూర్తి చేసిన తర్వాత మెడిసిన్‌ రీసెర్చ్‌ కోర్సు కోసం రెండేళ్లు జర్మనీలో ఉన్నాను. అనంతరం ఫార్మసీ రంగంలోనే స్థిరపడి పోదాం అనుకున్నాను.

ఆ బాధ కనిపించేది..

నాన్న రామ్‌కుమార్‌కు చిన్నప్పటి నుంచి ఐపీఎస్‌ కావాలనే కోరిక బలంగా ఉండేది. ఇంజనీరింగ్‌ పూర్తి కాగానే ఉద్యోగం రావడం ఆ వెంటనే పెళ్లి జరిగాయి. అయినప్పటికీ సివిల్స్‌కు ప్రయత్నించారు. అయితే మూడుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లినా సివిల్స్‌ సాధించలేకపోయారు. ఆయనతో చదువుకున్న వారిలో కొందరు సివిల్స్‌కు ఎంపికయ్యారు. దీంతో నేను కానీ తమ్ముడు మోహిత్‌ కానీ సివిల్స్‌కి ఎంపిక కావాలంటూ మాకు ఎప్పుడూ చెబుతుండే వారు. కానీ తమ్ముడు కెరీర్‌గా బిజినెస్‌ను ఎంచుకున్నాడు. మా కుటుంబం నుంచి ఎవరూ సివిల్స్‌ వైపు వెళ్లలేదనే బాధ నాన్నలో తరచుగా కనిపించేది. దీంతో జర్మనీ నుంచి తిరిగి వచ్చాక సివిల్స్‌ వైపు వెళ్లాలని నేను గట్టిగా నిర్ణయించుకున్నా.

సొంతంగానే ప్రిపేర్‌ అయ్యా..

ఇంటర్నెట్‌లో ఉన్న మెటీరియల్‌, యూట్యూబ్‌లో ఉన్న నిపుణుల వీడియోలతో సొంతంగానే సివిల్స్‌కు ప్రిపేర్‌ అవడం మొదలెట్టాను. బయట ఎక్కడా కోచింగ్‌ సెంటర్లకు వెళ్లలేదు. అప్పటికే నాన్నకు సివిల్స్‌ పరీక్షలు రాసిన అనుభవం ఉండటం వల్ల నోట్స్‌ రాసుకోవడంలో వల్ల ఆయన గైడ్‌ చేసేవారు. మొదటి మూడు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ దాటినా ఇంటర్వ్యూల్లో వెనుకబడిపోయాను. దీంతో వివాహం జరిపించాలని మా అమ్మానాన్నలపై ఒత్తిడి వచ్చేది. అయినా పట్టువీడకకుండా మరో రెండు ప్రయత్నాలు చేసి ఇంటర్వ్యూ వరకు వెళ్లినా విజయం దక్కలేదు. వరుసగా ఐదు సార్లు విఫలం కావడంతో స్నేహితులు, బంధువుల నుంచి ఒత్తిడి మరింత ఎక్కువైంది. ఎవరేమనుకున్నా.. నా లక్ష్యం నుంచి పక్కకు తప్పుకోకూడదని నిర్ణయించుకున్నాను. సివిల్స్‌కి ప్రిపేర్‌ అవడంలో అప్పటికే వచ్చిన అనుభవం, నాన్న ఇచ్చిన సలహాలతో ఆరో ప్రయత్నంలో సక్సెస్‌ అయి ఐపీఎస్‌కు ఎంపికయ్యాను.

న్యూస్‌రీల్‌

అడ్డంకులు కావు

ఇంటర్నెట్‌లో కావాల్సినంత సమాచారం అందుబాటులో ఉంది. భద్రాచలమైనా, హైదరాబాదైనా ఒక్కటే. మనం ఎక్కడి నుంచి వచ్చాం.. మనది ఏ

ప్రాంతం అనే అంశాలతో సంబంధం లేకుండా క్రమశిక్షణతో పట్టుదలగా ప్రయత్నిస్తే

ఎవరైనా ఎలాంటి లక్ష్యాలనైనా సాధించవచ్చు.

ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదు..

అమ్మాయిలకు అరకొరగా చదువు చెప్పించడం, ఆ తర్వాత పెళ్లి, భర్త, పిల్లలే లోకం అన్నట్టుగా ఉంది కొన్నిచోట్ల పరిస్థితి. కానీ అమ్మాయిలకు అండగా ఉంటే వారిలోని ప్రతిభను ప్రోత్సహిస్తే ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. కన్న తల్లిదండ్రులు, పుట్టిన ఊరికి పేరు తెస్తారని చెప్పేందుకు మౌనిక ఉదాహరణ.

– పోరిక వాణీకుమారి, మౌనిక తల్లి

పెళ్లి చేసేయండి..

సివిల్స్‌ మూడు సార్లు విఫలమయ్యాక ‘ఇంకెన్నాళ్లు అమ్మాయిని చదివిస్తారు. త్వరగా పెళ్లి చేసేయండి’ అంటూ అమ్మానాన్నలు ఎక్కడకు వెళ్లినా బంధువుల నుంచి ఒత్తిళ్లు వచ్చేవి. దీంతో ఫ్యామిలీ ఫంక్షన్లకు కూడా వెళ్లలేదు. పూర్తిగా సివిల్స్‌పైనే దృష్టి సారించాను.

1/3

తల్లిదండ్రులు రామ్‌కుమార్‌ – వాణీకుమారితో మౌనిక
2/3

తల్లిదండ్రులు రామ్‌కుమార్‌ – వాణీకుమారితో మౌనిక

3/3

Advertisement
Advertisement