ఊగే చేతుల తుఫానులో కేసీఆర్‌ కనుమరుగు | Sakshi
Sakshi News home page

ఊగే చేతుల తుఫానులో కేసీఆర్‌ కనుమరుగు

Published Sat, Nov 18 2023 12:10 AM

మణుగూరు సభకు హాజరైన జనం, అభివాదం చేస్తున్న రాహుల్‌గాంధీ - Sakshi

● ప్రజల తెలంగాణ కోసమే కాంగ్రెస్‌ ప్రయత్నం ● మణుగూరు మీటింగ్‌లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ● జంప్‌ జిలానీలకు బుద్ధి చెప్పాలి : పొంగులేటి ● ప్రస్తుత ఎమ్మెల్యే కాంగ్రెస్‌ ఆఫీస్‌నూ కబ్జా చేశారు : పాయం

జై కాంగ్రెస్‌ నినాదాల హోరు..

నిర్దేశిత సమయం కంటే సుమారు గంట ఆలస్యంగా రాహుల్‌గాంధీ కార్యక్రమం మొదలైంది. విజయవాడ నుంచి హెలికాప్టర్‌ ద్వారా నేరుగా డిగ్రీ కాలేజీ మైదానానికి చేరుకున్న రాహుల్‌, అక్కడి నుంచి మెరుపు వేగంతో అంబేద్కర్‌ కూడలికి చేరుకున్నారు. అక్కడ కార్నర్‌ మీటింగ్‌ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక జీప్‌పైకి క్షణాల్లో చేరుకున్నారు. వైట్‌ టీ షర్ట్‌, బ్లాక్‌ ప్యాంట్‌ఽ ధరించిన రాహుల్‌ గాంధీ వాహనం నలువైపులా తిరుగుతూ ప్రజలకు అభివాదం చేశారు. రాహుల్‌ వాహనంపైకి చేరుకున్నది మొదలు ప్రసంగం మొదలు పెట్టే వరకు నలువైపులా ప్రజలు జై కాంగ్రెస్‌ నినాదాలతో హోరెత్తించారు.

నేను చెప్పిందే చెప్పండి

ప్రసంగం ప్రారంభిస్తూ రాహుల్‌ గాంధీ ముందుగా హిందీలో నమస్కార్‌ అంటూ మొదలెట్టారు. ఆ వెంటనే సర్దుకుని నమస్కారం అంటూ తెలుగులో సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే పక్కనే ఉన్న అనువాదకుడు మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన అక్కలు, చెల్లెళ్లు, అన్నలు, తమ్ముళ్లు, మహిళలు, వృద్ధులు.. అందరికీ నమస్కారం అంటూ తర్జుమా చేశారు. దీంతో వెంటనే రాహుల్‌గాంధీ కల్పించుకున్నారు. ‘కేవలం నేను ఏదీ చెప్పానో అది మాత్రమే చెప్పండి’ అంటూ అనువాదకుడికి హిందీలో సూచించారు.

ఇసుకదందాలు,

భూ కబ్జాలు..

రాహుల్‌ గాంధీ ప్రసంగానికి ముందు పీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్‌ పొంగులేటి శ్రీనివాసరెడి మాట్లాడారు. పినపాక నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు గెలుపు కోసం రాహుల్‌గాంధీ ఇక్కడికి వచ్చారని తెలిపారు. కాంగ్రెస్‌ గుర్తు మీద గెలిచిన అభ్యర్థి జంప్‌ జిలానీ అయ్యాడంటూ పరోక్షంగా రేగా కాంతారావుపై విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత పినపాక కాంగ్రెస్‌ అభ్యర్థి పాయం మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ రాక సందర్భంగా ఏజెన్సీలోని ఏడు మండలాల నుంచి వచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే అరాచక పాలనతో నియోజకవర్గంలో అభివృద్ధి ఐదేళ్లు వెనక్కి పోయిందన్నారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ప్రస్తుత ఎమ్మెల్యే కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌ను కూడా కబ్జా చేశాడంటూ రేగాపై విమర్శలు గుప్పించారు. రంగులు మార్చే వ్యక్తి కావాలో, గిరిజనులు, గిరిజనేతరులను ఒకేలా చూసుకునే పాయం కావాలో ఓటర్లు తేల్చుకోవాలన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఇసుకదందాలు చేస్తే తాను పవర్‌ ప్లాంట్‌ తెచ్చానని, రేగా భూములు కబ్జా చేస్తే తాను డిగ్రీ కాలేజీ, ఐటీఐ, ఫైర్‌ స్టేషన్లను తీసుకొచ్చానంటూ ఆయన చెప్పారు. పినపాకలో కాంగ్రెస్‌ను గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, డీసీసీ అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

వినపడలేదు

రాహుల్‌ ప్రసంగం వినేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చి గంటల కొద్దీ ఎండలో నిలబడిన ప్రజలకు అంతంత మాత్రంగా జరిగిన ఏర్పాట్లు ఇబ్బంది కలిగించాయి. కార్నర్‌ మీటింగ్‌ కోసం ఏర్పాటు చేసిన మైక్‌, సౌండ్‌ సిస్టమ్‌ దూరంగా ఉన్న వారికి సరిగా వినిపించలేదు. పది నిమిషాల సేపు మౌనంగా ఉన్నా మాటలు సరిగా అర్థం కాకపోవడంతో దూరంగా ఉన్న వారు ప్రసంగం వినడంపై ఆసక్తిని కోల్పోయారు. ఆఖరికి సోషల్‌ మీడియా లింకుల్లో సైతం సాంకేతిక సమస్య ఎదురుకావడం కాంగ్రెస్‌ అభిమానులను ఆవేదనకు గురిచేసింది.

ఉదయం 11 గంటల నుంచే..

రాహుల్‌ గాంధీ పర్యటన మధ్యాహ్నం12:15 గంటలకు ఖరారైంది. అయితే ఉదయం11 గంటలకే జిల్లా నలుమూలల నుంచి రాహుల్‌ కార్నర్‌ సభ కోసం ప్రజలు రావడం మొదలైంది. దీంతో పోలీసులు మణుగూరు పట్టణంలో ట్రాఫిక్‌ మళ్లించారు. మధ్నాహ్నం 12 గంటలలోగా భద్రాచలం–ఏటూరునాగారం రహదారిపైకి ప్రజలు భారీగా తరలివచ్చారు. పక్కనున్న భవనాలపైకి చేరుకుని రాహుల్‌ రాక కోసం ఎదురు చూశారు. అయితే షెడ్యూల్‌ సమయం కంటే గంట ఆలస్యంగా కార్యక్రమం మొదలవడంతో రాహుల్‌ రోడ్‌షో చేయలేకపోయారు. నేరుగా అంబేద్కర్‌ సెంటర్‌ చేరుకుని కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొని తిరిగి నర్సంపేటకు వెళ్లిపోయారు.

1/1

Advertisement
Advertisement