ఏంటి..? నిజాయితీగా పని చేస్తే ఇలా చేస్తారా..!? | Sakshi
Sakshi News home page

ఏంటి..? నిజాయితీగా పని చేస్తే ఇలా చేస్తారా..!?

Published Thu, Aug 10 2023 7:28 AM

- - Sakshi

కుమరం భీం: నిజాయతీగా పని చేసిన అధికారులకు వేధింపులు తప్పడం లేదు. కుమురంభీం జిల్లా రవాణా శాఖ అధికారిపై అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. జిల్లాలో ఇసుక, కంకర తదితర రవాణా చేసే టిప్పర్లు నిబంధనలకు విరుద్ధంగా భారీ లోడ్‌తో వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, కౌటాల తదితర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. దీనిపై ‘సాక్షి’ గత నెల 24న ‘కిల్లింగ్‌.. ఓవర్‌ లోడ్‌’ శీర్షికన ఓ కథనం ప్రచురించింది. స్పందించిన జిల్లా రవాణా శాఖ అధికారి జి.లక్ష్మీ తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అదే రోజున ఐదు టిప్పర్లు అధిక లోడ్‌తో వెళ్తున్న వాటిని గుర్తించి సీజ్‌ చేశారు. వాటిని విడిచిపెట్టాలంటూ ఓ ప్రజాప్రతినిధి ఫోన్‌ చేసి అడిగారు. అందుకు ఆమె అంగీకరించలేదు.

దీంతో తాము చెప్పినా వినిపించుకోకుండా, ఫైన్‌ వేస్తారా? అనే కోపంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, రవాణాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. ఆ ఫిర్యాదు ప్రభుత్వ పరి శీలనలో ఉంది. దీంతో ఆమెను ఇక్కడి నుంచి బదిలీ వేటు వేస్తారా? అని అధికారుల్లో చర్చ నడుస్తోంది. అయితే తన విధులు తాను నిర్వర్తించానని, ఇందులో రాజకీయం జోక్యం చేసుకున్నా తనకేం ఇబ్బంది లేదని, ఎక్కడైనా పని చేస్తామనే ధీమాతో ఉన్నట్లు తెలిసింది.

Advertisement
Advertisement