Sakshi News home page

అమ్మ దర్శనానికి నకిలీ డోనర్‌లు

Published Wed, Nov 15 2023 12:50 AM

అధికారులు స్వాధీనం చేసుకున్న క్లోనింగ్‌ కార్డులు  - Sakshi

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.లక్ష పైబడి విరాళం ఇచ్చే దాతలకు దేవస్థానం జారీ చేసే డోనర్‌ కార్డులు క్లోనింగ్‌ జరుగుతున్న వ్యవహారం తాజాగా బయట పడింది. డోనర్‌ కార్డులను కలర్‌ జిరాక్స్‌లతో నకిలీవి తయారుచేసి, వాటితో కొంతమంది భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్నా టికెట్ల ఆదాయం అంతంత మాత్రంగా రావడంతో దుర్గగుడి ఈఓ కె.ఎస్‌.రామారావు టికెట్ల విక్రయాలపై దృష్టి పెట్టాలని ఆలయ అధికారులను ఆదేశించారు. దీంతో కొద్ది రోజులుగా టికెట్ల విక్రయాలు, చెకింగ్‌ పాయింట్‌పై ఏఈఓ చంద్రశేఖర్‌ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రెండు రోజుల క్రితం గాలి గోపురం వద్ద దేవస్థానం ఏర్పాటు చేసిన స్కానింగ్‌ పాయింట్‌లో ఏఈఓ చంద్రశేఖర్‌ తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కుటుంబం డోనర్‌ కార్డును తీసుకుని రూ.500 క్యూలైన్‌లో దర్శనానికి విచ్చేసింది. ఆ కార్డు దేవస్థానం జారీ చేసిన కార్డుకు భిన్నంగా ఉండటంతో ఏఈఓకు అనుమానం వచ్చింది. కార్డులో ఉన్న దాతల ఫొటోలతో భక్తుడి ఫొటో సరిపోలకపోవడంతో ఆరా తీశారు. తొలుత కార్డు తమదేనని ఆ కుటుంబం నమ్మించే ప్రయత్నం చేసింది. గట్టిగా నిలదీయడంతో తమకు తెలిసిన వారు ఈ కార్డు ఇచ్చి దర్శనానికి పంపారని చెప్పడంతో భక్తుల నుంచి కార్డును స్వాధీనం చేసుకున్నారు. మరో అర్ధగంట తర్వాత ఇదే రీతిలో అంతకు ముందు భక్తుడు తీసుకొచ్చిన డోనర్‌ కార్డు మరొక కలర్‌ జిరాక్స్‌ స్కానింగ్‌ పాయింట్‌ వద్దకు వచ్చింది. దీంతో భక్తులను నిలదీయగా, తొలుత వచ్చిన వారు చెప్పిన సమాధానమే చెప్పడంతో ఆలయ అధికారులు విస్తుపోయారు. ఒకే దాత పేరుతో ఉన్న కార్డులు రెండు ఒకే రోజు వచ్చిన విషయాన్ని ఆలయ అధికారులు వెంటనే ఈఓ కె.ఎస్‌.రామారావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే అన్నదానం విభాగానికి చెందిన అధికారులతో సమావేశమై, దాతలకు ఇచ్చిన డోనర్‌ కార్డులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇకపై డోనర్‌ కార్డుపై దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడినీ టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌, సూపరింటెండెంట్‌ వద్దకు పంపాలని, అక్కడ వారి వివరాలను నమోదు చేసుకున్న తర్వాతే దర్శనానికి అనుమతించాలని భావిస్తున్నారు.

గతంలోనూ పలు వివాదాలు

దుర్గగుడిలో డోనర్‌ కార్డులపై గతంలోనూ అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. దసరా ఉత్సవాలకు ముందు ఓ తల్లీకుమార్తెలు వీఐపీ లైన్‌లో దర్శనానికి వచ్చి డోనర్‌ కార్డును చూపారు. వీఐపీ క్యూలైన్‌లో రద్దీ అధికంగా ఉండటంతో వారిని రూ.300 క్యూలైన్‌లో వెళ్లాలని సిబ్బంది సూచించారు. దీంతో వారు సిబ్బందిని నెట్టి వేసి ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పెద్ద వివాదమే జరిగింది. ఆలయ అధికారులు కల్పించుకుని దాతలకు ప్రాధాన్యం ఇవ్వాలనే భావనతో వారిని ఆలయంలోకి అనుమతించారు.

డోనర్‌ కార్డు స్కానింగ్‌ నిల్‌

అన్నదానానికి విరాళం, అమ్మవారికి బంగారు ఆభరణాలు ఇచ్చే దాతలకు దేవస్థానం డోనర్‌ కార్డు జారీ చేస్తుంది. దేవస్థానం ఇప్పటి వరకు ఎంత మందికి కార్డులు జారీ చేసింది? ఎంత మంది భక్తులు అన్నదానానికి విరాళాలు ఇస్తున్నారు? ఎంత మందికి కార్డులు జారీ చేశారు? దాతలు ఎప్పుడెప్పుడు దర్శనానికి వస్తున్నారు? అన్న వివరాలు దేవస్థానం వద్ద లేకపోవడంతో పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో విరాళంగా ఇచ్చిన రశీదును క్యూలైన్‌లో చూపితే దర్శనానికి పంపేవారు. తాజాగా ఐదేళ్లుగా దాతల వివరాలను డిజిటల్‌ కార్డు రూపంలో పొందుపరిచి డోనర్‌ కార్డును అంద జేస్తున్నారు. ప్రస్తుతం దేవస్థానం టికెట్ల జారీ, స్కానింగ్‌ ఏ విధంగా జరుగుతుందో డోనర్‌ కార్డులను కూడా అదే రీతిలో స్కానింగ్‌ చేసేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తే ఈ తరహా మోసాలను అరికట్టొచ్చని భక్తులు పేర్కొంటున్నారు.

డోనర్‌ కార్డులను క్లోనింగ్‌ చేస్తున్న వైనం జిరాక్స్‌ కార్డులతో దర్జాగా దర్శనాలు అధికారుల తనిఖీలో వెలుగులోకి.. పలువురి నుంచి కార్డులు స్వాధీనం

త్వరలో డిజిటల్‌ కార్డులు

దేవస్థానానికి విరాళాలు ఇచ్చిన దాతల వివరాలను కంప్యూటర్‌లో పొందుపరచడంతో పాటు వారికి డిజిటల్‌ కార్డులు జారీ చేయాలని నిర్ణయించాం. త్వరలోనే దాతలకు డిజిటల్‌ కార్డులు జారీచేస్తాం. ఇకపై దాత దర్శనానికి ఎన్ని సార్లు దర్శనానికి వస్తున్నారనే వివరాలు కంప్యూటర్‌లో నమోదయ్యేలా చూస్తాం. విరాళాలు ఇచ్చిన దాతలు మాత్రమే అమ్మవారి దర్శనానికి రావాలి. జిరాక్స్‌ కార్డులు తీసుకుని వచ్చే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం.

– కె.ఎస్‌.రామారావు, దుర్గగుడి ఈఓ

Advertisement

What’s your opinion

Advertisement