Sakshi News home page

రబీ సీజన్‌కు 2,150 క్వింటాళ్ల వేరుశనగ

Published Wed, Nov 15 2023 1:52 AM

సమావేశంలో మాట్లాడుతున్న  జాయింట్‌ కమిషనర్‌  ఎం.శివప్రసాద్‌  - Sakshi

పత్తికొండ సబ్‌ డివిజన్‌కు అత్యధికంగా 1,280 క్వింటాళ్లు

కర్నూలు(అగ్రికల్చర్‌): రబీలో నీటి ఆదారంపై సాగుకు సబ్సిడీ వేరుశనగ విత్తనం కాయల పంపిణీకి రంగం సిద్ధమైంది. ప్రభుత్వం జిల్లాకు 2,150 క్వింటాళ్ల వేరశనగను కేటాయించింది. నీటి వసతిని బట్టి మండలాల వారీగా వేరుశనగను కేటాయిస్తూ జిల్లా వ్యవసాయ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. అత్యధికంగా పత్తికొండ సబ్‌ డివిజన్‌కు 1,280 క్వింటాళ్లు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ధి సంస్థ(ఏపీ సీడ్స్‌) వేరుశనగ విత్తన కాయలను ఆర్‌బీకేల వారీగా పొజిషన్‌ చేస్తుంది.

డోన్‌ డివిజన్‌ ఏసీఎఫ్‌గా సూర్యచంద్ర రాజు

కర్నూలు కల్చరల్‌: అటవీ శాఖ డోన్‌ డివిజన్‌ అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (ఏసీఎఫ్‌)గా ఎం. సూర్యచంద్ర రాజు నియమితులయ్యారు. ఈ మేరకు అటవీశాఖ ప్రిన్సిపాల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ మధుసూదనరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు రేంజ్‌ ఎఫ్‌ఆర్వోగా విధులు నిర్వహిస్తున్న ఈయనకు ఏసీఎఫ్‌గా పదోన్నతి కల్పించి నంద్యాల సర్కిల్‌ పరిధిలోని డోన్‌ డివిజన్‌కు బదిలీ చేశారు. పదోన్నతి పొందిన సూర్యచంద్రరాజును కర్నూలు రేంజ్‌ కార్యాలయ ఉద్యోగులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

త్వరలో కరువు ప్రాంతాలకు సెంట్రల్‌ టీమ్‌

కర్నూలు(అగ్రికల్చర్‌): కరువు ప్రాంతాలుగా గుర్తించిన మండలాల్లో త్వరలో సెంట్రల్‌ టీమ్‌ పర్యటించనున్నట్లు వ్యవసాయ శాఖ కమిషనర్‌ హరికిరణ్‌ తెలిపారు. సెంట్రల్‌ టీం రానున్న నేపథ్యంలో వ్యవసాయ యంత్రాంగం కరువుపై పూర్తి స్థాయి నివేదికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. మంగళవారం గుంటూరు నుంచి వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కరువు, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ... మరిన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలనే ప్రతిపాదనలు వస్తున్నాయని చెప్పారు. రబీలో శనగ సాగుకు అదును దాటిపోయినందున సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీని వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. నీటిపారుదల కింద వేరుశనగ సాగు చేసే రైతులకు సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేయాలని తెలిపారు. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్‌ వరలక్ష్మి, ఏడీఏలు సాలురెడ్డి, మహమ్మద్‌ ఖాద్రీ, సునీత తదితరులు పాల్గొన్నారు.

పక్కా ప్రణాళికతో ఉపాధి పనులు

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ జాయింట్‌ కమిషనర్‌ ఎం.శివప్రసాద్‌

ఎమ్మిగనూరు రూరల్‌: పక్కా ప్రణాళికతో కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌)జాయింట్‌ కమిషనర్‌ ఎం.శివప్రసాద్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక మండల పరిషత్‌ సమావేశ భవనంలో జిల్లా స్థాయి ఏపీడీలు, ఏపీఓలు, ఈసీలు, ప్లాంటేషన్‌ సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 25 మండలాల్లో ఆదోని డివిజన్‌ చాల వెనకబడి ఉందని చెప్పారు. ఈ ప్రాంతం నుంచి వలసలు వెళ్లకుండా పనులు కల్పించాలన్నారు. అయితే, చాలా చోట్ల చేసిన పనులే చేయిస్తున్నారని ఉపాధి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టిని తవ్వే పనుల స్థానంలో కొత్త పనులు చేపట్టాలని ఆదేశించారు. ఫామ్‌పాండ్స్‌ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో కర్నూల్‌, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆదోని, ఆలూరు క్లస్టర్ల ఏపీడీలు లక్ష్మన్న, అల్లిపీరా, పద్మావతి, లోకేశ్వర, పక్కిరప్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement