వీధి కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్‌ | Sakshi
Sakshi News home page

వీధి కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్‌

Published Tue, Dec 12 2023 1:30 AM

ఫ్యామిలీ ప్లానింగ్‌ చేసిన కుక్క చెవిని 
వి ఆకారంలో కట్‌ చేసిన దృశ్యం - Sakshi

వీధి కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్‌ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద కర్నూలు నగరంలోని వీధి కుక్కలకు నవోదయ వెట్‌ సొసైటీతో ద్వారా ప్రభుత్వం శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ వాటి సంతతి వృద్ధికి అడ్డుకట్టు వేస్తోంది. 2021 నుంచి ఇప్పటి వరకు 6,822 కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్‌ ఆపరేషన్లు చేశారు.

పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద

కర్నూలు నగరంలోని

వీధి కుక్కలకు శస్త్రచికిత్సలు

విస్తరిస్తున్న వీధి కుక్కల కట్టడికి

నవోదయ వెట్‌ సొసైటీతో కలిసి

ప్రభుత్వం కార్యాచరణ

కర్నూలు(అగ్రికల్చర్‌): వీధి కుక్కల స్వైరవిహారాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా 2021 నుంచి వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. పైలట్‌ ప్రాజెక్టుగా కర్నూలులో వీధి కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్‌ ఆపరేషన్లు ముమ్మరగా సాగుతున్నాయి. త్వరలో నంద్యాలలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆదోని మున్సిపాలిటీలో గతంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

నవోదయ వెట్‌ సొసైటీ సహకారంతో..

కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో దాదాపు 20 వేల వరకు వీధి కుక్కలు ఉన్నట్లు తెలుస్తోంది. వీధి కుక్కల నియంత్రణలో నవోదయ వెట్‌ సొసైటీ కీలకంగా వ్యవహరిస్తోంది. వెటర్నరీ ఆఫీసర్‌ పర్యవేక్షణలో కుక్కలను పట్టడం, వాటికి గార్గేయపురం దగ్గరనున్న డంప్‌ యార్డు వద్ద వీధి కుక్కల సంతాన నియంత్రణ కేంద్రం ఏర్పాటు చేసింది. అక్కడ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించడం, అవసరమైన మందులు, ఆహారం తదితర వాటిని నవోదయ వెట్‌ సొసైటీనే నిర్వహిస్తోంది. సొసైటీ ఏర్పాటు చేస్తుకున్న పశువైద్యుడే 2021 నుంచి ఇప్పటి వరకు 6,822 వీధి కుక్కలకు శస్త్రచికిత్సలు చేశారు. కాగా 2021–22, 2022–23లో ఒక కుక్కకు రూ.1,450 చొప్పున, 2023లో కుక్కకు రూ.1,650 ప్రకారం నవోదయ వెబ్‌ సొసైటీకి కార్పొరేషన్‌ చెల్లించింది.

ఆరు నెలల పైబడిన కుక్కలకే ఆపరేషన్‌..

ఆరు నెలల వయస్సు పైబడిన కుక్కలకే శస్త్రచికిత్సలు చేస్తారు. గర్భంతో ఉన్న కుక్కలకు శస్త్రచికిత్సలు చేయరు. గర్భంతో ఉందా.. లేదా అని నిర్ధారించిన తర్వాతే ఆపరేషన్‌ చేస్తారు. ఆడ కుక్కలకు ట్యూబెక్టమీ, మగ కుక్కలకు వేసెక్టమీ ఆపరేషన్‌లు చేస్తారు. ఆపరేషన్‌ చేసిన కుక్కలను గుర్తించేందుకు చెవిలో కొంత భాగాన్ని గ ఆకారంలో కట్‌ చేస్తారు. శస్త్రచికిత్స నుంచి కుక్క పూర్తిగా కోలుకున్న తర్వాత రేబిస్‌ వ్యాక్సిన్‌ వేసి ఎక్కడైతే కుక్కను పట్టుకున్నారో.. అక్కడే వదిలేస్తారు.

పెంపుడు కుక్కలకు కూడా..

పట్టణ ప్రాంతాల్లో ఇంటికి రక్షణగా వివిధ జాతుల కుక్కలను పోషిస్తున్నారు. కుక్కల పెంపకం హాబీగా కూడా మారింది. పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా 3 నెలల వయస్సులో టీకాలతో పాటు ఏటా బూస్టర్‌ డోస్‌ వేయించాలి. ఆరు నెలల తర్వాత జనన నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించాలని పశుసంవర్ధకశాఖ అధికారులు యమజానులకు అవగాహన కల్పిస్తున్నారు.

పకడ్బందీగా వీధి కుక్కలకు

శస్త్రచికిత్సలు

నవోదయ వెట్‌ సొసైటీ ద్వారా నగరపాలక సంస్థలో విధి కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్‌ చేస్తున్నాం. రోజుకు సగటున 20 వరకు వీధి కుక్కలకు గార్గేయపురం సమీపంలోని డంప్‌ యార్డు వద్ద నిర్మించిన వీధి కుక్కల సంతాన నియంత్రణ కేంద్రంలో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నాం. ఆపరేషన్‌ తర్వాత వాటి పరిస్థితి పర్యవేక్షిస్తున్నాం.

– డాక్టర్‌ మల్దన్న, వెటర్నరీ ఆఫీసర్‌, కర్నూలు

వీధి కుక్కకు శస్త్రచికిత్స చేస్తున్న దృశ్యం
1/3

వీధి కుక్కకు శస్త్రచికిత్స చేస్తున్న దృశ్యం

కర్నూలులో నిర్మించిన వీధి కుక్కల సంతాన నియంత్రణ కేంద్రం
2/3

కర్నూలులో నిర్మించిన వీధి కుక్కల సంతాన నియంత్రణ కేంద్రం

3/3

Advertisement
Advertisement