ఆకాశం నుంచి పడిన మంత్రపు పెట్టె.. రూ.50కోట్లంటూ.. | Sakshi
Sakshi News home page

ఆకాశం నుంచి పడిన మంత్రపు పెట్టె.. రూ.50కోట్లంటూ..

Published Tue, Mar 5 2024 1:40 AM

మంత్రపు పెట్టెను చూపిస్తున్న ఏసీపీ  - Sakshi

జనగామ: మంత్రాల పెట్టె పేరుతో అమాయకుల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ దామోదర్‌రెడ్డి తెలిపారు. జనగామ పట్టణ పోలీస్టేషన్‌లో సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సైలు సృజన్‌, శ్వేతతో కలిసి సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఘటన వివరాలు వెల్లడించారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా ఆమ్రాబాద్‌ మండలం మున్ననూర్‌కు చెందిన లారీ డ్రైవర్‌ కేతావత్‌ శంకర్‌, నారా యణపేట జిల్లా మక్తల్‌ మండలం సంఘం బండకు చెందిన చికెన్‌ వ్యాపారి ఖాసీం, వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన ఎలక్ట్రిషన్‌ ఎండీ అజహర్‌, నల్లగొండ జిల్లా దిండి మండలం దేవత్‌తల్లి తండాకు చెందిన కొర్ర గాసిరాం ప్రస్తుతం హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ బంజారాకాలనీలో నివాసముంటున్నారు.

ఈ క్రమంలో కుటుంబ పోషణకు డబ్బులు సరిపోకపోవడంతో తక్కువ సమయంలో ఎక్కు వ సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆకాశం నుంచి ఉల్కలు పడిన సమయంలో శక్తులు ఉన్న పెట్టె దొరికిందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ పెట్టెను రూ.50 కోట్లకు అమ్ముడుపోలా ప్లాన్‌ చేసుకుని వరంగల్‌కు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేస్తారనే సమాచారం మేరకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. పెట్టె కొనుగోలు చేస్తే కోటీశ్వరుడివి అవుతావని సదరు వ్యక్తిని నమ్మించారు.

అనంతరం నలుగురు.. పెట్టెను తీసుకుని హైదరాబాద్‌ నుంచి ఓ వాహనంలో వరంగల్‌ బయలుదేరారు. ఈ క్రమంలో జనగామ మండలం పెంబర్తి వై జంక్షన్‌ వద్ద ఎస్సై సృజన్‌, పీసీ బి.కర్ణాకర్‌, టి.రామన్న వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులు తమ వాహనాన్ని వెనకకు తిప్పే క్రమంలో పట్టుబడ్డారు. దీంతో వారి నుంచి పెట్టె, వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామన్నారు. కాగా, నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని డీసీపీ సీతారాం, ఏసీపీ దామోదర్‌రెడ్డి అభినందించారు.

Advertisement
Advertisement