బీఆర్‌ఎస్‌ అవినీతిని ఎండగట్టాం.. : మంత్రి పొంగులేటి | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ అవినీతిని ఎండగట్టాం.. : మంత్రి పొంగులేటి

Published Fri, Feb 9 2024 12:58 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌: ప్రాజెక్టుల పేరుతో బీఆర్‌ఎస్‌ చేసిన అవినీతిని శ్వేతపత్రంలో ఎండగట్టామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పాలమూరు న్యాయయాత్రలో భాగంగా వనపర్తి జిల్లా కొత్తకోటలో గురువారం కార్నర్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి హాజరై మాట్లాడారు.

రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్‌ కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి పాలమూరు జిల్లాలో ఏ ఒక్క ఎకరాకై నా నీళ్లు ఇచ్చారా.. అని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాను పట్టించుకున్న ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో పాలమూరులో చేపట్టిన ప్రాజెక్టులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయని, బీఆర్‌ఎస్‌ వచ్చిన తర్వాత కాల్వల్లో కంప, జమ్ము తొలగించి నీళ్లు పారించి పూలు జల్లి తామే అంతా చేశామని గొప్పలు చెప్పుకొన్నారని విమర్శించారు.

మాయమాటలు చెప్పి రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్‌ పాలమూరుకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. కార్యక్రమానికి వచ్చే ముందు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఏం మాట్లాడాలి అని అడిగితే.. దేవరకద్ర నియోజవర్గంలో 100 పడకల ఆస్పత్రి, మండలానికో 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేద్దామని చెప్పారన్నారు. ధరణి పేరుతో రైతుల భూములు లాక్కున్న వారి నుంచి తిరిగి తీసుకుని ప్రజలకు ఇస్తామన్నారు.

పాలమూరును కాపాడేందుకే న్యాయయాత్ర..
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి చల్లా వంశీచందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశాన్ని కాపాడేందుకు రాహుల్‌గాంధీ చేపడుతున్న ‘భారత్‌ జోడో యాత్ర’ను ఆదర్శంగా తీసుకుని ‘పాలమూరు న్యాయ యాత్ర’ చేపట్టానన్నారు.

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ తమపై నమ్మకంతో ప్రజలు ఓటు వేసి గెలిపించారని, రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరిగేలా కృషిచేస్తామన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటంబానికి సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త, నాయకుడు పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రజలను మభ్యపెట్టారు!
రాజాపూర్‌:
తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్ల పాటు రాష్ట్ర ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టారు.. ఇప్పుడు అధికారం కోల్పోయి రెండు నెలలు కూడా పూర్తికాని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాజాపూర్‌ మండలం రంగారెడ్డిగూడలోని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి నివాసంలో ఆయన మాట్లాడుతూ పదేళ్ల పాటు అధికారంలో ఉండి కాలయాపన చేసింది మీరు కాదా అని విమర్శించారు.

కృష్ణానది నీటిని ఎట్టి పరిస్థితుల్లో కేంద్రానికి అప్పజెప్పే ప్రసక్తే లేదన్నారు. ఇంకా వారే అధికారంలో ఉన్నట్లు భ్రమపడుతూ కాంగ్రెస్‌ పార్టీపై, ప్రభుత్వంపై నెట్టాలని చూడటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక విజన్‌తో ముందుకు వెళ్తున్నారన్నారు. సమావేశంలో రంగారెడ్డిగూడ మాజీ సర్పంచ్‌లు జనంపల్లి శశికళారెడ్డి, దుష్యంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవి చదవండి: కేసీఆర్ హామీతో.. ఆ స్థానం పదిలమేనా!?

Advertisement
Advertisement