Rajedra Prasad: 'లేడీస్ టైలర్' జోడీ.. 37 ఏళ్లకు మరోసారి రిపీట్

2 Apr, 2023 08:50 IST|Sakshi

1986లో వచ్చిన చిత్రం లేడీస్ టైలర్ సినిమా మీకు గుర్తుందా? అప్పట్లో ఆ మూవీ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, అర్చన జోడీగా నటించారు. ఈ సినిమాలో జంటగా నటించిన రాజేంద్రప్రసాద్, అర్చనల కెమిస్ట్రీని సినీ ప్రేక్షకులు అంత సులువుగా మరచిపోలేరు. అయితే ఇప్పుడేంటీ అనుకుంటున్నారా? అయితే మళ్లీ అదే జోడీ తెరపై సందడి చేయనుంది. దాదాపు 37 ఏళ్ల తర్వాత మరోసారి స్క్రీన్ పంచుకోబోతోంది ఈ జంట. 

రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో తాజాగా తెరకెక్కుతోన్న చిత్రం ‘షష్ఠి పూర్తి’. రూపేష్‌ కుమార్‌ చౌదరి, ఆకాంక్షా సింగ్‌ జంటగా పవన్‌ ప్రభ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. హీరోగా నటించడంతో పాటు రూపేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాాగ చెన్నైలోని సంగీతదర్శకుడు 
ఇళయరాజా స్టూడియోస్‌లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది. తొలి సీన్‌కి ఇళయరాజా కెమెరా స్విచాన్‌ చేయగా.. నిర్మాత ఆర్‌బి చౌదరి క్లాప్‌ ఇచ్చారు.

రూపేష్‌ కుమార్‌ చౌదరి మాట్లాడుతూ..'లేడీస్‌ టైలర్‌’ తర్వాత రాజేంద్రప్రసాద్, ఇళయరాజా కాంబినేషన్‌లో ‘ఆస్తులు అంతస్తులు, చెట్టు కింద ప్లీడర్, ఏప్రిల్‌ 1 విడుదల లాంటి మ్యూజికల్‌ హిట్స్‌ వచ్చాయి. చాలా ఏళ్ల తర్వాత ఈ లెజెండ్స్‌ కాంబినేషన్‌ రిపీట్‌ కాబోతోంది. అలాగే ‘లేడీస్‌ టైలర్‌’ తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన నటిస్తున్న చిత్రమిదే. ఈ  సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ఈ మూవీ న్యూ ఏజ్‌ ఫ్యామిలీ డ్రామా. జూలైలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.' అని అన్నారు.

మరిన్ని వార్తలు