సినిమా హిట్‌కి ఆస్కార్‌ ఉపయోగపడదు | MM Keeravani Interview For Naa Saami Ranga Movie- Sakshi
Sakshi News home page

సినిమా హిట్‌కి ఆస్కార్‌ ఉపయోగపడదు

Published Tue, Jan 9 2024 12:23 AM

MM Keeravani interview for Naa Saami Ranga - Sakshi

‘‘నేను మొదటి నుంచి సెలక్టివ్‌గానే సినిమాలు చేస్తున్నాను. ఒక సినిమాకి హైప్‌ అనేది రిలీజ్‌ అయ్యే పాటల ద్వారా వస్తుంది. అంతే కానీ నాకు వచ్చిన ‘ఆస్కార్‌’ అవార్డు అనేది ఓ సినిమా విజయానికి ఉపయోగపడదని భావిస్తాను. నా వరకూ సంగీతం బాగా అందించాలి. సినిమాని డైరెక్టర్‌ బాగా తీయాలి.

అది జనాలకి నచ్చాలి. ‘నా సామిరంగ’ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని సంగీత దర్శకుడు, ఆస్కార్‌ విజేత ఎంఎం కీరవాణి అన్నారు. నాగార్జున, ఆషికా రంగనాథ్‌ జంటగా విజయ్‌ బిన్నీ దర్శకత్వం వహించిన చిత్రం ‘నా సామిరంగ’. శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన ఎంఎం కీరవాణి విలేకరులతో పంచుకున్న విశేషాలు. 

► నాగార్జునగారు, నా కాంబినేషన్‌లో ‘ప్రెసిడెంట్‌గారి పెళ్ళాం, అల్లరి అల్లుడు, అన్నమయ్య, శ్రీరామదాసు..’ వంటి పలు హిట్‌ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వస్తున్న ‘నా సామిరంగ’ కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ‘ప్రెసిడెంటుగారి పెళ్ళాం’ గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమా. అందులో ఉన్నట్లుగానే ‘నా సామిరంగ’లోనూ  వినోదాత్మక అంశాలు చాలా ఉన్నాయి. ఈ మూవీ మరో ‘ప్రెసిడెంటుగారి పెళ్ళాం’ అవుతుందని ఆశిస్తున్నాను. పైగా ‘నా సామిరంగ’ నాగార్జునగారికి యాప్ట్‌ టైటిల్‌.   

► సీనియర్స్‌ కంటే కొత్త దర్శకుల్లో బాగా కష్టపడే తత్వం ఉంటుంది. ఎలాగైనా తమను తాము నిరూపించుకోవాలనే కసితో పని చేస్తారు. ఈ చిత్రదర్శకుడు విజయ్‌ బిన్నీ కూడా అంతే.. చాలా త్వరగా ఈ సినిమా తీయగలిగాడు. దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, రాఘవేంద్ర రావుగార్లలా క్వాలిటీ తగ్గకుండా త్వరగా సినిమా తీయడం తన ప్రధాన బలం అని భావిస్తున్నాను.

బిన్నీ డ్యాన్స్‌ మాస్టర్‌ కాబట్టి ప్రతి పాటని ఫుల్‌ డ్యాన్స్‌ కోణంలో ఆలోచించడం సహజం. కానీ, దానికి భిన్నంగా ఇందులో రెండు మూడు మెలోడీ పాటలు చేయించాడు.  అప్పుడు తను పరిపక్వత ఉన్న దర్శకుడనిపించింది. తెలుగు నేటివిటీ, కట్టుబాట్లు, సంక్రాంతి పండగ కళ ఉట్టిపడేలా ఈ చిత్రాన్ని రూపొందించాడు. సంగీతం కూడా ఫ్రెష్‌గా ఉంటుంది.

► ‘నా సామిరంగ’ చిత్రానికి పాటలన్నీ చంద్రబోస్‌గారే రాశారు. అయితే అన్నం తినేటప్పుడు కొంచెం పచ్చడి నంజుకుంటాం. అలా అని పచ్చడి తిన్నామని ప్రత్యేకంగా చెపుకోం.. అన్నం తిన్నామని మాత్రమే చెప్పుకుంటాం కదా (నవ్వుతూ). ఇదీ అంతే. నేనుప్రేషనల్‌ లిరిక్‌ రైటర్‌ని కాదు. ఎవరైనా వచ్చి రాయమని అడిగినా రాయను. కానీ రీ రికార్డింగ్‌ చేసినప్పుడు ఒక సందర్భం పుడుతుంది. అలాంటి సందర్భంలో నుంచి ఓ ఆలోచన వస్తుంది. ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఈ సినిమాలో ఓ పాట రాశానంతే.

► ‘నా సామిరంగ’ చిత్రంలో ఇప్పటి తరానికి కావాల్సిన పాటలు ఇచ్చాను. నా వయసు ఎక్కువైనా నా వద్ద పని చేసే వారందరూ యువకులే.. వారి ఆలోచనలు నేటి యువతకు తగ్గట్టు ఉంటాయి. అలా ముందుకెళుతున్నాను (నవ్వుతూ). ఓ పాట వైరల్‌ కావడం, కాకపోవడం అనేది మన చేతిలో లేదు. ఇప్పుడు ఇంటర్నెట్‌ ఉంది.. వ్యూస్‌ని బట్టి తెలుస్తోంది. కానీ గతంలో పాట హిట్‌ అయ్యిందా? లేదా అని తెలుసుకోవాలంటే కష్టంగా ఉండేది. ఏదైనా పెళ్లికి వెళ్లి చూసేవాళ్లం. అక్కడ బ్యాండ్‌లో ఆ పాట ప్లే చేస్తుంటే హిట్టయినట్టు.. లేకుంటే కానట్టు అని తెలుసుకునే వాళ్లం (నవ్వుతూ). 

►నేను సంగీతం అందిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాకి మూడు పాటలు రికార్డ్‌ చేశాం. చిరంజీవిగారి సినిమా మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ప్రారంభమయ్యాయి. రాజమౌళిగారితో చేయబోయే కొత్త సినిమా మ్యూజిక్‌ వర్క్‌ నా వరకూ ఇంకా రాలేదు.

Advertisement
Advertisement