'నెరు' సినిమా తెలుగు రివ్యూ (ఓటీటీ) | Sakshi
Sakshi News home page

Neru Review In Telugu: ఓటీటీలో అదరగొడుతున్న 'నెరు' సినిమా ఎలా ఉందంటే?

Published Wed, Jan 24 2024 10:33 AM

Mohanlal Neru Movie Review And Rating In Telugu - Sakshi

ఓటీటీలో ఓ మలయాళ డబ్బింగ్ సినిమా అదరగొడుతోంది. మూవీ పేరు 'నెరు'. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన మోహన్ లాల్, ప్రియమణి ఇందులో లాయర్లుగా నటించారు. కోర్టు రూమ్ డ్రామా కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీ.. మలయాళంలో 'సలార్'కి పోటీగా రిలీజై ఏకంగా రూ.100 కోట్ల మేర వసూళ్లు సాధించాయి. అంతలా ఈ సినిమాలో ఏముంది? నిజంగా అంత బాగుందా? అనేది రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)

'నెరు' కథేంటి?
సారా మహమ్మద్ (అనస్వర రాజన్)కి కళ్లు కనిపించవు. ఓ రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈమెపై ఓ వ్యక్తి అత్యాచారం చేస్తాడు. తనపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి పోలికల్ని గుర్తుంచుకున్న సారా.. అతడి రూపాన్ని మట్టితో శిల్పంలా చేస్తుంది. దీంతో ఈ విగ్రహానికి దగ్గర పోలికలున్న మైకేల్ (శంకర్ ఇందుచూడన్)ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ అతడి బడా పారిశ్రామికవేత్త కొడుకు కావడంతో.. ఎలాంటి కేసు అయినా సరే గెలిచేసే లాయర్ రాజశేఖర్ వల్ల బెయిల్ వస్తుంది. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్ విజయ్ మోహన్ (మోహన్ లాల్)ని ఆశ్రయిస్తారు. చాన్నాళ్ల నుంచి అసలు కోర్టుకే రాని విజయ్ మోహన్.. సారా తరఫున నిలబడి న్యాయం చేశాడా? లేదా? చివరకు ఏమైందనేదే స్టోరీ.

ఎలా ఉందంటే?
'నెరు' సినిమా కథ చూస్తే అస్సలు కొత్తది కాదు. ఓ సాధారణ అమ్మాయి.. ఊహించని విధంగా ఆమెపై బలత్కారం.. కేసు వేసినా సరే న్యాయం జరుగుతుందా అనే డౌట్..  ఇలాంటి టైంలో లాయర్ అయిన హీరో ఎంట్రీ.. వాదప్రతివాదనలు.. చివరకు న్యాయం గెలిచిందా లేదా అనేది క్లైమాక్స్. అయితే మూవీ చూస్తున్నప్పుడు తెలిసిన కథలానే అనిపిస్తుంది కానీ ప్రతి నిమిషం ఓ మంచి సినిమా చూస్తున్నామే అనుభూతి కలిగిస్తూ ఉంటుంది. స్టోరీ బాగుంది అనుకునేలోపు.. అద్భుతమైన నటనతో నటీనటులు విజృంభిస్తుంటారు. ఈ రెండు సూపర్ అనుకునేలోపు దర్శకుడు.. తన స్క్రీన్ ప్లే మేజిక్ చూపిస్తుంటాడు. అంత బాగుంటుంది ఈ సినిమా.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్)

హీరో బిల్డప్పులు.. ఎంట్రీ సాంగ్.. ఇలాంటి పనికిమాలిన రొటీన్ సీన్స్ ఏం లేకుండానే 'నెరు' కథని మొదలుపెట్టేశారు. కళ్లు కనిపించని అమ్మాయిపై అత్యాచారం జరగడం, దీంతో ఆమె తల్లిదండ్రులు కోర్టులో కేసు వేయడం.. అనుమానితుడు అయినా కుర్రాడిని అరెస్ట్ చేసి జైల్లో వేయడం.. అతడు తండ్రి కోటీశ్వరుడు కావడంతో ఫేమస్ క్రిమినల్ లాయర్ రంగంలోకి దిగడం.. అమ్మాయి తరఫు లాయర్ కన్ఫ్యూజన్.. దీంతో రేప్ చేశాడనే అనుమానమున్న కుర్రాడికి బెయిల్ రావడం.. ఇలా సీన్స్ అన్నీ చకాచకా పరుగెడుతుంటాయి. సరిగా అప్పుడు అమ్మాయి తరఫున వాదించేందుకు లాయర్ విజయ్ మోహన్ రంగంలోకి దిగుతాడు. అప్పటి నుంచి సినిమా మరింత థ్రిల్లింగ్‌గా మారుతుంది. చివరి వరకు అదే టెంపో మెంటైన్ చేస్తారు. ఇదే సినిమా విజయానికి కారణమైంది.

ఈ సినిమా చూస్తున్నప్పుడు అంతా తెలిసినట్లే ఉంటుంది. కానీ దర్శకుడు జీతూ జోసెఫ్ వాటిని రాసుకున్న విధానం మాత్రం వేరే లెవల్ ఉంటుంది. ఈ రోజుల్లో సాంకేతికతని ఎలా దుర్వినియోగపరుస్తున్నారు. తద్వారా నిందితుల్ని ఎలా తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారనేది క్లియర్ కట్‌గా చూపించారు. ఒకప్పటిలా కాకుండా అమ్మాయిలు ఇప్పుడు తమపై బలత్కారం జరిగితే ఎలా నిర్భయంగా ఎలా చెప్పగలుగుతున్నారో అనే సీన్ ఒకటి ఉంటుంది. చూస్తుంటే మీకు గూస్ బంప్స్ తో పాటు ఓ హై వస్తుంది. ఇక కేసు గెలిచిన తర్వాత విజయ్ మోహన్ ముఖాన్ని సారా తన చేతులతో తడిమి చూసే సీన్ కావొచ్చు. చివర్లో తన ముఖానికి ఉన్న స్కార్ఫ్ తీసి ధైర్యంగా బయటకు నడుచుకుంటే వచ్చే సీన్స్ కావొచ్చు. ఇలా బోలెడన్ని సన్నివేశాల మిమ్మ‍ల్ని విజిల్ వేసేలా చేస్తాయి.

ఎవరెవరు ఎలా చేశారు?
ఇందులో హీరోహీరోయిన్ అని ఎవరూ ఉండరు. నటించిన వాళ్లందరూ జస్ట్ పాత్రధారులంతే. మోహన్ లాల్ లాంటి స్టార్ ఉన్నప్పటికీ.. సారా పాత్రలో నటించిన అనస్వర రాజన్ ఆయన్ని డామినేట్ చేసేసింది. కళ్లు లేని అమ్మాయిగా అద్భుతమైన నటనతో చించి అవతల పడేసింది. సినిమా చూసిన తర్వాత మీరు కచ్చితంగా ఆమెతో ప్రేమలో పడిపోతారు. అంతా బాగుంది మరి. ఇక డిఫెన్స్ లాయర్స్‌గా నటించిన సిద్ధిఖ్, ప్రియమణి కూడా ఉన్నంతలో డీసెంట్‌గా చేశారు. మిగిలిన వాళ్లకు పెద్దగా చెప్పుకోదగ్గ సీన్స్ ఏం లేవు. చివరగా రైటప్ అండ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ గురించి చెప్పుకోవాలి. 'దృశ్యం' సినిమాలతో అందరికీ బుర్రతిరిగిపోయేలా చేసిన ఈ డైరెక్టర్.. ఇప్పుడు 'నెరు' మూవీతో కోర్టు రూమ్ డ్రామా సినిమాల్లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు.

చివరగా ఒక్కమాట.. మన పవర్ రీమేక్ స్టార్ ఈ సినిమాని రీమేక్ చేసి చెడగొట్టే ముందే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 'నెరు' చూసేయండి. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది

-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్

(ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్)

Rating:
Advertisement
Advertisement