Nayanthara: నయనతార 'నిళల్‌' మూవీ రివ్యూ

21 May, 2021 00:15 IST|Sakshi

రివ్యూ టైమ్‌

చిత్రం: ‘నిళల్‌’ (మలయాళం)
తారాగణం: నయనతార, కుంచాకో బోబన్‌;
సంగీతం: సూరజ్‌ ఎస్‌. కురూప్‌
కెమేరా: దీపక్‌ డి
ఎడిటింగ్‌: అప్పు ఎన్‌. భట్టాత్రి, అరుణ్‌ లాల్‌
దర్శకత్వం: అప్పు ఎన్‌. భట్టాత్రి
నిడివి: 124 నిమి
ఓటీటీ: అమెజాన్‌

దేశంలోని ఎక్కడెక్కడి వాళ్ళకూ ఇప్పుడు మలయాళం సుపరిచితం. కారణం.... కరోనా దెబ్బతో ఓటీటీలో మలయాళం సినిమాలు పెద్ద హల్‌చల్‌. లేటెస్ట్‌గా అమెజాన్‌లో స్ట్రీమ్‌ అవుతున్న మలయాళ చిత్రం – నయనతార ‘నిళల్‌’ (అంటే ‘నీడ’ అని అర్థం). మిస్టరీ థ్రిల్లర్‌ కోవకు చెందిన చిత్రమిది. కాకపోతే, ఇప్పటికే మంచి మలయాళ సినిమాలెన్నో చూశాక, ఈ మిస్టరీ వాటితో పోలిస్తే అంతగా ఆనుతుందా?
 
కథేమిటంటే..: ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ జాన్‌ బేబీ (కుంచాకో బోబన్‌). కారు ప్రమాదంలో గాయపడ్డ అతనికి లేని వర్షం పడుతోందన్న భ్రమ లాంటివి కలుగుతుంటాయి. ఇంతలో, చైల్డ్‌ సైకాలజిస్ట్‌ అయిన డాక్టర్‌ ఫ్రెండ్‌ షాలిని (దివ్య ప్రభ) ద్వారా ఎనిమిదేళ్ళ చిన్న స్కూలు పిల్లాడు నితిన్‌ గురించి తెలుస్తుంది. మర్డర్‌ స్టోరీలు చెప్పే ఆ కుర్రాడి గురించి, అతని తల్లి షర్మిల (నయనతార) గురించి హీరో ఆరా తీస్తాడు. చూడడానికి మామూలుగా ఉండే ఆ కుర్రాడు కథలో చెప్పే ప్రాంతాలకు వెళితే, నిజంగానే అక్కడ అస్తిపంజరం బయటపడుతుంది. పిల్లాడు చెబుతున్న కథలు ఒక్కొక్కటీ వాస్తవ మని తేలడంతో మిస్టరీ పెరుగు తుంది. దాన్నిఛేదించడానికి హీరో, ఆ పిల్లాడి తల్లి ఏం చేశారు? తండ్రి లేని ఆ పిల్లాడిని తల్లి అసలు ఎలా పెంచింది? ఆమె ఫ్లాష్‌బ్యాక్‌ ఏమిటి లాంటివి చివరలో ముడి వీడతాయి.

ఎలా చేశారంటే..: సగటు తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ సినిమాలో బాగా తెలిసిన ముఖం నయనతార ఒక్కరే! పిల్లాడి తల్లి పాత్రలో ఆమె చేయడానికి ఈ కథలో పెద్దగా ఏమీ కనపడదు. కథలో తొలిసారి కనిపించే లాంటి కొన్నిచోట్ల మేకప్‌ కూడా ఎక్కువవడంతో నయనతార స్క్రీన్‌ ప్రెజెన్స్‌ కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక, కథానాయకుడైన మేజిస్ట్రేట్‌ పాత్రలో కుంచాకో బోబన్‌ ఫరవాలేదనిపిస్తారు. కేరళలోని తొలి స్టూడియో అయిన ‘ఉదయ’ ఓనర్ల కుటుంబానికి చెందిన అతను ఒకప్పుడు బాల నటుడు. ఇప్పుడు పలు చిత్రాల హీరో, నిర్మాత, వ్యాపారవేత్త. లేటెస్ట్‌ మలయాళ థ్రిల్లర్‌ ‘నాయట్టు’ (వేట)లోనూ ఇతనే హీరో. సినిమా చివరలో మలయాళ దర్శక, నటుడు లాల్‌ కాసేపు కనిపిస్తారు.

ఎలా తీశారంటే..: మొదట కాసేపు బాగా నిదానించినా, అరగంట తర్వాత కథలోని మిస్టరీ ఎలిమెంట్‌ ప్రేక్షకులను కూర్చోబెడుతుంది. కాకపోతే, ఆ ఆసక్తిని కొనసాగించడంలోనే దర్శక, రచయితలు విఫలమయ్యారు. ఎంచుకున్న ఇతివృత్తం బాగున్నా, దాన్ని ఆసక్తిగా చెప్పడంలోనే ఇబ్బంది పడ్డారు దర్శకుడు. ప్రాథమికంగా ఎడిటరైన ఆయనకు దర్శకుడిగా ఇదే తొలి సినిమా. హీరో లవ్‌ ఫెయిల్యూర్‌ స్టోరీ, హీరోయిన్‌ చిన్నప్పటి కష్టాలు, క్లైమాక్స్‌లో వచ్చే అసలు కథ – ఇలా బోలెడు అంశాలున్నాయి కానీ, అన్నిటినీ కలిపి కథగా చెప్పలేకపోయారు. కథారంభంలో వేసుకున్న ముడులు సంతృప్తి కలిగేలా విప్పలేదనిపిస్తుంది.

కేరళలోని అందమైన లొకేషన్లతో పాటు కర్ణాటక హొగెనెకల్‌ జలపాతం దాకా సినిమా తిరుగుతుంది. అయితే సీన్లకు సీన్లు జరుగుతున్నా కథ ముందుకు నడిచేది తక్కువ. పైగా పాత్రలూ ఎక్కువే. కథ కన్నా కెమేరా వర్క్, ఆర్‌.ఆర్‌. మీద ఎక్కువ ఆధారపడ్డారా అని అనుమానం కలుగుతుంది. సినిమాలోని రెండు పాటలూ లేకున్నా ఫరవాలేదు. వర్షం పడడం లాంటి అతని భ్రమలకు కారణం ఏమిటన్నది సినిమా చివరి దాకా చూసినా అర్థం కాదు. నయనతార పాత్ర, ఆ పాత్ర ప్రవర్తన కూడా ఓ పట్టాన అంతుచిక్కదు. పిల్లాడి కథకూ, తన కథకూ ఏదో ముడి ఉందని భావించిన హీరో దానికి ముగింపు చెప్పలేదు.

అతీంద్రియ శక్తుల కథ అనే ఫీల్‌ ఇచ్చి, ఆఖరుకు తుస్సుమనిపించారు. వెరసి, మలయాళ సిన్మా కదా అని... నయనతారపై ఆశలు పెట్టుకొని ఈ ‘నిళల్‌’ చూస్తే, ఆశాభంగం తప్పదు. అటు నయనతార, ఇటు సినిమా – ఎవరూ మెప్పించరు. ఇంగ్లీష్‌ సబ్‌ టైటిల్సున్న ఈ సినిమా... లాక్‌డౌన్‌ టైమ్‌లో మరీ... ఖాళీగా ఉంటే చూడవచ్చు. లేదంటే, స్కిప్‌ చేసినా మీరేమీ మిస్‌ కారు.

బలాలు: సస్పెన్స్‌ కథాంశం, నయనతార స్టార్‌ వ్యాల్యూ

బలహీనతలు: స్లో నేరేషన్‌, నీరసింపజేసే క్లైమాక్స్‌, కథను మించి రీరికార్డింగ్‌ హంగామా, కథన, దర్శకత్వ లోపాలు

కొసమెరుపు: స్టార్లు ఉన్నంత మాత్రాన... సినిమాలు బాగుండవు!  

– రెంటాల జయదేవ

మరిన్ని వార్తలు