సినిమా తీయాలంటే చాలా ధైర్యం కావాలి: నిర్మాత బన్నీ వాసు

23 May, 2022 05:53 IST|Sakshi
కరుణాకరన్, శ్రీకాంత్‌ అయ్యంగార్, బన్నీ వాసు, ఇంద్రగంటి

‘‘కరోనా తర్వాత సమీకరణాలు మారిపోయాయి. ప్రతి ఒక్కరూ జీరో నుంచి మళ్లీ నేర్చుకోవాలి. ఈ రోజుల్లో ఒక సినిమా తీయాలంటే చాలా ధైర్యం కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ఒక సినిమా మొదలు పెట్టడం గొప్ప విషయం’’ అని నిర్మాత బన్నీ వాసు అన్నారు. నటుడు శ్రీకాంత్‌ అయ్యంగార్‌ నిర్మాతగా మారారు. ఆయన నిర్మిస్తున్న తొలి చిత్రానికి ‘యానం’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. షేక్స్‌పియర్‌ రచనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కరుణాకర న్‌ దర్శకుడు.

కేఎస్‌ఐ సినిమా అన్‌ లిమిటెడ్‌ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ బ్యానర్‌ లోగోను బన్నీ వాసు, ‘యానం’ టైటిల్‌ లోగోను దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ విడుదల చేశారు. శ్రీకాంత్‌ అయ్యంగార్‌ మాట్లాడుతూ–‘‘నేను దర్శకత్వం వహించిన నాటకాలు, యాడ్‌ఫిల్మ్స్‌కు కరుణాకరన్‌ వర్క్‌ చేశాడు. ‘యానం’ తో దర్శకునిగా తను మంచి పేరు తెచ్చుకోవాలి’’ అన్నారు. ‘‘శ్రీకాంత్‌గారు తొలిసారి నిర్మిస్తున్న ‘యానం’ మంచి విజయం సాధించాలి’’ అన్నారు ఇంద్రగంటి మోహనకృష్ణ. ‘‘దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన శ్రీకాంత్‌ అన్నకి థ్యాంక్స్‌’’ అన్నారు కరుణాకరన్‌.

మరిన్ని వార్తలు