శ్రీదేవి మరణంపై సంచలన ఆరోపణలు.. చిక్కుల్లో ప్రముఖ యూట్యూబర్! | Sakshi
Sakshi News home page

Sridevi death: శ్రీదేవి మరణంపై సంచలన వీడియోలు.. యూట్యూబర్‌పై సీబీఐ ఛార్జ్‌షీట్!

Published Mon, Feb 5 2024 4:30 PM

YouTuber forged documents to back sensational claims on Sridevi death - Sakshi

అందాల తార, తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి శ్రీదేవి. కానీ ఉహించని విధంగా దుబాయ్‌లోని ఓ హోటల్‌లో కన్నుమూసింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న తుదిశ్వాస విడిచింది.బాలీవుడ్ నిర్మాత బోనీ కపూప్‌ పెళ్లాడిన శ్రీదేవికి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. పెద్దకూతురు జాన్వీ కపూర్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవరలో కనిపించనుంది. మరోవైపు చిన్నకూతురు ఖుషీ కపూర్ సైతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. 

అయితే శ్రీదేవి మరణంపై ఒడిశాకు చెందిన ప్రముఖ యూట్యూబర్‌ సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఆమె మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సహా పలువురు ప్రముఖుల పేర్లతో నకిలీ లేఖలను యూట్యూబ్‌లో ఉంచింది.  శ్రీదేవి మరణంపై విచారణను రెండు ప్రభుత్వాలు దాచిపెడుతున్నాయంటూ గతంలో తీవ్ర ఆరోపణలు చేసింది.

దీంతో ఆమెపై గతేడాది ముంబైకి చెందిన న్యాయవాది చాందినీ షా సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఆమె యూట్యూబ్‌ వీడియోలో ఉంచిన పత్రాలు నకిలీవని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా  శ్రీదేవి మరణానికి స్పాన్సర్‌గా ప్రభుత్వాన్ని కించపరిచేలా పదేపదే మాట్లాడిందని ఆరోపించారు.  ప్రధానమంత్రి, రక్షణ మంత్రి లేఖలతో పాటు సుప్రీంకోర్టుకు సంబంధించిన పత్రాలు, యూఏఈ ప్రభుత్వం నుంచి వచ్చిన రికార్డులు నకిలీవని తేలిందని న్యాయవాది ఫిర్యాదులో ప్రస్తావించారు.

ఆయన ఫిర్యాదుతో యూట్యూబర్‌ దీప్తితో  ఆమె లాయర్ భరత్ సురేశ్ కామత్‌లపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మొత్తానికి శ్రీదేవి మరణంపై సంచలన ఆరోపణలు చేసి ఇబ్బందుల్లో ఇబ్బందుల్లో పడ్డారు యూట్యూబర్.

తాజాగా సీబీఐ ఛార్జిషీట్‌ వేయడంపై దీప్తి స్పందించారు. ఆ ఛార్జ్‌ షీట్ నమ్మేలా లేదని దీప్తి ఆరోపించారు. నా స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయకుండా ఛార్జిషీట్ దాఖలు చేయడం చాలా ఆశ్చర్యంగా ఉందని ‍అన్నారు. కాగా.. గతేడాది డిసెంబర్ 2న భువనేశ్వర్‌లోని ఆమె నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుంది. శ్రీదేవి మరణంతో పాటు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణంపై సంచలన కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో జరిగిన చర్చల్లోనూ దీప్తి చురుకుగా పాల్గొంది. 

Advertisement
Advertisement