ఉద్యమ పతాక.. ఆలేరు | Sakshi
Sakshi News home page

ఉద్యమ పతాక.. ఆలేరు

Published Fri, Oct 20 2023 2:02 AM

- - Sakshi

యాదాద్రి: నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాడంలో భూమి, భుక్తి, విముక్తి కోసం పోరు నడిపిన గడ్డ, మహిళా చైతన్యానికి ప్రతీక, మలిదశ తెలంగాణ ఉద్యమానికి దక్షిణ తెలంగాణలోనే పెట్టనికోట ఆలేరు. ఈ నియోజకవర్గం నిత్య చైతన్యంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు, కళలు, సాహిత్యం, సాంస్కృతిక, క్రీడా రంగాలకు నిలయం.

ఇక్కడి ఓటరు తీర్పు విలక్షణం. ఈ నియోజకవర్గంలో ఐదు సార్లు మహిళా ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఇక్కడి నుంచి మోత్కుపల్లి నర్సింహులు వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది.. పలుమార్లు మంత్రిగా పని చేశారు.

ఆలేరుకు ప్రత్యేక స్థానం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం కలిగి ఉంది. 1952లో ఏర్పాటైన నియోజకవర్గం జనరల్‌ కేటగిరీ నుంచి 1978లో ఎస్సీ రిజర్వ్‌డ్‌ చేయబడింది. 2009లో జనరల్‌ కేటగిరిలోకి మారింది.

నల్లగొండ, సిద్దిపేట, మేడ్చల్‌, జనగామ, సూర్యాపేట, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ నియోజకవర్గంలో ఆలేరు, యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లి, మోటకొండూరు, బొమ్మలరామారం, గుండాల, ఆత్మకూర్‌(ఎం) మండలాలు ఉన్నాయి. భౌగౌళికంగానూ.. ఓటర్ల సంఖ్యా పరంగా ఆలేరు అతిపెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 2,27,738 మంది ఓటర్లు ఉన్నారు.

వీరిలో 1,14,388 మంది పురుషులు, 1,13,332 మంది మహిళలు, 18 మంది ఇతరులు ఉన్నారు. 1952 నుంచి 2018 వరకు 16 సార్లు జరిగిన ఎన్నికల్లో పీడీఎఫ్‌ రెండు సార్లు, కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ ఐ ఐదు సార్లు, టీడీపీ మూడుసార్లు, టీఆర్‌ఎస్‌ నాలుగు సార్లు, ఇండిపెండెంట్‌ ఒకసారి గెలుపొందారు.

పాడి పంటలకు నెలవు
పాడి పంటలకు నెలవు ఆలేరు. ఇక్కడి రైతులు సాగర్‌ ఆయకట్టు సమానంగా ధాన్యం పండిస్తారు. పత్తి కూడా అధికంగా పండుతుంది. దేవా దుల, బునాదిగాని కాల్వలతోపాటు బోరు బావులపై ఆధారపడి పంటలు సాగు చేస్తారు. పాడి పరిశ్రమ, నేత, గీత వృత్తులు ప్రధానం. ఇక్కడి నుంచి పనుల కోసం హైదరాబాద్‌ వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన గంధమల్ల రిజర్వాయర్‌ పూర్తయితే సాగునీటికి ఢోకా ఉండదు.

ఎమ్మెల్యేలుగా ఆరుట్ల దంపతులు
ఆలేరు ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆరుట్ల దంపతులు ముందుండి నడిపించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈ దంపతులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆరుట్ల కమలాదేవి ఆలేరు నుంచి మూడుసార్లు వరుసగా గెలపొందారు. ఈమె భర్త ఆరుట్ల రామచంద్రారెడ్డి మెదక్‌ జిల్లా రామాయంపేట, భువనగిరి నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

వరుస విజయాల మోత్కుపల్లి..
మోత్కుపల్లి నర్సింహులు ఆలేరు నియోజకవర్గంలో వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలుగుదేశం ఆవిర్భావంతో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో గనులు, భూగర్భ జలవనరులు, సాంఘిక సంక్షేమ, విద్యుత్‌, పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. టీడీపీ నుంచి మూడుసార్లు ఇండిపెండెంట్‌గా ఒకసారి, కాంగ్రెస్‌ నుంచి ఒకసారి విజయం సాధించారు.

ఆలయాలకు నిలయం..
ఆలేరు నియోజకవర్గానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. చారిత్రక ఆలయాల సంపద, తెలంగాణ సాయుధపోరాట నేపథ్యం ఉంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం, కొలనుపాక జైన దేవాలయం, శ్రీసోమేశ్వరాలయం ఇక్కడి ప్రత్యేకత.

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఈ నియోజకవర్గంలోనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం రూ.1200 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులు చేపట్టింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆలయంగా తీర్చిదిద్దింది. తెలంగాణ సాయుధపోరాట సేనానులు ఆరుట్ల కమలాదేవి, రామచంద్రారెడ్డి దంపతులు, రేణికుంట రామిరెడ్డి, కుర్రారం రామిరెడ్డి వంటి వీరులగన్న భూమి ఆలేరు. శాసనసభలో తొలి మహిళా ప్రతిపక్ష నేత ఆరుట్ల కమలాదేవి ఇక్కడివారే కావడం గమనార్హం.

Advertisement
Advertisement