ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌  | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ 

Published Wed, Apr 3 2024 3:58 AM

10 Naxals Killed In Massive Encounter At Chhattisgarh Bijapur - Sakshi

చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్‌ జిల్లాలో మంగళవారం పోలీసుల బలగాలు, మావోల నడుమ జరిగిన ఎదురుకాల్పుల్లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు. గంగులూరు పోలీస్‌స్టేషన్‌ పరిధి కొర్చోలి, లేంద్ర గ్రామాల సమీపాన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారనే నిఘా వర్గాల సమాచారంతో సోమవారం రాత్రి జిల్లా రిజర్వ్‌ గార్డ్, సీఆర్‌పీఎఫ్, కోబ్రా కమాండో , బస్తర్‌ ఫైటర్స్, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం కొర్చేలి, లేంద్ర మధ్య అటవీ ప్రాంతంలో బలగాలకు మావోయిస్టులు తారసపడి కాల్పులు 

పది మంది మావోయిస్టుల మృతి మొదలుపెట్టారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. సుమారు రెండు గంటల పాటు హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. దీంతో మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేస్తుండగా 11 గంటల సమయాన మళ్లీ వారికి మావోలు తారసపడి కాల్పులకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో మరో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మొత్తంగా పది మంది మావోయిస్టులు మృతి చెందారని, ఇందులో ఒక మహిళ ఉన్నారని బస్తర్‌ రేంజ్‌ ఐజీ పి.సుందర్‌ రాజు వెల్లడించారు.

మృతులు మావోల పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ రెండో కంపెనీ సభ్యులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పుల ఘటనలో సుమారు 30 మంది మావోలు పాల్గొని ఉంటారని భావిస్తున్నారు. పలువురు గాయాల పాలై తప్పించుకున్నట్లు భావించి పోలీసులు కూంబింగ్‌ ముమ్మరం చేశారు. ఘటనాస్థలి నుంచి పెద్ద మొత్తంలో లైట్‌ మెషీన్‌ గన్స్, ఏకే 47 తుపాకులు, బ్యారెల్‌ గ్రనేడ్‌ లాంచర్లు, మందుపాతరలు, పేలుడు పదార్థాలు స్వా«దీనం చేసుకున్నట్లు ఐజీ తెలిపారు.

మధ్యప్రదేశ్‌లో మరో ఇద్దరు
బాలాఘాట్‌: మధ్యప్రదేశ్‌లోని బాలా ఘాట్‌ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఘటనలో ఇద్దరు కరడుగట్టిన మావోయిస్టులు మృతి చెందారు. వారిని సాజంతి అలియాస్‌ క్రాంతి(38), రఘు అలియాస్‌ షేర్‌ సింగ్‌(52)గా గుర్తించారు. ఘటనా స్థలిలో ఆయుధాలు దొరికాయి. సాజంతిపై రూ.29 లక్షలు, రఘుపై రూ.14 లక్షల రివార్డులున్నాయి.

Advertisement
Advertisement