కిలో టమాట రూ.200.. ఈ ఆటోవాలా ఆఫర్‌ చూడండి.. ఫ్రీ ఇస్తాడట!

21 Jul, 2023 21:01 IST|Sakshi

దేశంలో ఇటీవల టమాటా సృష్టిస్తున్న లీలలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడ చూసిన టమాటా గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే టమాటా ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయి. కిలో టమాటా ధర రూ.200కు పైగా అమ్ముడు పోయాయి. టమాటా ధరలు ఆకాశాన్నింటి.. కొందరు రైతులను కోటీశ్వరులను చేశాయి. టమాటా ఉచిత పథకాల ద్వారా మరికొందరు తమ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకుని లాభాల బాట పట్టారు.

ఆటోవాలా సరికొత్త ఆఫర్..
వినియోగదారులు టమాటాలు కొనడానికి సంశయిస్తున్న సమయంలో చంఢీగర్‌కు చెందిన ఓ ఆటో డ్రైవర్ కొత్త ఆఫర్‌తో ముందుకొచ్చాడు. తన ఆటోలో ప్రయాణించినవారికి కేజీ టమాటాలు ఉచితంగా ఇస్తానని ఉచిత పథకాన్ని పెట్టాడు. కానీ అందుకు సదరు ప్రయాణికుడు కనీసం ఐదు రైడ్లు చేయాలని కండీషన్ పెట్టాడు.

ఇదీ కాకుండా ఆర్మీలో పనిచేసే సైనికులకు ఆయన గత 12 ఏళ్లుగా ఉచితంగా సేవలు అందిస్తాడు. గర్భణీ మహిళలను కూడా ఉచితంగా ఆస్పత్రికి తరలిస్తాడు. తన జీవనోపాధికి ఆటో మాత్రమే ఏకైక మార్గమని తెలిపిన ఆయన.. ఈ సేవల వల్ల తనకు సంతృప్తి కలుగుతుందని అన్నారు. ఇదే కాకుండా పాకిస్థాన్‌పై ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలిస్తే ఐదు రోజుల పాటు ఉచితంగా ఆటో రైడ్‌లు అందిస్తానని చెప్పాడు.

ఉచిత ప్రకటనలు..
ఆటోవాలానే మొట్టమొదటి వ్యక్తి కాదు. టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో ఇలాంటి ఆఫర్‌లతో పలువురు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పంజాబ్‌లో ఓ చెప్పుల దుకాణం యజమాని రూ.1000కి పైగా కొనుగోలు చేస్తే రెండు కిలోల టమాటాలు ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటన చేశాడు.  తన దుకాణంలో మొబైల్‌ కొనుగోలు చేస్తే కేజీ టమాటాలు ఉచితం అంటూ మరోచోట ఓ యజమాని ఆఫర్ పెట్టాడు. తాజాగా ఆటో డ్రైవర్ తన ఆటోలో ప్రయాణిస్తే టమాటాలు ఉచితం అంటూ కొత్త ఆఫర్‌తో ముందుకొచ్చాడు. 

టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఢిల్లీ, పట‍్నా, లక్నో సహా పలు ముఖ్య నగరాల్లో రూ.80 కే కేజీ టమాటా లభ్యమయ్యేలా చర్యలు చేపట్టింది.
ఇదీ చదవండి: సీఎం నివాసంలోకి చొరబాటుకు దుండగుడి యత్నం.. మారణాయుధాలతో..

>
మరిన్ని వార్తలు