ట్రాఫిక్‌తో ఏటా బెంగళూరుకు రూ.20 వేల కోట్ల నష్టం | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌తో ఏటా బెంగళూరుకు రూ.20 వేల కోట్ల నష్టం

Published Tue, Aug 8 2023 5:34 AM

Bengaluru economy suffers Rs 20,000 crore loss due to traffic woes - Sakshi

బెంగళూరు: తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్యల కారణంగా బెంగళూరు నగరం ఏటా రూ.20 వేల కోట్ల మేర నష్టపోతోందని ఓ అధ్యయనంలో తేలింది. ‘నగర ఉత్పాదకత, ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా ఉత్పాదకత గణనీయంగా తగ్గి, చిన్న, మధ్య తరహా సంస్థల రవాణా అవసరాలు ఆలస్యమవుతున్నాయి. ఇందుకు కాలుష్య సమస్య కూడా తోడవుతోంది’అని ఆ అధ్యయనం తెలిపింది.చాలా ఏళ్లుగా బెంగళూరు నగరం తీవ్ర ట్రాఫిక్‌ సమస్యతో సతమతమవుతోంది.

నగర ప్రణాళిక, మౌలిక సదుపాయాలు సరిగ్గానే ఉన్నప్పటికీ నష్టాలను చవిచూస్తోందని ట్రాఫిక్‌ నిపుణుడొకరు చేపట్టిన ఈ అధ్యయనం పేర్కొంది. ట్రాఫిక్‌ జామ్‌ సమస్య కారణంగా ఎక్కువగా నష్టపోయేది బెంగళూరుకు ఆర్థిక దన్నుగా నిలుస్తున్న ఐటీ రంగమేనని తేల్చింది. ఉద్యోగులు తమ విలువైన సమయాన్ని ట్రాఫిక్‌ సమస్యలతోనే గడుపుతున్నారని కూడా వివరించింది. ట్రాఫిక్‌ సంబంధ కారణంగా ఒక్క ఐటీ రంగమే సుమారు రూ.7 వేల కోట్ల మేర ఏటా నష్టపోతోందని తెలిపింది. పౌరులు కూడా నాణ్యమైన జీవితాన్ని గడపలేకపోతున్నారని పేర్కొంది.

అధ్యయనంలో భాగంగా రోడ్‌ ప్లానింగ్, ఫ్లై ఓవర్లు, ట్రాఫిక్‌ నిర్వహణ, మౌలిక సదుపా యాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు నిపుణులు పలు సూచనలు చేశారు. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, కొన్ని ప్రాంతాల్లో ప్రయాణించేందుకు ఎక్కువ చార్జీలు వసూలు చేయడం(కంజెషన్‌ ప్రైసింగ్‌), కార్‌పూలింగ్‌ వంటివి ఇందులో ఉన్నాయి. కెమెరాలు, సెన్సార్‌ వ్యవస్థలను నెలకొల్పి, ఎక్కువ మంది ట్రాఫిక్‌ సిబ్బందిని నియమించి నిబంధనలను అమలు చేయడం, మెట్రోలు, ప్రభుత్వ బస్సు సర్వీసులు నడిపేందుకు భూగర్భమార్గాల ఏర్పాటు కూడా ఇందులో ఉన్నాయి. ప్రభుత్వం, పౌర సంస్థలు, పౌరులు కలిసి కట్టుగా పనిచేసి రహదారులపై భారం తగ్గించొచ్చని  తెలిపింది.

Advertisement
Advertisement