మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

2 Jan, 2024 17:08 IST|Sakshi

ఇంఫాల్: మణిపూర్‌లో ముష్కరులు జరిపిన దాడిలో గాయపడిన భద్రతా బలగాలను సీఎం బీరేన్ సింగ్ పరామర్శించారు. దాడిలో మయన్మార్‌కు చెందిన కిరాయి సైనికులు పాల్గొన్నట్లు సమాచారం ఉందని చెప్పారు. దుండగులు ఆధునిక ఆయుధాలను ఉపయోగించినట్లు వెల్లడించారు. ముష్కరులను పట్టుకునేందుకు కూంబింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మణిపూర్‌లో వరుసగా రెండోరోజు ఉగ్రమూకలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. మోరే పట్టణంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు మంగళవారం ఆకస్మికదాడి జరిపారు. ఈ ఘటనలో నలుగులు పోలీసులు ఒక బీఎస్‌ఎఫ్ జవాన్ గాయపడ్డారు. అంతకుముందు తౌబల్‌ జిల్లా లిలాంగ్‌ చింగ్‌జావో ప్రాంతంలో దుండగులు సోమవారం కాల్పులు జరపగా.. నలుగురు పౌరులు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తౌబల్‌తోపాటు ఇంఫాల్‌ ఈస్ట్, ఇంఫాల్‌ వెస్ట్, కాక్చింగ్, బిష్ణుపూర్‌ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు.   

మణిపూర్‌లో గత ఏడాది మే 3వ తేదీన ట్రైబల్‌ సాలిడారిటీ మార్చ్‌ అనంతరం కొనసాగుతున్న జాతుల మధ్య వైరంతో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మణిపూర్‌ జనాభాలో 53 శాతం మంది మొయితీలున్నారు. కొండ ప్రాంత జిల్లాల్లో నివసించే నాగాలు, కుకీలు కలిపి 40 శాతం వరకు  ఉంటారు.

ఇదీ చదవండి: ట్రక్కు డ్రైవర్ల ఆందోళనపై స్పందించిన కేంద్రం


 

>
మరిన్ని వార్తలు