Sakshi News home page

బెంగళూరులో పెరిగిన సహజీవనం కల్చర్‌.. బాధితులంతా వారే

Published Thu, Nov 3 2022 8:21 AM

Live in Relationships breaking up at a rapid rate in Bengaluru - Sakshi

►ఓ అబ్బాయి, అమ్మాయి ఒకే కంపెనీలో పనిచేస్తారు. పరిచయం పెరిగి సహజీవనం వరకూ వచ్చింది. అతన్నే పెళ్లి చేసుకుందామని యువతి అనుకుంది. కానీ ఇంట్లో మంచి సంబంధాన్ని చూశారని, వారు చెప్పినట్లే చేస్తానని అబ్బాయి చెప్పడంతో ఆమె హతాశురాలైంది. ఇప్పుడు న్యాయం కావాలని అర్థిస్తోంది.  
►ఆన్‌లైన్లో పరిచయమైన ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులు ఓ ఫ్లాటులో కాపురం స్టార్ట్‌ చేశారు. కొన్ని నెలలు పాటు బాగానే సాగింది. అయితే భాగస్వామి అనుమానిస్తూ వేధిస్తుండడంతో విసిగిపోయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  
►ఆధునిక జీవనశైలి కలిగిన సిలికాన్‌ సిటీలో ఇలాంటి కథలు ఎన్నో. ఆకు– ముల్లు సామెత మాదిరిగా చివరకు అతివలే బాధితులు అవుతున్నారు.  

సాక్షి, బెంగళూరు(బనశంకరి): ఉద్యాన నగరిలో లివింగ్‌ టుగెదర్‌ (సహజీవనం)తో అమాయక యువతులు, మహిళలు వంచనకు గురవుతున్న కేసులు తీవ్రతరమౌతున్నాయి. మోసపోయామంటూ రాష్ట్ర మహిళా కమిషన్‌లో ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి. అత్యాచారం, కుటుంబ దౌర్జన్యాలు, వరకట్న వేధింపులు, వివాహం చేసుకుంటామని నమ్మించి వంచనకు పాల్పడుతున్నట్లు బాధితులు ఫిర్యాదు చేయడం పెరిగింది. ఇటువంటి కేసులు ఎక్కువ మహిళా కమిషన్‌ వద్దకు చేరడం విశేషం.  

గతం నుంచి ఉన్నదే, ఇప్పుడు తీవ్రమైంది 
విద్యాలయాలు, ఆఫీసుల్లో పరిచయమై లివింగ్‌ టుగెదర్‌ నిర్ణయం తీసుకుని ఒకే ఇంట్లో పెళ్లి కాకుండానే జీవించడం బెంగళూరులో ఎప్పటినుంచో ఉన్న ధోరణే. దీనిపై గతంలో కూడా అనేక చర్చోపచర్చలు జరిగాయి. కానీ ఈ పాశ్చాత్య పెడ ధోరణి కొనసాగుతూనే ఉంది. కొత్తగా ఇప్పుడు గొడవలు పెరిగాయి. సహజీవనం చేపట్టి ఏడాది గడిచేలోపు గొడవలు పడి ఆడపిల్లలు న్యాయం చేయాలని మహిళా కమిషన్‌కు మొర పెట్టుకుంటున్నారు.  

భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దు  
లివింగ్‌ టుగెదర్‌ వ్యవస్థతో ఆడపిల్లలు తమ భవిష్యత్‌ నాశనం చేసుకుంటున్నారు. పిల్లల తల్లిదండ్రులు కూడా సాయం కోసం వస్తున్నారని మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు ప్రమీళానాయుడు తెలిపారు. విద్యార్థినులు, మహిళలు విధులు నిర్వహించే స్థలాల్లో ఇప్పటికే లివింగ్‌ టు గెదర్‌ మోసాల పట్ల జాగృతం చేసే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

మోసపోయి న్యాయం కోసం ఆశ్రయించే బదులు మోసపోకుండా జాగ్రత్త వహించాల్సి ఉంది. జీవితాన్ని నిర్మించుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని  సలహా ఇచ్చారు. నెలకు సుమారు 8 నుంచి 10 లివింగ్‌ టు గెదర్‌ గొడవల కేసులు వస్తున్నాయి. ఏడాది కాలంగా ఫిర్యాదులు రెట్టింపు అయినట్లు ఆమె చెప్పారు. ఈ పెడ ధోరణులకు నష్టపోయేది యువతులే కాబట్టి వారిని తల్లిదండ్రులు జాగృతం చేయాలని తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement