Sakshi News home page

షాజహాన్‌కు ‘మసాలా పిచ్చి’ ఎందుకు పట్టింది?

Published Thu, Aug 24 2023 9:20 AM

Mughal Emperor Shah Jahan Started Using Masala More in Food - Sakshi

మొఘల్ చక్రవర్తులు అటు యుద్ధమైదానాలు, ఇటు అంతఃపురాలపై ప్రత్యేక దృష్టి సారించేవారు. దీనితో పాటు ఆహార విభాగంలోనూ వివిధ రకాల ప్రయోగాలు చేసేవారు. బాబర్‌కు పాలనాకాలం తక్కువగా ఉండడంతో ప్రత్యేక ప్రయోగాలేవీ చేయలేకపోయాడని చరిత్రకారులు చెబుతుంటారు. అయితే హుమాయున్ తన పాలనాకాలంలో చాలావరకూ తడబడుతూనే ఉన్నాడంటారు. 

అయితే అక్బర్‌కు తన పాలనలో తగినంత సమయం దొరకడంతో వివిధ రంగాలలో అనేక ప్రయోగాలు చేశాడంటారు. అక్బర్ తర్వాత జహంగీర్ కాలంలో, నూర్జహాన్ వివిధ రకాల మద్యాలను ప్రత్యేక పద్ధతిలో తయారు చేయించేవారు. వీటన్నింటిమధ్యలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తీరు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. జహంగీర్, అక్బర్‌లతో పోలిస్తే షాజహాన్‌  భార్యకు అత్యంత విధేయుడిగా ఉన్నాడని చెబుతారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్‌కు సుగంధ ద్రవ్యాలపై మోజు ఎందుకు పెరిగిందనే దాని వెనుక ఆసక్తికర కథనం వినిపిస్తుంటుంది. 

షాజహాన్ హయాంలో ఢిల్లీలో ఇన్ఫెక్షియస్ ఫ్లూ(అంటువ్యాధి) వ్యాపించింది. ఈ నేపధ్యంలో ప్రజల ఆహారంలో పెను మార్పు వచ్చింది. ఫ్లూ ప్రభావాన్ని తగ్గించేందుకు నాటి చెఫ్‌లు, రాజ వైద్యులు కలిసి ఆహారంలో పలు రకాల ప్రయోగాలు చేశారు. శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, వ్యాధులతో పోరాడడంలో సహాయపడటానికి మసాలా దినుసులను వంటలలో విరివిగా ఉపయోగించసాగారు. 

ఫ్లూ లాంటి వ్యాధులతో పోరాటానికి సుగంధ ద్రవ్యాలను తగినంతగా ఉపయోగించాలని రాజ వైద్యుడు స్వయంగా షాజహాన్‌కు సూచించాడట. ఈ మేరకు షాజహాన్ తాను తీసుకునే ఆహారంలో ఎక్కువమోతాదులో మసాలాలు ఉండేలా ఆదేశాలు జారీచేసేవాడు. అది అతని ఆరోగ్యానికి తగినది కాకపోయినా దానినే అనుసరించేవాడట. షాజహాన్ ఎప్పుడూ యమునా నది నీరు తాగేందుకు ఇష్టపడేవాడు. మామిడిపండ్లన్నా షాజహాన్‌కు ఎంతో ఇష్టం. ప్రత్యేక తోటల నుంచి తాజా కూరగాయలు, నిమ్మ, దానిమ్మ, రేగు, పుచ్చకాయలను తెప్పించేవాడట. అంతే కాదు కొత్తిమీర, జీలకర్ర, పసుపు  మొదలైనవాటిని ఎక్కువగా వినియోగించాలని షాజహాన్‌ తన వంటవాళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవాడు. దీని వెనుక అతనికి ఆరోగ్యంపైగల శ్రద్ధనే ప్రధాన కారణమని చరిత్రకారులు చెబుతున్నారు. ఆహారంలో సుగంధ ద్రవ్యాలు ఉపయోగించకపోతే ఆరోగ్యం మెరుగ్గా ఉండదని షాజహాన్ నమ్మేవాడు. 
ఇది కూడా చదవండి: అంతరిక్షంలోకి దూసుకెళ్లే రాకెట్లు తెలుపు రంగులోనే   ఎందుకుంటాయి?

Advertisement

What’s your opinion

Advertisement