Sakshi News home page

ముఖ్తార్‌ అన్సారీపై విష ప్రయోగం?, జైల్లో ఆహారంలో 40 రోజులుగా..

Published Fri, Mar 29 2024 8:44 AM

Mukhtar Ansari Deceased: Family Alleges Poisoning In Jail we Will Go To Court - Sakshi

లక్నో: బాందా జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్, ఉత్తరప్రదేశ్‌ రాజకీయ నాయకుడు ముఖ్తార్‌ అన్సారీ (63) గురువారం కన్నుమూశారు. అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరిన ఆయనకు చికిత్స అందుతుండగానే.. గుండెపోటుకు గురై చనిపోయినట్లు దుర్గావతి మెడికల్‌ కాలేజీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. అయితే.. కుటుంబ సభ్యులు మాత్రం అన్సారీ మృతిపై సంచలన ఆరోపణలకు దిగారు. 

ముఖ్తార్‌  అన్సారీపై విషప్రయోగం జరిగిందని.. 2005 నుంచి బాందా జైలులో ఉన్న ఆయనపై విషప్రయోగం జరగడం ఇప్పుడు రెండోసారి ఆయన సోదరుడు, ఘాజీపూర్‌ ఎంపీ అఫ్జల్‌ అన్సారీ ఆరోపించారు. ‘జైలులో అన్సారీకి ఆహారంలో విషం కలిపి ఇచ్చారు. సుమారు 40 రోజుల పాటు ఆహారంలో విషం కలిపారు. మార్చి 19వ తేదీన ఆయన తిన్న ఆహారంలో విషం కలిసింది. అందుకే ఆయన ఆరోగ్యం ఆందోళనకంగా మారి ఆస్పత్రిలో చేరారు’ అని అఫ్జల్‌ అన్సారీ అంటున్నారు.

తన తండ్రికి స్లో పాయిజన్‌ ఇచ్చి చంపేశారంటూ ముఖ్తార్‌ కుమారుడు ఉమర్ ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై కోర్టును సంప్రదిస్తానని చెప్పారు. ‘ మా నాన్న(ముఖ్తార్‌)పై విష ప్రయోగం జరుగుతోందన్న విషయాన్ని మేము గతంలో కూడా చెప్పాం. ఇప్పుడూ కూడా అదే చెబుతు​న్నాం. మార్చి 19న మా నాన్న( ముఖ్తార్‌)కు రాత్రి భోజనంలో విషం కలిపారు. మేము ఈ విషయంలో కోర్టును సంప్రదిస్తాం. మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది’ అని ఉమర్‌ తెలిపారు. 

బందా జైలులో ఉ‍న్న ముఖ్తార్‌ అన్సారీ ఆరోగ్యం విషయమించటంతో ఆయన్ను మంగళవారం బాందాలోని దుర్గావతి మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు ఆయనపై విష ప్రయోగం జరిగిందా? అనేదానిపై వైద్యులు స్పందించలేదు. బందా మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో ఇవాళ ముఖ్తార్‌ అన్సారీ మృతదేహానికి శవపరీక్ష జరగనుంది. ఆపై ఈ ఆరోపణలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

గ్యాంగ్‌స్టర్‌ పొలిటీషియన్‌
యూపీలోని మౌకు చెందిన అన్సారీపై గ్యాంగ్‌స్టర్‌ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్సారీ 2005 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయనపై మొత్తం 61 కేసులు నమోదయ్యాయి. అందులో 15 హత్య కేసులు ఉన్నాయి. 1980ల్లో గ్యాంగ్‌ సభ్యుడిగా చేరిన అన్సారీ 1990ల్లో సొంతంగా గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మౌ, ఘాజీపుర్‌, వారణాసి ప్రాంతాల్లో ఈ గ్యాంగ్‌ దోపిడీలు, కిడ్నాపులకు పాల్పడేది. 2004లో అన్సారీ వద్ద మెషిన్‌ గన్‌ బయటపడడంతో పోలీసులు అప్పటి ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. భాజపా ఎమ్మెల్యే కృష్ణానంద్‌ రాయ్‌ హత్య కేసులో గతేడాది ఏప్రిల్‌లో కోర్టు ఆయనకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 1990లో నకిలీ తుపాకీ లైసెన్స్‌ కలిగి ఉన్నారన్న అభియోగాల నేపథ్యంలో ఈ నెల 13న కోర్టు జీవితఖైదు విధించింది. ఐదుసార్లు మౌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖ్తార్‌ రెండు సార్లు బీఎస్పీ తరఫున ఎన్నికయ్యారు. ఆయన మృతికి ఆ పార్టీ ఎక్స్‌(ట్విటర్‌)లో సంతాపం ప్రకటించింది.

అన్సారీ మృతితో యూపీ మొత్తంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించారు. బాందా, మౌ, ఘాజీపుర్‌, వారణాసి జిల్లాల్లో అదనపు పోలీసు బలగాలతో పాటు, సెంట్రల్‌ రిజర్వ్‌ బలగాలను మోహరించినట్లు యూపీ డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు.

ముఖ్తార్‌ అన్సారీ మృతిపై దర్యాప్తు జరగాలి: మాయావతి
జైలులో ముఖ్తార్‌ అన్సారీపై మృతిపై ఆయన కుటుంబం వ్యక్తం చేస్తున్న భయాలు, విష ప్రయోగానికి సంబంధించి ఆరోపణలపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని బీఎస్పీ చీఫ్‌ మాయావతి అన్నారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్‌’ వేదిక  స్పందించారు. ‘ ముఖ్తార్‌ మృతి దార్యప్తు జరగాలి. మృతికి సంబంధించిన వాస్తవాలు బయటకు రావాలి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు.  

Advertisement

What’s your opinion

Advertisement