గంగాపూర్‌ ఓటు... ఎటో? | Sakshi
Sakshi News home page

గంగాపూర్‌ ఓటు... ఎటో?

Published Wed, Nov 22 2023 12:14 AM

అవగాహన కల్పిస్తున్న అధికారులు(ఫైల్‌) - Sakshi

కడెం: కనీస సౌకర్యాలు లేక ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు కడెం మండలం మారుమూల ఉమ్మడి గంగాపూర్‌ వాసులు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా మా తలరాతలు మారడం లేదని, ఎన్నికలపుడు ఇచ్చే హామీలు హామీలుగానే మిగిలిపోతున్నాయని విసిగిపోయి, రాబోయే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఉట్నూర్‌ ఆర్డీవో, ఈఆర్వో జివాకర్‌రెడ్డి, నిర్మల్‌ ఆర్డీవో రత్నకళ్యాణి ఇటీవలే గ్రామంలో పర్యటించి ఎన్నికలను బహిష్కరించొద్దని, ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని గ్రామస్తులతో మాట్లాడి ఒప్పించారు. మరోవైపు గ్రామస్తులు తమ హామీలను నమ్మడం లేదని, మూడు పార్టీల నాయకులు గ్రామస్తులకు బాండ్‌ పేపర్‌ రాసిచ్చారు.

ఇవీ ప్రధాన సమస్యలు..
గ్రామానికి ప్రధాన సమస్య రోడ్డు, కడెం ప్రాజెక్ట్‌ బ్యాక్‌వాటర్‌లో వంతెన నిర్మాణం పూర్తి కావాలి, దీంతోపాటు ఎత్తిపోతల పథకం, గిరిజన ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయిస్తామని, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్ది భుక్యా జాన్సన్‌నాయక్‌, బీజేపీ అభ్యర్థి రాఽథోడ్‌ రమేశ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి వెడ్మ బొజ్జు బాండ్‌ పేపర్‌ రాసిచ్చారు.

ఓటు.. ఎటో?
ముగ్గురు అభ్యర్థులు సమస్యలు పరిష్కరిస్తామని బాండ్‌ రాసివ్వడంతో.. గంగాపూర్‌, రాణిగూడ, కొర్రతండా మూడు గ్రామ పంచాయతీల ఓటర్లు ఏటు వైపు మొగ్గు చూపుతారనేది కీలకంగా మారింది. రాణిగూడలో మొత్తం 494 ఓటర్లు ఉండగా ఇందులో 244 మంది పురుషులు, 250 మంది సీ్త్రలు ఉన్నారు. మొత్తం ఎస్టీ గోండ్‌ సామాజిక వర్గానికి చెందిన వారే, ఇక్కడ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు ఓట్లు పడే ఆవకాశం ఉంది.

ఇక గంగాపూర్‌ పంచాయతీలో మొత్తం 764 ఓటర్లు ఉన్నారు. ఇందులో 376 మంది పురుషులు, 388 మంది సీ్త్రలు ఉన్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌,కాంగ్రెస్‌, బీజేపీకి ఓట్లు పడే ఆవకాశం ఉంది. కొర్రతండా పంచాయతీలో మొత్తం 411 ఓటర్లు కాగా, 202 మంది పురుషులు, 209 మంది సీ్త్రలు ఉన్నారు. ఇక్కడ లంబాడ సామాజికవర్గానికి చెందిన వారే అధికం. ఇక్కడ బీఆర్‌ఎస్‌, బీజేపీకి ఓట్లు పడే అవకాశం ఉంది.

Advertisement
Advertisement