● చదువుకు దూరమవుతున్న విద్యార్థులు ● పునఃప్రారంభించని తెలంగాణ సర్కార్‌ ● ఆందోళనలో తల్లిదండ్రులు, విద్యార్థులు ● పాఠశాలలు తెరిపించాలని వేడుకోలు | Sakshi
Sakshi News home page

● చదువుకు దూరమవుతున్న విద్యార్థులు ● పునఃప్రారంభించని తెలంగాణ సర్కార్‌ ● ఆందోళనలో తల్లిదండ్రులు, విద్యార్థులు ● పాఠశాలలు తెరిపించాలని వేడుకోలు

Published Sun, Jan 7 2024 11:34 PM

వాడవన గ్రామంలో మూతబడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల - Sakshi

తానూరు: బడీడు పిల్లలంతా పాఠశాలలోనే ఉండాలి.. అని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. సంబంధిత అధికారుల పట్టింపులేని తనంతో రాష్ట్ర సరి హద్దు గ్రామాల్లోని పిల్లలు ఆ అదృష్టానికి నోచుకోలేకపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం తా నూరు మండలంలోని తెలంగాణ–మహారాష్ట్ర సరి హద్దులో గల ప్రభుత్వ పాఠశాలలు మూతపడడ మే. ఈ మండల పరిధిలోని కుప్టి, వాడవన గ్రామాలకు చెందిన పిల్లలు సరస్వతీ కటాక్షానికి దూరమవుతున్నారు. 2015–16 విద్యాసంవత్సరంలో ఇక్కడ మరాఠి పాఠశాలలుండేవి. కొంతమంది విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం కోసం తానూరులోని ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లారు. దీంతో ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గింది. దీనిని సాకుగా చూపిన అధికారులు కుప్టి, వాడవన గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఎత్తివేశారు.

మరాఠిలో ఉన్నత చదువులు లేకే..

కుప్టి, వాడవన గ్రామాలు మహారాష్ట్ర సరిహద్దులో ఉండడంతో దశాబ్దకాలంగా ఇక్కడ మరాఠి మీడియంలో విద్యాబోధన సాగుతోంది. స్థానికంగా మరాఠిలో ఉన్నత చదువులు అందుబాటులో లేక పేద విద్యార్థులు మధ్యలోనే చదువు మానేసి వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఆర్థింగా ఉన్న వారు మహారాష్ట్రలోని కళాశాలల్లో చేరి ఉన్నతవిద్య అభ్యసిస్తున్నారు. అనంతరం నివాస ధ్రువీకరణ పత్రాలు అందక ఉద్యోగాలకు దూరమవుతున్నారు. దీంతో తమ పిల్లలకు తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం చదువులు అవసరమని గుర్తించిన పలువురు తల్లిదండ్రులు మండల కేంద్రంలోని ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలలకు వారిని పంపుతున్నారు. దీంతో అధికారులు 2015–16 విద్యాసంవత్సరంలో కుప్టి, వాడవన పాఠశాలలను ఎత్తేశారు. ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులను వేరే ప్రాంతానికి పంపారు. దీంతో ఆయా గ్రామాల్లో పాఠశాలలు అందుబాటులో లేకుండా పోయాయి. తమ గ్రామాల్లోని పాఠశాలలు ప్రారంభించి తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలో బోధించాలని పోషకులు కోరుతున్నారు.

ఏడాదిగా ఇంగ్లిష్‌

మీడియంలో..

గత ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో 2022 విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్‌ మీడియం ప్రారంభించింది. కానీ, ఈ గ్రామాల్లో పాఠశాలలను తెరిపించలేదు. దీంతో కుప్టి గ్రామానికి చెందిన 30 మంది విద్యార్థులు మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్తున్నారు. వాడవన గ్రామానికి చెందిన విద్యార్థులు సమీపంలోని ఎల్వత్‌, ధర్మాబాద్‌లోని ప్రైవేట్‌ పాఠశాలలకు పోతున్నారు. ఎల్వత్‌ గ్రామంలో పాఠశాలకు భవనం లేక మహాలక్ష్మీ ఆలయంలో తరగతులు కొనసాగిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. కుప్టి గ్రామానికి బస్సు సౌకర్యం లేక చాలామంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. కుప్టి, వాడవన గ్రామాల్లో అధికారులు మూతబడిన పాఠశాలలు తిరిగి ప్రారంభించి ఇక్కడే ఇంగ్లిష్‌ మీడియంలో బోధిస్తే ఈ గ్రామాల విద్యార్థులు డ్రాపవుట్స్‌గా మారే దుస్థితి ఉండదు. విద్యార్థులకు దూరభారం తగ్గి సౌకర్యవంతంగా ఉంటుందని ఆయా గ్రామాల ప్రజలు, తల్లిదండ్రులు చెబుతున్నారు.

సీఎం ప్రకటనపై ఆశలు

గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలతో మూతబడిన ప్రభుత్వ పాఠశాలలను పునఃప్రారంభించాలని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అధికారులు ఈ గ్రామాల్లోని పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తే విద్యార్థుల డ్రాపవుట్‌ సంఖ్య తగ్గడంతో పాటు స్వగ్రామంలోనే నాణ్యమైన విద్య, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందుతుందని పోషకులు భావిస్తున్నారు.

ఇంగ్లిష్‌లో బోధించాలి

కుప్టి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యలేదని అధికా రులు పాఠశాల మూసే శారు. దీంతో పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. సమస్య చాలాసార్లు అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడైనా మా గ్రామంలో పాఠశాల ప్రారంభించి మా పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియంలో బోధించాలి. – సంగంవాడ్‌ సంతోష్‌, కుప్టి

సమస్య పరిష్కరించాలి

మా గ్రామంలోని పాఠశాల ను మూసివేశారు. దీంతో చదువుకోవడానికి తానూరులోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నాం. నిత్యం రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి అక్కడి నుంచి బస్సుకు వెళ్తున్నాం. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. అధికారులు మా గ్రామంలోనే పాఠశాల ప్రారంభించి సమస్య పరిష్కరించాలి. – శారద, నాలుగో తరగతి, కుప్టి

విద్యార్థులుంటే ప్రారంభిస్తాం

తానూరు మండలం కుప్టి, వాడవన గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సరిపడా లేక బడులు మూతబడిన మాట వాస్తవమే. గతేడాది నుంచి ప్రభుత్వం ఇంగ్లిష్‌ మీడియంలో బోధన ప్రారంభించింది. విద్యార్థుల సంఖ్య ఉంటే పాఠశాలలు తిరిగి ప్రారంభిస్తాం. వాడవన గ్రామంలోని విద్యార్థులను సమీపంలోని ఎల్వత్‌ పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. – ఎంఈవో, సుభాష్‌

కుప్టిలో ..
1/3

కుప్టిలో ..

2/3

3/3

Advertisement
Advertisement