నాట్లేస్తాం.. వరి నాట్లేస్తాం.. | Sakshi
Sakshi News home page

నాట్లేస్తాం.. వరి నాట్లేస్తాం..

Published Mon, Jan 15 2024 1:38 AM

చామన్‌పెల్లి సమీపంలో వరి నాటు వేస్తున్న కూలీలు - Sakshi

నిర్మల్: జిల్లాలో వ్యవసాయ మండలంగా పేరున్న లక్ష్మణచాందలో ఈ ఏడాది యాసంగి సీజన్‌ వరినాట్లు జోరందుకున్నాయి. కూలీలు దొరకకపోవడంతో రైతులు బిహార్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకువచ్చి నాట్లు వేయిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో రెండో పంట సమయంలో ఉపాధి లభించకపోవడంతో కూలీలు తెలంగాణకు వలస వస్తున్నారు. ఇక్కడ నాట్లు వేస్తూ ఉపాధి పొందుతున్నారు.

అన్నిపనులూ వారే..
బిహార్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు వరి నారు తీయడం, తీసిన నారును మడులలో పంచుకోవడం, మందు చల్లడం, నాటు వేయడం.. ఇలా అన్నిపనులూ వారే చేస్తున్నారు. ఉదయం 7 గంటలకే పొలం వద్దకు చేరుకున్న కూలీలు ముందుగా వరినారు తీస్తున్నారు. ఆతర్వాత ఎరువులు చల్లిన అనంతరం నాటు వేయడం ప్రారంభిస్తున్నారు. 12 మంది కలిసి ఒక గ్రూపుగా ఏర్పడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజుకు మూడు నుంచి నాలుగు ఎకరాల్లో వరి నాటు వేస్తున్నారు.

ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.4,500
మండలంలోని మునిపెల్లి, చామన్‌పెల్లి, లక్ష్మణచాంద, తదితర గ్రామాల్లో 12 మంది కలిసి గ్రూపుగా ఏర్పడిన కూలీలు ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.4,500ల చొప్పున తీసుకుని నాట్లు వేస్తున్నారు. ఒక్కో గ్రూపుకు రోజుకు రూ.16 వేల చొప్పున, ఒక్కో కూలీకి రోజుకు రూ.900 నుంచి రూ.వెయ్యి వరకు సంపాదిస్తున్నారు.

రోజుకు నాలుగెకరాల్లో..
12 మంది సభ్యులం కలిసి గ్రూపుగా ఏర్పడ్డాం. రోజుకు మూడు నుంచి నాలుగు ఎకరాల్లో వరినాట్లు వేస్తున్నాం. దీంతో రోజుకు కూలి రూ.900 నుంచి వెయ్యి వరకు సంపాదిస్తున్నాం.
– సికిందర్‌, కూలీ, బిహార్‌

Advertisement
Advertisement