Sakshi News home page

‘గృహలక్ష్మి’కి గుడ్‌బై.. చెప్పిన‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం! వాటి స్థానంలో..

Published Thu, Jan 4 2024 12:46 AM

- - Sakshi

నిజామాబాద్‌: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన గృహలక్ష్మి పథకానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం గుడ్‌బై చెప్పింది. పథకాన్ని రద్దు చేస్తూ జీవో జారీచేసింది. దీంతో ఎన్నికలకు ముందు జారీచేసిన ప్రొసీడింగ్‌లు రద్దయ్యాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో గృహలక్ష్మి ప్రొసీడింగ్‌ కాపీల చెత్తబుట్టలో పారవేయాల్సిందేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను గృహలక్ష్మి పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 3లక్షల సాయాన్ని అందించడానికి గత ప్రభుత్వం నిధులను కేటాయించింది.

ఒక్కో నియోజకవర్గంలో 3వేల ఇళ్ల నిర్మాణానికి సాయం అందించాలని నిర్ణయించారు. బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులే గ్రామాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి గుట్టుచప్పుడు కాకుండా ప్రొసీడింగ్‌ కాపీలను పంపిణీ చేశారు. ఈ కాపీలపై కలెక్టర్ల ఆదేశాలతో జారీ చేసినట్లు ఎంపీడీవోల హోదాను పేర్కొంటూ రాసి ఉంది. కానీ కాపీలపై ఏ అధికారి సంతకం లేకపోవడం గమనార్హం. జిల్లాలో 16,500ల మందికి ప్రొసీడింగ్‌ కాపీలను అందించారు. ఎన్నికల తేదీ ఖరారైన తర్వాత కూడా కాపీలను లబ్ధిదారులకు అందించారు.

అధికారుల సంతకాలు లేకపోవడంతో అవి చెల్లుబాటు కావని అప్పట్లోనే ప్రచారం జరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ. 5లక్షల చొప్పున సాయం అందిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన గత ప్రభు త్వం ప్రకటించిన గృహలక్ష్మి పథకం కంటే ఇందిరమ్మ ఇంటికే ఎక్కువ సాయం అందుతుంది. అందువల్ల గతంలోని ప్రొసీడింగ్‌ల ద్వారా సాయం పొందడం కంటే కొత్తగా ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం మంజూరు చేయించుకుని లబ్ధి పొందడం మంచిదనే భావన కలుగుతుంది. గృహలక్ష్మి పథకం కింద లబ్ధిదారులుగా ఎంపికై న వారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సాయం పొందడానికి మరోసారి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

ఇవి చ‌ద‌వండి: ట్రాఫిక్‌ చలాన్ల చెల్లింపులో నిర్లక్ష్యం

Advertisement

What’s your opinion

Advertisement