Sakshi News home page

ఆరోగ్యంతో పాటు ఆనందం

Published Tue, Dec 26 2023 1:08 AM

- - Sakshi

ఆరోగ్యం కోసం వెళితే మీకు ఆనందం బోనస్‌...ఇది ఇప్పుడు నగరంలోని న్యూట్రిషన్‌ సెంటర్లలో నయా ట్రెండ్‌. బరువు తగ్గడం కోసం మీరు న్యూట్రిషన్‌ సెంటర్‌కు వెళితే బరువు తగ్గి, దీర్ఘ వ్యాధుల నుంచి ఉపశమనం లభించి ఆరోగ్యం సిద్ధిస్తుంది. దీనితో పాటు బోనస్‌గా అక్కడ ఏర్పడే కొత్త కమ్యూనిటీలతో పరిచయాలు, బర్త్‌ డేలు ఇతర శుభకార్యాలు సెంటర్ల నిర్వాహకులు ఘనంగా జరుపుతారు. ఇళ్లలో కాకుండా ఈ సెంటర్లలోనే వేడుకలు జరుపుకోవడంతో మైక్రో ఫ్యామిలీలతో ఒంటరితనం ఫీలవుతున్న నగర ప్రజలకు ఈ కొత్త ట్రెండ్‌ సరికొత్త ఆనందాన్నిస్తోంది. దీంతో నగరంలో వీటికి నానాటికీ డిమాండ్‌ పెరుగుతోంది.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఎన్ని ప్రయత్నాలు చేసినా శరీరంలో అదనపు బరువు తగ్గడం లేదా..అయితే మా న్యూట్రిషన్‌ సెంటర్‌కు ఒక సారి విజిట్‌ చేయండి. మేమిచ్చే షేక్‌ తీసుకోండి నెల రోజుల్లో బరువు తగ్గడం ఖాయం.. అంటూ న్యూట్రిషన్స్‌ సెంటర్లు భరోసా ఇస్తూ శరీరంలోని అదనపు బరువును తగ్గించేస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారితో పాటుగా బరువు పెరగాలనుకునే వారు ఇప్పుడు ఈ విధమైన న్యూట్రిషన్స్‌ సెంటర్ల మెట్లు ఎక్కుతున్నారు. ఒక్క విజయవాడ నగరంలోనే ప్రస్తుతం సుమారు 150కు పైగా న్యూట్రిషన్స్‌ సెంటర్లు ఉండడం గమనార్హం. నిత్యం ఒక్కొక్క సెంటర్‌కు సుమారు 50 మందికి పైగా వెళుతున్నారు.

ప్రతి వారం బరువు చెకింగ్‌..
కరోనా వైరస్‌ పుణ్యమా అని మనం నిత్యం తీసుకునే ఆహార పదార్ధంలో ఏ పోషకాలు ఎంత ఉన్నాయి, శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే ఏమి తినాలి, ప్రోటీన్స్‌, విటమిన్స్‌పై అందరికీ కొంత అవగాహన వచ్చింది. న్యూట్రిషన్‌ సెంటర్‌కు వచ్చే వారందరికీ సెంటర్ల నిర్వాహకులు ఫాలోఅప్‌ చేస్తుంటారు. ఎంత పరిమాణంలో ఏమి ఆహారం తీసుకున్నారు, వ్యాయామం చేశారా లేదా అనే అంశాలను అడిగి తెలుసుకుని వారికి తగినట్లుగా సూచనలు చేస్తుండడం, ప్రతి వారం శరీరంలో బరువును చెక్‌ చేసి మరిన్ని సూచనలు చేయడంతో బరువు తగ్గుతున్నామని సెంటర్లకు వెళుతున్న వారు చెబుతున్నారు.

► న్యూటిషన్‌ సెంటర్‌కు వెళ్లగానే వివరాలు నమోదు చేసుకుని శరీరంలోని బరువుతో పాటుగా మజిల్, కొవ్వు శాతాన్ని పరీక్షిస్తారు.  కొవ్వు శాతం ఎంత  ఉండాలి..మన శరీరంలో ఎంత ఉంది అనే వాటి గురించి సెంటర్ల నిర్వాహకులు విపులంగా వివరిస్తారు.  ఆ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత షేక్‌ (జ్యూస్‌ మాదిరిగా ఉంటుంది) ఇస్తారు. ఇది తాగితే చాలు నెలకు 3 నుంచి 5 కేజీల  అదనపు బరువును (బరువు తగ్గాలనుకున్న వారి ప్రయత్నం, శరీర తత్వం, న్యూట్రిషన్‌ సెంటర్‌ వారు సూచించిన ఆహార నియమాలు పాటిస్తే ) తప్పకుండా తగ్గుతారని సెంటర్‌ నిర్వాహకులు చెబుతారు. శరీరంలోని అధిక బరువు తగ్గడంతో కొన్ని దీర్ఘ కాలిక వ్యాధులు కూడా తగ్గుతున్నాయని న్యూట్రిషన్‌ సెంటర్లకు వెళ్లి బరువు తగ్గిన వారు చెబుతున్నారు.  

కొత్త కమ్యూనిటీతో సరికొత్త ఆనందం
సంతోషమే సగం బలం అన్న పెద్దల నానుడి ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఈ న్యూట్రిషన్‌ సెంటర్లకు వచ్చే వారంతా ఒక కొత్త కమ్యూనిటీ మాదిరిగా ఏర్పడుతున్నారు. ఈ సెంటర్లకు వచ్చే వారి పెళ్లి, పుట్టిన రోజు వేడుకలను సెంటర్ల ఆవరణలోనే నిర్వాహకులు నిర్వహిస్తుంటారు. ఇవే కాకుండా పండుగల రోజున న్యూట్రిషన్‌ సెంటర్లను అందంగా ముస్తాబు చేసి, ప్రత్యేకంగా ఫన్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహిస్తారు. నెలలో ఒక రోజు కలర్స్‌ డే పేరుతో  ఒక రంగును నిర్ణయించి ఆ రోజు న్యూట్రిషన్‌ సెంటర్‌కు వచ్చే వారందరూ ఆ రంగు దుస్తులు ధరించి వస్తారు.

వారికి ఆటలు, పాటలు, నృత్యాలతో ఆ రోజంతా హుషారుగా గడుపుతున్నారు. ఇంట్లో ఒక్కరిద్దరితో ఉండే మైక్రో ఫ్యామిలీల కన్నా న్యూట్రిషన్‌ సెంటర్లల్లో అయితే పదుల సంఖ్యలో కొత్త స్నేహితులు ఉండటంతో చాలా మంది పండుగలు, పెళ్లి, పుట్టిన రోజు వేడుకలను న్యూట్రిషన్‌ సెంటర్లలోనే జరుపుకోవడానికి ఆసక్తి  చూపుతున్నారు. ఆరోగ్యం కోసం న్యూట్రిషన్‌ సెంటర్‌లో అడుగు పెడితే ఆరోగ్యంతో పాటు ఇటువంటి ఆనందాలు కూడా తోడవడంతో న్యూట్రిషన్‌ సెంటర్లకు డిమాండ్‌ పెరుగుతోంది.    

Advertisement

What’s your opinion

Advertisement