Sakshi News home page

ప్రభుత్వ స్థలాల్లో రాజకీయ ప్రకటనలు అనుమతించవద్దు

Published Thu, Mar 28 2024 1:45 AM

-

జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌

నరసరావుపేట: ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల మేరకు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వాణిజ్య స్థలాలతో పాటు కార్యాలయాల్లో కూడా ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టరులు, బ్యానర్లను అనుమతించ వద్దని జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా బుధవారం నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న అనంతరం అధికారులతో కలెక్టర్‌ మాట్లాడారు. ప్రస్తుతం జాతీయ, ప్రధాన రహదారుల పక్కనున్న హోర్డింగులు అన్ని రాజకీయ పార్టీలకు సమాన ప్రాతిపదికన కేటాయిచాలని, నూతన హోర్డింగులకు అనుమతులను ఏమాత్రం ఇవ్వొద్దన్నారు. ప్రైవేటు భవనాలపై వాల్‌ పెయింట్స్‌కు ఎటువంటి అనుమతి లేదని, ఇప్పటికే ఉన్నవాటిని వెంటనే చెరిపించాలని కోరారు. ప్రభుత్వ అనుమతితో ప్రైవేటు భవనాలపై ఇప్పటికే ఉన్న హోర్డింగులు, కటౌట్ల భద్రతను, నిర్మాణ స్థిరత్వాన్ని ఒకసారి పరిశీలించాలని, స్ట్రక్చర్‌లో ఏమాత్రం ధృడత్వం లేకపోయినా ప్రకటనలకు అనుమతించ వద్దన్నారు. ముందస్తు అనుమతితో ప్రైవేటు ప్రాంగణాల్లో సులువుగా తరలించగలిగే ఒక జెండాను, చిన్న బ్యానర్‌ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించాలని సూచించారు. అదే విధంగా సి–విజిల్‌ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం, ఎలక్షన్‌ సీజర్‌ మేనేజ్‌మెంట్‌ విధానాన్ని పటిష్టంగా అమలు పర్చాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగింపునకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫారం–7, వివరాలను సరిదిద్దేందుకు సంబంధించి పెండింగ్‌ ఉన్న ఫారం–8లను చట్టబద్ధమైన విధానంలో త్వరితగతంగా పరిష్కరించాలని కోరారు. ఎన్నికల నియమావళి అమల్లో ఎటువంటి అలసత్వానికి తావులేకుండా ఎవరికి నిర్దేశించిన విధులు వారి తప్పకుండా నిర్వర్తించాలని ఆదేశించారు.

Advertisement

What’s your opinion

Advertisement