జీవన నైపుణ్యాలు పెంపొందించుకోవాలి | Sakshi
Sakshi News home page

జీవన నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

Published Fri, Nov 10 2023 4:56 AM

 విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో
 - Sakshi

● జిల్లా విద్యాధికారి డి.మాధవి

గోదావరిఖనిటౌన్‌: స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థులు జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా విద్యాధికారి డి.మాధవి అన్నారు. స్థానిక శారదానగర్‌లోని శ్రీసరస్వతీ శిశుమందిర్‌ పాఠశాలలో ది భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జిల్లా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న తృతీయ సోపాన్‌ టెస్టింగ్‌ క్యాంపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో స్కౌట్స్‌ ప్రాముఖ్యం చాలా ఉందన్నారు. ఇది విద్యార్థులకు ఎంతగానో దోహదం చేస్తుందని తెలిపారు. అనంతరం టెంట్స్‌, కలర్‌ పార్టీ, ప్రథమ చికిత్స, వంట చేయడం వంటి పలు అంశాలను పరిశీలించారు. జిల్లా స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సెక్రటరీ సూర్యదేవర జ్యోతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్టేట్‌ ఆర్గనైజింగ్‌ కమిస్ట్‌ టి.ప్రమోదిని, ఎన్‌.భరతమాత, పి.సాయినిరంజన్‌, జె.రవీందర్‌, ఎ.సుందరి, పలు మండలాల పాఠశాల గైడ్స్‌, కెప్టెన్లు పాల్గొన్నారు.

నామినేషన్‌ ర్యాలీలో యువకుడి హంగామా

మంథని: మంథనిలో బహుజన సమాజ్‌ పార్టీ అభ్యర్థి చల్లా నారాయణరెడ్డి ఎన్నికల నామినేషన్‌ ర్యాలీలో గురువారం ఓ యువకుడు హంగామా చేశాడు. రెండు పదునైన కొడవళ్లను చేతపట్టుకొని చంపుతానంటూ మహిళలను బెదిరించాడు. దీంతో వారు భయంతో పరుగులు తీశారు. పోలీసులకు సమాచారమివ్వడంతో ఎస్సై కిరణ్‌ సదరు యువకున్ని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. కాటారం మండలానికి చెందిన యువకుడని ఎస్సై తెలిపారు.

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

సారంగాపూర్‌: అర్పపల్లి గ్రామంలో బుక్క రాజిరెడ్డి(53) అనే వ్యక్తి పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. సారంగాపూర్‌ ఎస్సై తిరుపతి కథనం ప్రకారం.. రాజిరెడ్డి చాలాకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వాడినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స కోసం జగిత్యాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పొస్టుమార్టం తరలించారు. మృతుడికి కుమార్తె, కొడుకున్నారు.

భోజనాల వద్ద తన్నుకున్న

బీఆర్‌ఎస్‌ నాయకులు

ధర్మపురి: మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ధర్మపురిలో నామినేషన్‌ వేయగా.. కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వారికోసం ఓ ఫంక్షన్‌లో హాల్‌లో భోజనాలు ఏర్పాటు చేశారు. వడ్డిస్తున్న సమయంలో కొందరు గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు బెంచీలు, కుర్చీలు ఎత్తేసుకున్నారు. దీంతో ఫంక్షన్‌ హాల్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

Advertisement
Advertisement