Sakshi News home page

బీజేపీ బీసీ సీఎం!

Published Fri, Oct 20 2023 3:28 AM

BJP focus on gathering support of BCs in Telangana assembly elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించే లక్ష్యంతో దూకుడు పెంచుతున్న బీజేపీ.. తాము గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్న నినాదంతో ఎన్నికల గోదాలో తలపడనుంది. తెలంగాణలో బీసీ ఎజెండాతో ముందుకు వెళ్లాలని.. అవసరమైతే బీజేపీ ఆనవాయితీని పక్కనపెట్టి, ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించాలని ఆ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇతర పార్టీల కంటే ఎక్కువగా.. కనీసం 40 సీట్లకు తగ్గకుండా బీసీ, ఎంబీసీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ జనాభాలో 54 శాతానికిపైగా బీసీలే ఉన్నారని.. వారికి భరోసా కల్పించడం ద్వారా మెజారిటీ ఓటర్లను ఆకర్షించి, ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించవచ్చని భావిస్తున్నట్టు వెల్లడించాయి. అంతేగాకుండా 19 ఎస్సీ, 12 ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా పార్టీ అభ్యర్థుల గెలుపునకు బీసీల ఓట్లు తోడ్పడతాయని ఆశిస్తున్నట్టు వివరించాయి. 

భారీ సభ వేదికగా ప్రకటన! 
పార్టీ తీసుకున్న బీసీ ఎజెండాను మరింత బలంగా తీసుకెళ్లేందుకు బీసీని సీఎం చేస్తామని భారీ సభ వేదికగా ప్రధాని మోదీ లేదా కేంద్రహోంమంత్రి అమిత్‌ షా ప్రకటించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ మేరకు నెలాఖరులోగా హైదరాబాద్‌లో భారీ స్థాయిలో నిర్వహించ తలపెట్టిన బీసీగర్జన సభలోగానీ, మరోచోట నిర్వహించే బహిరంగ సభలోగానీ దీనిపై ప్రకటన వెలువడవచ్చని అంటున్నాయి. ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించడం బీజేపీ సాంప్రదాయం కాదని.. దానిని పక్కనపెట్టి అయినా ఓ కీలకనేత పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నేతలు వెల్లడించారు.

రాష్ట్రంలో బీసీ వర్గాలను అధికారంలో భాగస్వాములను చేస్తామని.. రాష్ట్ర అభివృద్ధికి తీసుకునే కీలక నిర్ణయాల్లో వారి ప్రమేయం ఉండేలా చూస్తామని అగ్రనేతలు హామీ ఇవ్వనున్నారని తెలిపారు. పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర మంత్రివర్గంలోనూ బీసీలకు తగిన స్థాయిలో పదవులు ఇస్తామన్న భరోసా కల్పించనున్నట్టు వెల్లడించారు. అంతేగాకుండా ఇప్పటికే పార్టీలో బీసీలకు ప్రాధాన్యమిచ్చిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. బీసీలకు భరోసా కల్పించేలా పలు అంశాలను ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చాలని నిర్ణయించినట్టు నేతలు వివరించారు. 
 
రెడ్డి వర్గం ఫోకస్‌గా ఇంద్రసేనారెడ్డికి పదవి! 
బీసీ నినాదంతో ఇతర వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా రెడ్డి, ఇతర సామాజిక వర్గాలను దగ్గర చేసుకునేందుకూ బీజేపీ అధిష్టానం వ్యూహాలను అమలు చేస్తోంది. ఇప్పటికే కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చింది. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి మార్చాక ఆ బాధ్యతలను కిషన్‌రెడ్డికే అప్పగించింది. తాజాగా పార్టీ సీనియర్‌ నేత నల్లు ఇంద్రసేనారెడ్డికి గవర్నర్‌ పదవి కట్టబెట్టింది.

ఇదే సమయంలో బీసీ నేతలకు పార్టీలో కీలక పదవులు ఇవ్వడం ద్వారా రెడ్డి, బీసీ కాంబినేషన్‌లో ఎన్నికలకు వెళుతున్న సంకేతాలను పార్టీ ఎప్పుడో ఇచ్చిందని బీజేపీ నేతలు చెప్తున్నారు. బీసీలకు పెద్దపీట, సీఎంగా బీసీ అభ్యర్థికి అవకాశం అంశాలపై పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జులు, ముఖ్య నేతలు పలుమార్లు కసరత్తు చేశారని.. రెడ్డి సామాజికవర్గం సహా అందరు ముఖ్య నేతలు బీసీ ఎజెండాకు మద్దతు ఇచ్చారని అంటున్నారు. 
 
బీసీ కీలక నేతల్లో.. చాన్స్‌ ఎవరికి? 
ఇప్పటికే పార్టీలో బీసీ నేతలకు కీలక పదవులు అందాయని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కె.లక్ష్మణ్‌కు తొలుత ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారని.. ఆ తర్వాత పార్టీలో కీలక పదవులైన పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీల్లో సభ్యులుగా నియమించారని గుర్తు చేస్తున్నారు. బండి సంజయ్‌కు తొలుత రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశమిచ్చారని.. తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారని చెప్తున్నారు. ఇక బీసీ నేత, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ప్రాధాన్యతనివ్వడం, ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చేలా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన వచ్చిందని వివరిస్తున్నారు.

ఇటీవలే రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా కాసం వెంకటేశ్వర్లు యాదవ్‌ నియమితులయ్యారని పేర్కొంటున్నారు. మరోవైపు ఉద్యమకాలం నుంచీ బీఆర్‌ఎస్‌లో నంబర్‌ టూగా, తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలోనూ కీలకపాత్ర పోషించిన ఈటల రాజేందర్‌కు బీజేపీలో చేరాక ప్రాధాన్యం అందిందని, కీలక కమిటీల బాధ్యత అప్పగించారని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. బీసీ నేత అయిన ఈటల రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ బీసీ సెక్షన్లు, కులసంఘాల నేతలు, ముఖ్యులను కలుస్తూ బీజేపీకి సానుకూలత తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని వివరిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే.. ఈ నేతల్లో ఒకరు సీఎం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నాయి.   

Advertisement

What’s your opinion

Advertisement