నేను పని చేశాననుకుంటే మళ్లీ గెలిపించండి: కిషన్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

నేను పని చేశాననుకుంటే మళ్లీ గెలిపించండి: కిషన్‌రెడ్డి

Published Fri, Apr 19 2024 4:55 AM

BJP Leader Kishan Reddy Comments In Prajalaku Nivedika Sabha - Sakshi

‘ప్రజలకు నివేదిక’ సభలో కిషన్‌రెడ్డి 

కేంద్రమంత్రిగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై వివరణ 

సుందరయ్య విజ్ఞాన కేంద్రం/చిక్కడపల్లి (హైదరాబాద్‌): సికింద్రాబాద్‌ ప్రజల ఆశీర్వాదంతో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్ర, దేశాభివృద్ధికి తన వంతు కృషి చేశానని సికింద్రాబాద్‌ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి చెప్పారు. ‘నా సేవలను గుర్తించి, నేను పని చేశానని భావిస్తే మళ్లీ నాకే ఓటు వేసి గెలిపించండి..’అని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నామినేషన్‌ వేస్తున్న సందర్భంగా గురువారం లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని పింగళి వెంకటరామిరెడ్డి హాల్లో ఏర్పాటు చేసిన సభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘ప్రజలకు నివేదిక’పేరుతో గత ఐదు సంవత్సరాలలో తాను చేసిన రూ.10 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

రాష్ట్రంలో చేపట్టిన జాతీయ రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణం, కాజీపేట్‌లో నిర్మిస్తున్న రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్, వరంగల్‌లో ఏర్పాటు చేయబోతున్న పీఎం మిత్ర టెక్స్‌టైల్‌ పార్కు, రామగుండంలో కొత్తగా నిర్మించిన ఎరువుల కర్మాగారం, కొత్త థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల గురించి చెప్పారు. హైదరాబాద్‌ మెట్రోకు వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కింద అందించిన నిధులు, సిద్దిపేట జిల్లా ములుగులో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం, ములుగు జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న సమ్మక్క, సారక్క గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం, బీబీనగర్‌ ఎయిమ్స్, హైదరాబాద్‌ ఐఐటీ, పశువుల ఔషధాలకు సంబంధించి పరిశోధనల కోసం నిర్మించిన దక్షణ ఆసియాలోనే అతిపెద్ద బయోమెడికల్‌ రీసెర్చి సెంటర్‌ తదితరాలను వివరించారు.  

మరోసారి ఆశీర్వదిస్తే ఐదేళ్లు సేవ చేస్తా 
సికింద్రాబాద్‌ పార్లమెంటు సభ్యుడిగా తన నియోజకవర్గంలో, జంట నగారాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కూడా కిషన్‌రెడ్డి తెలియజేశారు. మరోసారి ప్రజలు తనను ఆశీర్వదిస్తే మరో ఐదు సంవత్సరాలు ఇదే తరహా సేవలు అందిస్తానని తెలిపారు. లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర ప్రజల కోసం తపన పడుతున్న కిషన్‌రెడ్డి వంటి నాయకులు ఈ సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. సంస్కారం ఉన్న వారికే ఓటు వేయాలన్నారు. తన ఓటు కిషన్‌రెడ్డికే వేస్తానని చెప్పారు. ప్రముఖ సామాజికవేత్త హనుమంతరావు, తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నర్సింహారెడ్డి, మాజీ మంత్రి కృష్ణయాదవ్, బీజేపీ నాయకులు మర్రి శశిధర్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పొన్నాల శ్రీరాములు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement