Sakshi News home page

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ.. ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం

Published Fri, Jan 26 2024 5:32 PM

Brs Parliamentary Party Meeting Chaired By Kcr - Sakshi

సాక్షి, సిద్ధిపేట: కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. ఎర్రవల్లిలోని ఆయన ఫాంహౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో పార్లమెంటు ఉభయ సభల్లో, పలు అంశాలపై అనుసరించాల్సిన వ్యూహాలు, చర్చించాల్సిన విధానాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, పార్టీ పార్లమెంటరీ నేతలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.

తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని కేసీఆర్‌ అన్నారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గళం విప్పాలన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో  తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలి. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగ్‌లో వున్న రాష్ట్ర విభజన హామీల సాధన కోసం ఇప్పడికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని ఆయన పేర్కొన్నారు. నాడైనా నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని  కాపాడలవలసిన బాధ్యత మరోసారి బీఆర్ఎస్ ఎంపీలదేనన్నారు.

కాగా, కేసీఆర్‌కు ఇటీవల తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసంలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న ఆయన ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు.. సర్జరీ అనంతరం నేడు తొలిసారిగా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో అధిక స్థానాల్లో విజయం సాధించేలా బీఆర్ఎస్ ఫోకస్‌ పెట్టింది.

శాసనసభ ఎన్నికల్లో ఎదురైన ప్రతికూల ఫలితాలను అన్ని కోణాల్లో పోస్ట్‌మార్టం చేసిన బీఆర్‌ఎస్‌.. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల ప్రణాళికపై దృష్టి సారించింది. లోక్‌సభ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా రెండు జాతీయ పార్టీలపై పైచేయి సాధించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వైపు ఎన్ని కల సన్నద్ధతను వేగవంతం చేస్తూనే, మరోవైపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపైనా దృష్టి సారించారు. 

Advertisement

What’s your opinion

Advertisement